చంద్రబాబు సన్నిహితుడి పొలిటికల్ ఫ్యూచర్ ఎంటి..?

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఏళ్లుగా ఆ పార్టీలో కొనసాగుతూ, ఒక దశలో టీడీపీలో కీలక నేతలుగా [more]

Update: 2019-01-07 00:30 GMT

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఏళ్లుగా ఆ పార్టీలో కొనసాగుతూ, ఒక దశలో టీడీపీలో కీలక నేతలుగా ఎదిగిన నేతలు సైతం ఓటమి పాలయ్యారు. వారిలో ముందున్న నేత నామా నాగేశ్వరరావు. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు. అందుకే ఈ స్థానాన్ని టీడీపీ చాలా ప్రతిష్ఠాత్మకంగా భావించింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఏర్పాటు చేసిన మొదటి బహిరంగ సభ కూడా ఖమ్మం ప్రచారంలోనే. చరిత్రలోనే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో టీడీపీ అధ్యక్షుడు వేదిక పంచుకున్నది కూడా ఇక్కడే. ఇది చారిత్రక సభ అని కూడా రెండు పార్టీల నేతలు చెప్పారు. అంతటి కీలకమైన ఈ నియోజకవర్గంలో ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు.

ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా…

2004, 2009, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నామా నాగేశ్వరరావు 2009లో కాంగ్రెస్ హవాలోనూ విజయం సాధించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఇక, కాంగ్రెస్ తో టీడీపీ పొత్తులో భాగంగా ఖమ్మం అసెంబ్లీకి పోటీచేశారు నామా. కూటమి అధికారంలోకి వచ్చి నామా గెలిస్తే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే, ఆయన ఓటమి చెందడంతో పాటు టీడీపీ కూడా తెలంగాణ ఇంచుమించు నామమాత్రంగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితిలో నామా నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్ ఏమిటనే చర్చ జరుగుతోంది. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ లోకి వెళతారా..?

నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పట్టున్న నేత. ఆయనకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా వర్గం ఉంది. ఇక టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమే అన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కచ్చితంగా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి, టీఆర్ఎస్ కి వచ్చిన ఓట్లను బట్టి చూస్తే పరిస్థితి ఇలానే ఉంటే కాంగ్రెస్ ఈ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీంతో నామా ఈ స్థానంపై కన్నేసినట్లు తెలుస్తుంది. ఇక, కాంగ్రెస్ లో కూడా ఈ స్థానానికి గట్ట పోటీనే ఉంది. మాజీ ఎంపీ రేణుకా చౌదరితో పాటు సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి, ఈ సమయంలో ఒకవేళ నామా వెళ్లినా టిక్కెట్ దక్కుతుందనేది అనుమానమే. టీఆర్ఎస్ లోనూ ఇప్పటికే నామాతో రాజకీయ వైరమున్న తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బలమైన నాయకులుగా ఉన్నారు. దీంతో నామా ఆ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లే అవకాశమైతే లేదు. మొత్తానికి నామా నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్ ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి.

Tags:    

Similar News