డామిట్ కథ...అడ్డం తిరుగుతోంది

Update: 2018-04-16 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రివర్స్ పోలరైజేషన్ ప్రక్రియ మొదలైంది. అధికార పార్టీకి ఇది పెద్ద తలనొప్పి కాబోతోంది. మిగిలిన రెండు ప్రధాన పార్టీలవైపూ చూసే ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోంది. ఏడాది క్రితం వరకూ నియోజకవర్గాల్లోని ప్రధాన నాయకులకు తెలుగుదేశం పార్టీ ముఖ్య ఆకర్షణగా ఉంటూ వచ్చింది. 20 మందికిపైగా వైసీపీ ఎమ్మెల్యేలను గూటిలోకి తెచ్చుకుని వారిలో నలుగురికి మంత్రిపదవులు సైతం కట్టబెట్టింది టీడీపీ. వైసీపీలో ఇన్ ఛార్జి స్థాయి నాయకులను సైతం భారీగానే ఆకర్షించగలిగింది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని భరోసా నిస్తూ ఇబ్బడిముబ్బడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది. వైసీపీని బలహీన పర్చడమే లక్ష్యంగా సామదానభేదోపాయాలన్నిటినీ ప్రయోగించింది. రెండేళ్లపాటు సాగిన ఆకర్ష్ మంత్రంలో చాలామంది పడిపోయారు. ఇప్పుడిప్పుడే పార్టీలు ఫిరాయించిన వారికి వాస్తవం బోధపడుతోంది. ఎన్నికల గడువు దగ్గర పడుతూ ఉండటంతో అధికారపార్టీలో ఉక్కపోత మొదలైంది. తమకు సీట్లు వస్తాయో రావో తెలియని సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు పక్కదారులు చూస్తున్నారు. దీర్ఘకాలంగా పార్టీలో ఉన్నవారూ ప్రత్యామ్నాయం వెదుక్కొంటున్నారు.

రాజ్యసభతో మొదలైన గడబిడ ...

రాజ్యసభ ఎన్నికలను ఏకపక్షం చేసుకుని మూడు స్థానాలనూ గెలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికలో ఆ ఆశ నెరవేరలేదు. వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టారు. నిజానికి నలుగురు ఎమ్మెల్యేలను పట్టుకోగలిగితే చాలు ఒక్క రాజ్యసభ స్థానం కూడా విపక్ష వైసీపీకి దక్కకుండా చేయవచ్చు. 23 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే పార్టీ ఫిరాయింప చేయగలిగిన తెలుగుదేశానికి అదేమంత పెద్ద కష్టంకాబోదని రాజకీయ పరిశీలకులు కూడా భావించారు. కానీ ఆరునెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేసినా తెలుగుదేశానికి అవసరమైన ఆ సంఖ్య దక్కలేదు. అనేక రకాలుగా చూపిన ప్రలోభాలు పనిచేయలేదు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగదన్న విషయం స్పష్టమైపోయింది. పైపెచ్చు రాజకీయ గాలులు అధికారపార్టీకి పూర్తిగా అనుకూలంగా లేవన్న అంశమూ ఎమ్మెల్యేలు గ్రహించగలిగారు. ఇప్పటికే ఆశావహుల సంఖ్య పెరిగిపోయి తెలుగుదేశంలో విపరీతమైన పోటీ ఏర్పడింది. కొత్తగా వచ్చిన తమను కరివేపాకులా వాడుకుని ఎన్నికల్లో దూరం పెడితే అడిగే దిక్కుండదని భావించారు. దీంతో టీడీపీ ఆకర్షక మంత్రం పెద్దగా పనిచేయలేదు. మరోవైపు కేంద్రం కూడా శత్రుపక్షంగా మారిన పరిస్థితుల్లో టీడీపీకి రాజకీయ ఇబ్బందులూ ఎదురవుతాయి. వీటన్నిటినీ పసిగట్టిన ఎమ్మెల్యేలు పార్టీ గోడ దూకడానికి ఇష్టపడలేదు. దీంతో టీడీపీ పాచిక పారలేదు. వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డిని కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేకపోయారు. ఆయనను అభ్యర్థిగా ఎంచుకోవడంలోనే వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అధికార పార్టీ ధనబలం తమ పార్టీపై పనిచేయకుండా కట్టడి చేసింది. వేలకోట్ల రూపాయల టర్నోవర్ తో వ్యాపారం చేసే వేమిరెడ్డి అవసరమైతే వందల కోట్లు గుప్పించగల సమర్థుడు. అందుకే ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపింది. పరిస్థితులను ఆకళింపు చేసుకుని టీడీపీ వెనుకంజ వేయాల్సి వచ్చింది. అధికారపక్షంపై ఆధిక్యాన్ని చాటుకున్న తొలి దెబ్బగా వైసీపీ వర్గాలు ఈ విజయాన్ని చెబుతున్నాయి. ఈ ఒక్క గెలుపుతో పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెరిగింది.

ఆవలి పక్షాలకు అడ్వాంటేజ్...

ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న పార్టీ జనసేన. ముఫ్ఫైఏళ్ల తర్వాత కొత్త రాజకీయం రావాలనే నినాదం ఎత్తుకొంటోంది. వైసీపీని కొత్త రాజకీయశక్తిగా ఎవరూ చూడటం లేదు. కాంగ్రెైసు,రాజశేఖరరెడ్డిల కలబోతగానే ప్రజలు భావిస్తున్నారు. జనసేన ఇంకా ప్రధాన ప్రతిపక్ష స్థాయిని అందుకోలేదు. అందువల్ల రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్రల్లో వైసీపీ వైపు నియోజకవర్గాల్లోని పెద్ద నాయకులు దృష్టి సారిస్తున్నారు. టీడీపీలోని ఆరేడుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో సంప్రతింపులు జరిపినట్లు సమాచారం. గతంలో పార్టీఫిరాయించిన మరో అయిదుగురు ఎమ్మెల్యేలు టిక్కెట్లు గ్యారంటీ ఇస్తే పూర్వాశ్రమంలోకి వచ్చేస్తామని మధ్యవర్తుల ద్వారా వైసీపీ అగ్రనాయకత్వంతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే విశ్వాసరాహిత్యమనేది ఇరుపక్షాలనూ వెన్నాడుతోంది. కుప్పిగంతులు వేసిన ఎమ్మెల్యేలను తిరిగి చేరదీస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళతాయని జగన్ ఒకటిరెండు సందర్బాల్లో పెద్దనాయకులతోనే అన్నట్లు వినికిడి. టీడీపీ నుంచి వచ్చేవారిని ఇప్పటికిప్పుడు కాకుండా ఎన్నికలకు బాగా గడువు దగ్గర పడిన సమయంలో చేర్చుకుంటే ఆ పార్టీని చావు దెబ్బతీసినట్లవుతుందనే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల గెలిచే పార్టీ తమదేనన్న సంకేతాలు ఇవ్వడంతోపాటు నైతికంగా టీడీపీ శ్రేణులు డీలాపడతాయని అంచనా వేస్తోంది వైసీపీ.

ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన వైపు....

మరోవైపు మధ్యాంధ్రలో జనసేన దెబ్బ తగలబోతోంది అధికారపార్టీకి. జనసేన అధినేత టిక్కెట్ల గ్యారంటీ ఇస్తే పార్టీకి పనిచేస్తామంటూ ఆరుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ కు ఆంతరంగికుల ద్వారా ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఉభయగోదావరి విశాఖ జిల్లాల కు చెందిన ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ ఏ విషయం తేల్చి చెప్పలేదంటున్నారు. కొత్త రాజకీయం కావాలంటూ పదేపదే చెబుతూ పాతసరుకును తెచ్చిపెట్టుకుని సాధించేదేమిటన్న శషభిషలు పార్టీలో కొనసాగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేనకు అభ్యర్థుల కొరత లేదు. కోట్ల రూపాయలు వెచ్చించేందుకూ చాలామంది సిద్దంగానే ఉన్నారు. అయితే అనుభవం అంతంతమాత్రమే. పవన్ క్రేజు, గ్లామర్ ల మీద ఆధారపడే గెలవాల్సి ఉంటుంది. అదే ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నవారైతే ప్రజలతో పరిచయం ఉండటంతో గెలుపు సులభసాధ్యమవుతుందనే మరోవాదన ఉంది. ఎమ్మెల్యేలు అన్న ముద్ర లేకపోయినా వైసీపీ, టీడీపీల్లో ఉన్న స్వచ్ఛమైన ట్రాక్ రికార్డు కలిగిన నాయకులను తీసుకోవడానికి జనసేనకు అభ్యంతరం లేదని ఆ పార్టీ అధికారప్రతినిధులు పలు సందర్బాల్లో పేర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ భేటీల్లో చెప్పిన విషయాల ఆధారంగానే వీరు ఆ మేరకు హామీ ఇస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో మాత్రం జనసేనానిదే చివరి మాట . దీంతోనే కొంత తర్జనభర్జన పడుతున్నారు. మొత్తమ్మీద సీమ, ఉత్తరాంధ్రల్లో వైసీపీకి, కృష్ణా,గుంటూరు, తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాల్లో జనసేనకు టీడీపీ నేతల తాకిడి తప్పకపోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News