బాగుపడదు.. పడనివ్వరా?

సేమ్ సీన్లు రిపీట్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా వ్యవహారశైలినే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా అనుసరిస్తున్నారు. ఇద్దరికీ పంతమే. తమిళనాడు పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2019-09-11 08:00 GMT

సేమ్ సీన్లు రిపీట్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా వ్యవహారశైలినే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా అనుసరిస్తున్నారు. ఇద్దరికీ పంతమే. తమిళనాడు పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వారిదే రాజ్యం. వైరి పక్షం గొంతు పెగలడానికి వీలులేదు. ప్రశ్నించేందుకు అవకాశంలేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా అంతే జరిగింది. ఇప్పుడు జగన్ హయాంలో అదే జరుగుతుంది. ఇద్దరి నేతల మధ్య పంతంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టు పట్టి పోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో…..

నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత చంద్రబాబునాయుడు. ఆయన దాదాపు పథ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అయినా ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షం గుర్తుకు రాదు. తానే మోనార్క్ ను అనుకుంటారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆయనే ఉక్కుపాదంతో అణిచివేశారు. జగన్ యువభేరి సభలకు వెళ్లిన విద్యార్థులపై కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. హోదా అంటేనే జైలులోకి నెట్టేస్తానని వార్నింగ్ లు ఇచ్చారు. విశాఖలో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతుందని చెప్పి హోదా కోసం చేస్తున్న జలదీక్షను భగ్నం చేశారు. హోదా ఉద్యమం కోసం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ ను అక్కడే అరెస్ట్ చేసి వెనక్కు పంపారు.

అవి గుర్తుకు రావడం లేదా?

ఇక కమ్యునిస్టులు, జనసేన, ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణ సమితి,వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఆరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి. అంతా ఆయనకు పచ్చగానే కనపడింది. హోదా అవసరం లేదన్న చంద్రబాబు ఎన్నికల సమయం వచ్చేసరికి తిరిగి హోదా నినాదాన్ని అందుకున్నారు. అప్పటి వరకూ హోదాపై ఒక్క అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయని చంద్రబాబు ఎన్నికల ముందు హడావిడి చేశారు. అసెంబ్లీలో సయితం వైసీపీ నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే తాను అధికారంలో చేసినవన్నీ ఇప్పుడు చంద్రబాబుకు గుర్తుకు రావడం లేదు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందంటున్నారు. చీకటి రోజంటున్నారు. జగన్ అరాచక శక్తి అని అభివర్ణిస్తున్నారు.

జగన్ కూడా….

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నేడు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని జగన్ ఉక్కుపాదంతో అణచి వేశారు. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. ఇందులో చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా జగన్ వ్యవహరిస్తున్నారన్నది అర్థమవుతోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిన తరుణంలో తమిళనాడు తరహాలో రాజకీయాలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తానికి పంతాలకు పోయి ఇద్దరు నేతలు రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పుతున్నారంటూ వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News