బాబు వ్యూహం అదిరిపోతుందా..?

ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి అధికారాన్ని చేజారకుండా చూసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించి భారీ వ్యూహాలనే రచిస్తున్నారు. ఎన్నికల వరకు [more]

Update: 2019-02-03 12:30 GMT

ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి అధికారాన్ని చేజారకుండా చూసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించి భారీ వ్యూహాలనే రచిస్తున్నారు. ఎన్నికల వరకు దొరికిన ఏ అవకాశాన్ని కోల్పోకుండా… ఒక్క క్షణం కూడా వృధా కానీయకుండా .. ప్రతీ అంశాన్నీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన పింఛన్ల పెంపు, పసుపు – కుంకుమ వంటి పథకాలతో అటు పింఛన్ల లబ్ధిదారులైన వృద్ధులు, డ్వాక్రా మహిళలను ఆకట్టుకునేందుకు శక్తిమేర ప్రయత్నించారు. తాజాగా, యువతను సైతం తన వైపు తిప్పుకోవాలని లక్ష్యంతో నిరుద్యోగ భృతిని రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి, ఇది గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే అయినా ఇటీవలే అమలు చేస్తున్నారు. ఉద్యోగం లేని యువతకు రూ.1000 చొప్పున చెల్లిస్తున్నారు. తాజాగా, ఈ మొత్తానికి రూ.2000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు ఆయన కన్ను రైతులపై కూడా పడింది. తెలంగాణలో ‘రైతుబంధు’ పథకం తరహాలోనే ఓ పథకానికి ఆయన రూపకల్పన చేస్తున్నారు.

ఫిబ్రవరి 10 లోపు వరాల జల్లు…

వాస్తవానికి, రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న పథకాలు అమలు చేయడమే కష్టం. ఇక, కొత్త పథకాలు, లబ్ది పొందే మొత్తాన్ని రెట్టింపు చేయడమంటే పూర్తిగా తలకు మించిన భారం అవుతుంది. అయినా, ఎన్నికలు సమీపిస్తున్నందున చంద్రబాబు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు నెలల్లో అన్నివర్గాల ప్రజలకు వీలైనంత లబ్ది కలిపించాలని ప్రయత్నిస్తున్నారు. రైతు కోసం కూడా రైతుబంధు తరహాలో ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో ఓ భారీ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటం, అది అయిపోగానే మార్చి మొదటి వారంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో ఆయన త్వరపడుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ లోగానే వీలైనన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రారంభోత్పవాలు, శంకుస్థాపనలు కూడా జరపాలని భావిస్తున్నారు.

ప్రత్యేక హోదా సెంటిమెంట్ తో….

ఇక, ప్రభుత్వపరంగానే కాకుండా పార్టీ పరంగానూ ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ప్రతీరోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా కార్యచరణ కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా రూట్ మ్యాప్ కూడా తయారవుతోంది. ఇదే సమయంలో మరోసారి ప్రత్యేక హోదా సెంటిమెంట్ ను బలంగా తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇందుకు పార్లమెంటు సమావేశాలు కూడా కలిసొచ్చాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఏదో ఒక నిరసన కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీలో ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రాకు అన్యాయం చేసిన నరేంద్ర మోదీతో, ఆంధ్రాద్రోహి కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని సాధ్యమైనంత ప్రచారం జరిగేలా చూస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే, ఎన్నికల మూడు నెలల ముందు చేసే ఇటువంటి ప్రయత్నాలను ప్రజలు నమ్ముతారా..? అనేది ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది.

Tags:    

Similar News