తోడల్లుళ్ళు కలిసిపోతారా ?

మొత్తానికి నందమూరి బాలకృష్ణ షష్టి పూర్తి కాదు కానీ అటు సినీ రాజకీయాలను, ఇటు ఆంధ్రా రాజకీయాలను వేడెక్కించేశారు. అంతా ఊహించినట్లుగానే నందమూరి కుటుంబాన్ని గట్టిగానే బలం [more]

Update: 2020-06-12 12:30 GMT

మొత్తానికి నందమూరి బాలకృష్ణ షష్టి పూర్తి కాదు కానీ అటు సినీ రాజకీయాలను, ఇటు ఆంధ్రా రాజకీయాలను వేడెక్కించేశారు. అంతా ఊహించినట్లుగానే నందమూరి కుటుంబాన్ని గట్టిగానే బలం చేసేలా తెర వెనక కసరత్తు చేశారని అంటున్నారు. తన ఇంటికి వచ్చిన ఇద్దరు బావయ్యలను ఒక్కటి చేసే అతి పెద్ద ప్రయత్నం బాలయ్య చేశారని ఇపుడు తెలుగుదేశం రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. చంద్రబాబు మామూలుగా అయితే తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే చాలా దూరం జరిగేవారు కానీ, ఇపుడు ఇద్దరూ దాదాపు ఒకే సీన్ లో ఉన్నారు. ఇద్దరూ డెబ్బయి పడిలోకి అడుగుపెట్టేశారు. ఒక విధంగా జీవిత రాజకీయ చరమాంకంలో ఉన్నారు. ఇలా ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు కాబట్టి బాలయ్య పని తేలిక అయిందని అంటున్నారు.

పాతికేళ్ళ తరువాత…?

అపుడెపుడో అన్న నందమూరిని గద్దె దించేందుకు దగ్గుబాటి, చంద్రబాబు చేతులు కలిపారు. నాడు చంద్రబాబు దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసారు. దాంతో నాటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇపుడు దగ్గుబాటి రాజకీయంగా యాక్టివ్ గా లేరు. ఆయన సతీమణి పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు. కుమారుడు చెంచురాం హితేష్ కోసమే దగ్గుబాటి తపన అంటున్నారు. ఇన్నాళ్ళూ చంద్రబాబు ఒక మెట్టు దిగకపోవడం వల్లనే టీడీపీ అంటే దగ్గుబాటి విముఖంగా ఉండేవారు. ఇపుడు బాలయ్య మధ్యవరిత్వంతో ఆయన మెత్తబడ్డారని, తన పరోక్ష సహకారం టీడీపీకి అందిస్తారని ప్రచారం అయితే సాగుతోంది.

పురంధేశ్వరి ఓకేనా…?

ఇక బీజేపీలో చేరినా కూడా సరైన విలువా గౌరవం దక్కక పురంధేశ్వరి ఇపుడు ఇబ్బందులో ఉన్నారు. ఆమె కొన్నాళ్ళుగా బీజేపీలో సౌండ్ చేయడంలేదు. దాంతో బాలయ్య తన అక్కను కూడా టీడీపీలో చేరాలని కోరినట్లుగా చెబుతున్నారు. ఇక నారా లోకేష్ సైతం పెద్దమ్మను కలిసి టీడీపీకి మద్దతు ఇవ్వాలని అర్ధించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె కనుక వచ్చి చేరితే పార్టీ బలపడుతుందని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు తోడల్లుళ్ళూ బాలయ్య షష్టి పూర్తి పుణ్యమా అని కలసి మెలసి ఉండేలా ఒప్పందం కుదిరింది అంటున్నారు.

లోకేష్ సారధిగా….

ఇక చంద్రబాబు కంటే కూడా కొత్తతరం నేత లోకేష్ మీద నమ్మకంతోనే దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీ వైపు వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఓ విధంగా టీడీపీలో చంద్రబాబు హవా తగ్గిందని కూడా చెబుతున్నారు. బాలయ్య తన సొంత అల్లుడికి పట్టాభిషేకం కోసం నారా నందమూరి దగ్గుబాటి కుటుంబాలను ఏకం చేస్తున్నారని అంటున్నారు. రేపటి రోజున జగన్ ని ఢీ కొట్టాలంటే ఇది అవసరం అని బాలయ్య మాటకు చంద్రబాబు సహా అంతా ఒకే అన్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మరి అదే కనుక నిజం అయితే టీడీపీలో అనూహ్యమైన పరిణామాల‌ను చూసే అవకాశం ఉంది. ఇది నిజంగా నాటి ఎన్టీయార్ చనిపోక ముందు ఉన్న టీడీపీ మాదిరిగా కలసి మెలసి అంతా ఒక్కటిగా అవుతారా అన్నది వేచి చూడాలి మరి.

Tags:    

Similar News