ఎంట్రీ అందుకేనటగా

చంద్రబాబు ఎపుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. సవాళ్ళ నుంచే తాను సమాధానాలు వెతుక్కుంటానని. అపుడే తన బుర్ర పాదరసంలా పనిచేస్తుందని, దాన్ని అక్షరాలా నిరూపించేలా కొన్న [more]

Update: 2020-01-02 00:30 GMT

చంద్రబాబు ఎపుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. సవాళ్ళ నుంచే తాను సమాధానాలు వెతుక్కుంటానని. అపుడే తన బుర్ర పాదరసంలా పనిచేస్తుందని, దాన్ని అక్షరాలా నిరూపించేలా కొన్న ఘటనలు టీడీపీలో చోటు చేసుకుంటున్నాయా అనిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరు అంటే నిస్సందేహంగా లోకేష్ అని అంతా చెబుతారు. చంద్రబాబు సైతం ఆయనకు మంత్రి పదవులు, పార్టీ పదవులు కట్టబెట్టారు. రేపటి రోజున లోకేష్ టీడీపీని నడిపిస్తాడని సంకేతాలు కూడా ఇస్తున్నారు. అయితే ఎంతగా చేయి అందించినా కూడా లోకేష్ తగినట్లుగా ఎదగలేకపోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి.

ఆయన వల్లనే …..

ఇక పార్టీ నుంచి వెళ్ళిపోయినా వారంతా కూడా లోకేష్ వల్లనే అంటున్నారు. లోకేష్ ఉన్న టీడీపీ ఎప్పటికీ బాగుపడదు అని కూడా శాపనార్ధాలు పెట్టేసి తప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుతో పాటు హఠాత్తుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అమరావతి రైతుల నిరసనలో పాలుపంచుకోవడం ఆశ్చర్యం కలిగించిన అంశంగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో తన భార్యను ఎపుడూ ఇలాంటి కార్యక్రమాలకు తీసుకురాలేదు. మరి ఇపుడే ఆమెను ఎందుకు తెచ్చినట్లు?

ఎన్టీయార్ బ్లడ్….

ఆమెను ముందుంచి టీడీపీలో చంద్రబాబు ఇకపైన కధ నడిపిస్తారా అన్న డౌట్లు కూడా చాలామందిలో కలుగుతున్నాయి. నిజానికి రాజకీయంగా ముందుకు రావాలంటే అక్క పురంధేశ్వరి కంటే భువనేశ్వరికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆమె రాజకీయ చాణక్యుడు చంద్రబాబు సతీమణి. పైగా ఆమె కూడా ఎన్టీఆర్ కుమార్తె. ఇక సోదరుడు, ప్రముఖ నటుడు బాలయ్య తన కుమార్తెను ఆ ఇంటికే కోడలిగా ఇచ్చాడు కాబట్టి ఆయన మద్దతు కూడా ఆమెకు పూర్తిగా ఉంటుంది. ఇపుడు భార్యతో ఉన్న పళంగా చంద్రబాబు ఇలా నిరసనలకు రావడంతో పాటు పార్టీకి జీవన్మరణ సమస్యగా ఉన్న ఈ అమరావతి రాజధాని అంశంలో ఆమెను కూడా ముందు పెట్టడంతో టీడీపీలో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి.

బాబుకు తోడుగా…

అప్పట్లో ఇదే వయసులో అన్న ఎన్టీఆర్ తనకు తోడుగా లక్ష్మీ పార్వతిని రెండవ భార్యగా తెచ్చుకున్నారు. ఆమెను పక్కన ఉంచుకుని ప్రసంగాలు చేసేవారు. టూర్లు కూడా చేసేవారు. అలా విజయాలూ భారీగా సాధించారు. చంద్రబాబు ఇపుడు డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు బయటకు కనబడకపోయినా వయోభారం ఉంది. దాంతో ఆయన ఇపుడు సతీమణి సాయంతో కొత్త ఏడాది నుంచి కొత్త రాజకీయం చేయాలనుకుంటున్నారా అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి.

చేదోడు అవుతారా…?

ఓ వైపు పార్టీ నుంచి తమ్ముళ్ళు జారుకుంటున్నారు. మరో వైపు టీడీపీలో చంద్రబాబు పట్టు జారుతోంది. ఈ సమయంలో అన్న గారి కుమార్తెగా, తన సతీమణి భువనేశ్వరి చేదోడు వాదోడుగా ఉంటే అది పార్టీకి అండగా ఉండడమే కాదు, మహిళా సెంటిమెంట్ కూడా రక్తి కడుతుందని, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు భావించి ఈ ఎత్తుగడ వేశారని భావిస్తున్నారు. మొత్తానికి భువనేశ్వరి అనూహ్యమైన ఈ ఎంట్రీ కేవలం ఇక్కడికే పరిమితం అవుతుందా లేక ముందు మరింతగా కొనసాగుతుందా అన్న దాని బట్టి టీడీపీ వారసత్వం ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News