అనుమానం..అవమానం...!

Update: 2018-04-14 15:30 GMT

ఒకరు ఇరవై సంవత్సరాల క్రితమే జాతీయనాయకునిగా ఎదిగిన వ్యక్తి. మరొకరు ఇటీవలి కాలంలో దేశంలోని పరిస్థితుల ఆధారంగా జాతీయనేత కావాలని తహతహలాడుతున్న నాయకుడు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరూ దేశవ్యాప్తంగా తమకున్న ప్రాముఖ్యం, ప్రాధాన్యం, రాజకీయ ఆవశ్యకతను పరీక్షించుకున్నారు. ఒకరు ప్రత్యేక హోదాకు మద్దతుగా దేశంలోని ఇతర పక్షాల మద్దతు కూడగట్టడమనే సాకుతో ఢిల్లీలో మకాం వేసి జాతీయనాయకులను కలవడానికి ప్రయత్నించారు. ఒకే వేదికపైకి తేవాలనీ యోచించారు. మరొకరు బీజేపీ, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ పేరిట కలకత్తా,బెంగుళూరు పర్యటించి వచ్చారు. వివిధ పక్షాలతో చర్చలు, సంప్రతింపులు మొదలుపెట్టారు. ఆశలు, ఆశయాలు ఎంత ఘనంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవం వారిని వెక్కిరిస్తోంది. ఈ ఇద్దరికీ పరిస్థితులేమంత సానుకూలంగా కనిపించడం లేదు. ఒకరివైపు మిగిలిన పక్షాలన్నీ అనుమానపు దృక్కులతో చూస్తుంటే మరొకరిని పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఇద్దరు చంద్రుల యత్నాలకు రాజకీయ శక్తులు సహకరించడం లేదంటున్నారు పరిశీలకులు. దక్షిణాదిన జాతీయ ప్రాముఖ్యం వహించగలరన్న ఆశాభావం ఉన్న ఈ నాయకులకు ఎదురుగాలి వీస్తుండటం తో 2019లో తమతమ రాష్ట్రాలకే వీరి రాజకీయ చాలనం పరిమితం కావాల్సి వస్తుందంటున్నారు.

అనుమానంలో అసలు కారణం...

ప్రస్తుతమున్న పరిస్థితుల ఆధారంగా బేరీజు వేస్తే తెలంగాణలో కేసీఆర్ తిరుగులేని నాయకుడన్న మాట వాస్తవం. అయితే పార్టీగా టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. పార్టీ నిర్మాణపరమైన లోపాలు, స్థానిక ప్రజాప్రతినిధులపై వ్యక్తమవుతున్నఅసంతృప్తి, ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెసుకు కలిసివస్తున్న సామాజిక సమీకరణలు టీఆర్ఎస్ కు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి, టీఆర్ఎస్ కు జాతీయంగా ప్రాముఖ్యం వహించబోతున్న పార్టీగా ఇమేజ్ కల్పించాలని సంకల్పించారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. నిన్నామొన్నటివరకూ బీజేపీ పట్ల కొంత సానుకూల వైఖరి కనబరిచిన కేసీఆర్ ఒక్క సారిగా స్వరం మార్చడంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాంగ్రెసు పార్టీ దేశవ్యాప్తంగా బలపడుతోంది. కొత్తశక్తులను , ప్రాంతీయపార్టీలను కలుపుకుని బీజేపీని 2019లో నిలువరించే ప్రయత్నం ప్రారంభించింది. అన్నిపార్టీలు ఏకతాటిపైకి వచ్చినప్పుడే మోడీని ఓడించగలమని రాహుల్ పేర్కొనడంలో ఆంతర్యమిదే. అయితే బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకుండా నిరోధించేందుకే ఫెడరల్ ఫ్రంట్ వంటి ప్రయత్నాలు దోహదం చేస్తాయనే విమర్శలు వినపడుతున్నాయి. దీనివల్ల అంతిమంగా బీజేపీ లాభపడుతుందనే అనుమానాలున్నాయి.

తెలుగు చీలిక ..కన్నడ పాచిక...

కర్ణాటకలో సిద్ధరామయ్య నాయకత్వంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెసు పార్టీ బలంగా ప్రయత్నిస్తోంది. దక్షిణాది ముఖద్వారంగా భావించే కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా 2019 తమదే నని చాటిచెప్పాలని బీజేపీ తహతహలాడుతోంది. పరిధులు, పరిమితులు , రాజకీయ మర్యాదలను అతిక్రమించి ఈ రెండు పార్టీలు హోరాహోరీ సవాళ్లు విసురుకుంటున్నాయి. జనాభాలో గణనీయమైన సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వనందుకు తెలుగు ఓటర్లలో బీజేపీ పట్ల కొంత అసంతృప్తి ఉంది. ఇది కమలం పార్టీకి కష్టాలు తేవచ్చు. కాంగ్రెసుకు అనుకూలించవచ్చు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట తొలుత సంప్రతించాల్సిన వ్యక్తి మాజీ ప్రధాని దేవెగౌడ. కానీ ఆయన సంగతి నిన్నటివరకూ గుర్తు పెట్టుకోని కేసీఆర్ హఠాత్తుగా కన్నడ భూమిపై అడుగుపెట్టి ఆయనను తన ఫ్రంట్ వలలోకి లాగేశారు. జాతీయంగా ఏదో అవకాశం రాకపోతుందా? అని ఎదురుచూస్తున్న దేవెగౌడ తెలంగాణ సీఎం మాటల చాతుర్యానికి మంత్రముగ్ధులైపోయారు. జేడీఎస్ తరఫున తాను ప్రచారం నిర్వహిస్తానని హామీ ఇచ్చేశారు కేసీఆర్. ఉత్తర కర్ణాటకలో ముస్లిం జనాభా కూడా అధికంగానే ఉంది. కేసీఆర్ తెలుగు, ఉర్దూల్లో అనర్గళంగా మాట్లాడగల వక్త. కాంగ్రెసు వైపు ఓట్ల సమీకరణ సాగకుండా తెలుగు,మైనారిటీ ఓట్లలో జేడీఎస్ కు వాటా సాధించిపెట్టేందుకు తెలంగాణ సీఎం ఉపకరిస్తారంటున్నారు. తమకు వ్యతిరేకంగా కాంగ్రెసు వైపు ఓట్లు సంఘటితం కాకుండా చీలి పోవడం అంతిమంగా బీజేపీకే లాభకారకం. ఈ విషయంలోనూ కేసీఆర్ శైలిపై కాంగ్రెసు, ఇతర ప్రతిపక్షాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెసులకు వ్యతిరేకమంటూ తెలంగాణ సీఎం చేస్తున్న వాదన సహేతుకమనిపిస్తున్నప్పటికీ విశ్వసనీయత కరవు అవుతోంది. ఆయన యత్నాలు బీజేపీకి లబ్ధి చేకూర్చబోతున్నాయనే సందేహాలు బలపడుతున్నాయి.

బాబు జెండా బలహీనం...

కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఇచ్చిన అవిశ్వాసం దాదాపు అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ఉపయోగపడింది. కాంగ్రెసు,వామపక్షాల సహా ప్రధాన పార్టీలు దీనికి మద్దతు పలికాయనే చెప్పాలి. ఇది టీడీపీకి నైతికంగా భరోసానిచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీలను కలిసి తమ గోడు వెలిబుచ్చుకునేందుకు ప్రయత్నించారు. సానుభూతే తప్ప టీడీపీ ఎజెండాపై పోరాటం చేస్తామనే భరోసా వారెవ్వరూ ఇవ్వలేకపోయారు. అవిశ్వాసంపై కేంద్రాన్ని నిలదీయడం వెనక బీజేపీపై వ్యతిరేకతే తప్ప టీడీపీపై ప్రేమ లేదన్న అంశం కరాఖండిగా తేలిపోయింది. దాంతో ఢిల్లీ పర్యటనలో బాబు డీలాపడిపోయారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక బలమైన రాష్ట్రం కావడంతో ముఖ్యమంత్రిగా తనకు జాతీయ నాయకులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడటువంటి అవకాశాలు కనిపించడం లేదన్న సంగతి కూడా ఏపీ సీఎంకు సందేహాలకు అతీతంగా స్పష్టమైపోయింది. కనీసం నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా కొన్ని ప్రసారం కాలేదు. దాంతో గతానికి, ఇప్పటికీ ఉన్న తేడా తెలియవచ్చింది. జాతీయ రాజకీయాలపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటించడం వెనక సంగతిదేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేసీఆర్ తో కలిసిన వారిలో మమతా బెనర్జీ మాత్రమే ప్రస్తుత రాజకీయాల్లో ప్రాముఖ్యమున్న నాయకురాలు. ఆమె కూడా కాంగ్రెసు లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదని తేల్చేశారు. మొత్తమ్మీద అనుమానమూ, అవమానమూ ఇద్దరు చంద్రులనూ వెన్నంటి నడుస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News