చెంత చేరింది అందుకేనా?

వామపక్షాలు చాలాకాలంగా సొంతంగా రాజకీయాలు చేయడం మానుకున్న సంగతి తెలిసిందే. అవి అవసరాన్ని బట్టి, అప్పటి పరిస్థితుల బట్టి ఇతర రాజకీయ పార్టీలతో చెట్టపట్టాలు వేసుకోవడం ద్వారానే [more]

Update: 2020-01-11 09:30 GMT

వామపక్షాలు చాలాకాలంగా సొంతంగా రాజకీయాలు చేయడం మానుకున్న సంగతి తెలిసిందే. అవి అవసరాన్ని బట్టి, అప్పటి పరిస్థితుల బట్టి ఇతర రాజకీయ పార్టీలతో చెట్టపట్టాలు వేసుకోవడం ద్వారానే తమ మనుగడ ఇదే అనుకుంటూ తృప్తి పడుతున్నాయి. ఏపీలో సీపీఐ నారాయణ వరకూ ఆ పార్టీ కొంత దూకుడుగా ఉన్నా రామకృష్ణ కార్యదర్శి అయ్యాక మాత్రం పార్టీ పూర్తిగా పడకేసిందనే చెప్పాలి. పేరుకు ఉద్యమాలు చేస్తూ చట్టసభలో ఒక్క సీటు పొత్తులో దక్కినా చాలు అన్నట్లుగా కొత్తగా పుట్టిన పార్టీల వెనక కూడా తోక పార్టీగా మారిపోవడానికి చూస్తోంది. ఈ విషయంలో సీపీఎం కాస్తా భిన్నం అని చెప్పాలి. ఇదిలా ఉండగా గత ఎన్నికల వరకూ జనసేనతో అంటకాగిన సీపీఐకి ఇపుడు హఠాత్తుగా చంద్రబాబు మంచిగా కనిపిస్తున్నారు. దాంతో తమ సిధ్ధాంతాలను అన్నీ పక్కన పెట్టేసి టీడీపీకి సీపీఐ జై కొట్టేస్తోంది.

అన్నీ అక్కడేనట….

నిజానికి అధికార వికేంద్రీకరణ కోసం మొదట గొంతు చించుకున్నదే సీపీఐ. ఆ పార్టీ కర్నూలులో హైకోర్టు పెట్టాలని గట్టిగా డిమాండ్ చేసింది. అపుడు చంద్రబాబు అన్నీ అమరావతిలోనే అంటూ జబర్దస్తుగా ఒకే చోట పెడుతూంటే సీమ అభివృధ్ధి అవసరం లేదా అని గర్జించింది కూడా ఇదే సీపీఐ. ఇపుడు మాత్రం అన్నీ అమరావతిలోనే ఉండాలంటూ అచ్చం చంద్రబాబు భాషనే వాడుతున్నారు సీపీఐ రామకృష్ణ. పైగా కర్నూలులో ఒక్క హైకోర్టు పెట్టేస్తే రాజధాని అవుతుందా? అక్కడంతా బాగుపడిపోతారా? అంటూ తాము ఒకనాడు చేసిన డిమాండ్ నే ఆయన తప్పుపట్టేదాకా పోతున్నారు. చంద్రబాబు తో కలసి ప్రతీ రోజూ జై అమరావతి అంటున్నారు.

బాబుతోనేనా…?

దాదాపుగా దశాబ్ద కాలం వరకూ చంద్రబాబుకు దూరంగా ఉన్న వామపక్షాలు ఇపుడు మెల్లగా ఆయన చెంతన చేరేందుకు చూస్తున్నాయి. ఈ విషయంలో తొందరపాటు చూపిస్తోంది మాత్రం సీపీఐ. సీపీఎం ఇంకా చంద్రబాబుకు శీల పరీక్ష చేయాలనుకుంటోంది. చంద్రబాబు ఇప్పటికీ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు, ఆయన మోడీని తెగ పొగుడుతున్నారు. అయినా సీపీఐకి ఆయన నచ్చడమే పెద్ద వింత. ఇక చంద్రబాబు విపక్షంలో ఉన్నారు. ఆయన పక్కన చేరితే రేపటి రోజున పొత్తుల‌లో భాగంగా ఒకటో రెండో సీట్లు వస్తాయన్న ఆలోచన సీపీఐకి ఉంది కాబోలు. అందుకే మూడు రాజధానుల మీద తమ వాదన చెప్పకుండా చంద్రబాబు ఎలా అంటే అలా అంటున్నాయి వామపక్షాలు.

జగన్ పైన‌ ద్వేషమా…?

నిజానికి సీపీఐ రామకృష్ణ ఎపుడూ జగన్ మీద సానుకూలంగా లేరని వైసెపీ నేతలు అంటారు. ఆయన జగన్ సీఎం కాకూడదనే గట్టిగా పనిచేశారని, ఇపుడు జగన్ ని కొత్తగా వ్యతిరేకించేది ఏముందని కూడా అంటారు. నిజానికి వామపక్షాలు వ్యక్తులను వ్యతిరేకించవు, కేవలం సిధ్ధాంతాలు మాత్రమే తప్పుపడతాయి. కానీ సీపీఐలో మాత్రం ఇపుడు కొత్త ధోరణి కనిపిస్తోంది. అందుకే జగన్ ని గట్టిగా వ్యతిరేకిస్తున్న పవన్ మాదిరిగానే రామకృష్ణ కూడా గుడ్డి వ్యతిరేకతతోనే చంద్రబాబు చెంతకు చేరారని అంటున్నారు. ఇందులో రాజకీయాలు తప్ప సిధ్ధాంతాలు లేవని అంటున్నారు. అదే సమయంలో నిన్నటిదాకా చంద్రబాబుని ఎందుకు తిట్టామో, దేని మీద విభేదించామో సీపీఐ మరచిపోవడమే అసలైన విడ్డూరం. ఇలాగే కనుక అవకాశవాద రాజకీయాలు చేస్తే ఉన్న ఉనికికి కూడా ముప్పేనని అసలైన వామపక్షవాదులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News