బాబుకు ఆ విషయంలో బెంగలేదట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అందరూ రాజకీయ చాణక్యుడు అంటారు. భూత భవిష్యత్తు వర్తమానాలను బేరీజు వేసుకుని అడుగు ముందుకు వేస్తారని కూడా చెబుతారు. చంద్రబాబు పొలిటికల్ [more]

Update: 2019-07-23 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అందరూ రాజకీయ చాణక్యుడు అంటారు. భూత భవిష్యత్తు వర్తమానాలను బేరీజు వేసుకుని అడుగు ముందుకు వేస్తారని కూడా చెబుతారు. చంద్రబాబు పొలిటికల్ కెరీర్లో ఈ విధమైన అంచనాలతోనే ఎక్కువ సక్సెస్ లు చూశారు కూడా. ఇక తాజా ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలు విఫలం అయ్యాయి కానీ చంద్రబాబు అనేక సార్లు తన ముందు చూపుతో రాజకీయంగా బలపడ్డారు, లాభపడ్డారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది, జగన్ జీవితాశయం అయిన ముఖ్యమంత్రి కల నెరవేరింది. విపక్ష నేతగా చంద్రబాబు తన ఒకప్పటి పాత్రలోకి మారిపోయారు. ఏపీలో, దేశంలో జరుగుతున్న తాజా రాజకీయాల మీద చంద్రబాబు ఇపుడిపుడే అంచనాకు వస్తున్నారు. అందుకే ఆయనలో కొత్త ఆశలు, కొత్త ధీమా కనిపిస్తున్నాయి.

బీజేపీకి చోటే లేదు….

ఏపీలో మేమే అధికారంలోకి వచ్చేస్తున్నాం, మేము బలంగా ఉన్నాం, మాకు ఎదురులేదు, టీడీపీ పని అయిపోయింది, ఈ రకమైన ప్రకటనలతో కమలనాధులు యమ జోరు చేస్తున్నారు. పనిలో పనిగా టీడీపీ నుంచి జనాలను కూడా కొంతమందిని పార్టీలో కలుపుకుంటున్నారు. మరి ఏపీలో రాజకీయం అంతా కాషాయమయం అవుతుందా ఆ పార్టీ పట్ల జనాల్లో మార్పు ఏమైనా వచ్చిందా అన్న దానిపై రాజకీయ మేధావులు సైతం నో అనేస్తున్న పరిస్థితి. బీజేపీకి వాపుగానే చూస్తున్న వాతావరణం ఉంది. మరి దీని మీద చంద్రబాబు కూడా ఇదే రకమైన ఆలోచనల్లో ఉన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఎదగలేదని….

ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ బలపడే ప్రసక్తే లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఏపీలో ఆ పార్టీకి బేస్ లేదని, ఇక్కడ ఉన్న రాజకీయ, సామాజిక సమీకరణలు బీజేపీ ఒక శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఇవ్వవని కూడా చంద్రబాబు విశ్లేషిస్తున్నారు. తన పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి నేతలు చేరుతారన్న దాని మీద చంద్రబాబు రియాక్షన్ ఇది. ఒక్క ఏపీలోనే కాదు, కేరళ, తమిళనాడులలో కూడా బీజేపీ ఎదిగేందుకు అవకాశలు లేనే లేవని బాబు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబు బీజేపీలోకి తమ పార్టీ వారు ఎంతమంది వెళ్ళినా బేఫికర్ గా ఉన్నారు.

అదీ బాబు ఆలోచన….

బీజేపీలోకి దేశం నాయకులు వెళ్ళడం వల్ల అంతిమంగా టీడీపీక లాభమని కూడా చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు. వారు ఎటూ వైసీపీలోకి పోలేక బీజేపీలో ఉన్నారు. రేపు టీడీపీ ఏపీలో గట్టిగా పుంజుకుంటే వారు తిరిగి సైకిలెక్కడం ఖాయం. ఈ లోగా అక్కడ నుంచే తగిన సాయం చేస్తారు. ఇక బీజేపీలో ఎంతమంది చేరినా ఆ పార్టీ ఓట్ల శాతం పెరగదు, 2024 ఎన్నికల్లో బీజేపీతో ఒకవేళ పొత్తు కుదిరితే కూడా అది టీడీపీకే లాభం, ఇదీ చంద్రబాబు రాజకీయ ఆలోచనలు. అందువల్లనే ఆయన కమలాన్ని చూసి కలవరపడడంలేదు.

.

Tags:    

Similar News