గులాబీ బాస్ గుడ్లెర్రచేస్తాడనే భయమేనా?

నాకు ఎవరూ లెక్కలేదు, అందరి తాట తీస్తాను అంటాడు రీల్ లైఫ్ హీరో నుంచి రియల్ లైఫ్ లోకి పొలిటికల్ హీరో అవుదామని వచ్చిన ఒక పార్టీ [more]

Update: 2020-05-18 05:00 GMT

నాకు ఎవరూ లెక్కలేదు, అందరి తాట తీస్తాను అంటాడు రీల్ లైఫ్ హీరో నుంచి రియల్ లైఫ్ లోకి పొలిటికల్ హీరో అవుదామని వచ్చిన ఒక పార్టీ నాయకుడు. నేను జాతీయ పార్టీ అధినేతను. నాకు అర్ధ దశాబ్దం రాజకీయ అనుభవం ఉంది. ఎందరో ప్రధానులు, రాష్ట్రపతులను నేనే నియమించాను, జాతీయ చక్రం తిప్పాను అంటారు మరో నేత. అయితే ఈ ఇద్దరికీ పదమూడు జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఉప ప్రాంతం, కరవు నేల రాయలసీమ మాత్రం కళ్లకు ఆనడంలేదు. ఇక్కడ 2019 ఎన్నికల్లో టీడీపీకి, జనసేనకు జనం పెద్దగా ఓట్లు వేయలేదు, దాంతో కూడబలుక్కునట్లుగా సీమ సమస్యలు మాకు అక్కరలేదు అని ఇద్దరు నేతలూ అనుకున్నారో ఏమో కానీ కీలకమైన వేళ బాగానే మౌనం పాటిస్తున్నారు.

నోరు మెదపరేం….

చంద్రబాబు అచ్చమైన రాయలసీమ బిడ్డ. ఆయనది చిత్తూరు జిల్లా. మరి తన జిల్లాతో పాటు మిగిలిన అయిదు జిల్లాలు తాగు నీటికోసం ఎంతలా కటకటలాడుతున్నాయో తెలిసిందే. కానీ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం సామర్ధ్యం పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇస్తే బాబు కనీసం నోరు మెదపలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఉన్న నేత. ఆయనకు ఎక్కువ బాధ్యత ఉంది. కరవు జిల్లాలకు నీరు అందేలా జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి తన మద్దతు ఇవ్వడం ఆయనకు సీమ బిడ్డగా, పార్టీ అధినేతగా, సీఎంగా చేసిన వ్యక్తిగా కనీస ధర్మం. కానీ చంద్రబాబు ఎక్కడా కిక్కురుమనడంలేదు. అంటే చంద్రబాబు పుట్టిన జిల్లా చిత్తూరు తాగు నీరు లేక అల్లల్లాడిపోయినా కూడా తెలుగు వల్లభుడికి అసలు పట్టదా అన్న విమర్శలు వస్తున్నాయి.

కోపమదేనా :

రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 52 అసెంబ్లీ సీట్లకు గానూ టీడీపీకి 2019 ఎన్నికల్లో కేవలం మూడు సీట్లే వచ్చాయి. ఇక జనసేన పార్టీకి పోటీ చేసిన ప్రతీ చోటా డిపాజిట్లు పోయాయి. దాంతో ఈ ఇద్దరు నేతలకు సీమ జనం మీద కోపం వచ్చిందా అంటూ సెటైర్లు పడుతున్నాయి. లేకపోతే కనీసం నోటి ద్వారా అయినా మద్దతు ఇవ్వవచ్చు కదా అని సీమవాసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రతీ రోజూ జాతీయ, అంతర్జాతీయ సమస్యల పైన అటు చంద్రబాబు, ఇటు పవన్ ట్విట్టర్ వేదికగా పుంఖానుపుంఖాలుగా ట్వీట్లు వేస్తారు. మరి ఇపుడు సీమ సమస్య వస్తే మాత్రం పట్టనట్లుగా ఉండడం ఏమి లౌక్యమని జనమే ప్రశ్నిస్తున్నారు.

షేక్ అవుతున్నారా?

ఇక తెలంగాణాలో ఈ ఇద్దరు నేతలు ఉంటున్నారు. గత యాభై రోజులుగా ఇళ్ళకే అతుక్కుపోయారు. పైగా కేసీఆర్ అక్కడ ఉన్నాడు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు మీద తెలంగాణా రాజకీయం మండిపోతోంది. టీయారెస్ పార్టీ గుస్సా అవుతోంది. ఈ టైంలో కనుక నోరు విప్పితే గులాబీ బాస్ గుడ్లెర్రచేస్తాడేమోనని భయం ఉందా అన్న డౌట్లూ వస్తున్నాయి. 2014లో పవన్ పార్టీ ప్రకటన చేసినపుడు వారూ వీరూ చూడకుండా అందరినీ తిట్టేశారు. 2017 నాటికి తెలంగాణాను, కేసీఆర్ ని పొగుడుతూ వచ్చారు. అప్పట్లో బీజేపీని, వెంకయ్యనాయుడుని టార్గెట్ చేశారు. ఇపుడు ఒక్క జగన్ని తప్ప అందరితోనూ బాగానే మ్యానేజ్ చేస్తూ పవన్ తనదైన రాజకీయం నేర్చారని అంటున్నారు. ఇక చంద్రబాబు గురించి చెప్పేదేముంది. అన్ని విధాలుగా పండిపోయారు. దాంతో ఆయన మౌనంలో ఎన్నో అర్ధాలు ఉన్నాయి. మొత్తానికి విశాఖలో ఓ సాధారణ మత్తు డాక్టర్ వీధి గలాటా ఘటనను సైతం వదలకుండా పాలిటిక్స్ చేస్తూ విరుచుకుపడుతున్న చంద్రబాబుకు పోతిరెడ్డిపాడు విషయంలో స్పందించేందుకు అసలు టైమ్
లేకపోయిందంటే నమ్మేదెవరు.

Tags:    

Similar News