చంద్రన్నకు చేయూత

కొండంత చీకటిలో గోరంత వెలుతురు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి. ఓ వైపు ఏపీలో జగన్ గత ఎనిమిది నెలల పాలనతో తన పొలిటికల్ కెరీర్లో [more]

Update: 2020-01-15 06:30 GMT

కొండంత చీకటిలో గోరంత వెలుతురు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి. ఓ వైపు ఏపీలో జగన్ గత ఎనిమిది నెలల పాలనతో తన పొలిటికల్ కెరీర్లో ఎన్నడూ లేనంతగా ఒత్తిడికి లోను అవుతున్న చంద్రబాబుకు మరో మారు జనసేనాని చేయూత ఇస్తాడా అన్న చర్చ సాగుతోంది. సరిగ్గా ఆరేళ్ళ క్రితం 2014 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇలాగే నిస్సత్తువగా ఉన్న వేళ రాజకీయంగా ఆయన్ని లేపి సీఎం సీట్లో కూర్చోబెట్టిన దాంట్లో పవన్ పాత్ర కూడా ఉంది. ఇపుడు చూస్తే చంద్రబాబు మళ్ళీ ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాగా ఇలాగా కాదు, ఏకంగా కూసాలు కదిలిపోయేలా జగన్ టీడీపీని టార్గెట్ చేశాడు. మూడు రాజధానులతో మాడుపగిలేలా దెబ్బకొట్టబోతున్నాడు. ఇది కనుక సక్సెస్ అయితే చరిత్రలో టీడీపీ ఉండదు, చంద్రబాబుకు కూడా చోటు ఉండదు, దాంతో చంద్రబాబు బేలగా మారిపోతున్నారు.

బీజేపీతో చెలిమి…

బీజేపీతో పవన్ చెలిమి ఏ విధంగా చూసుకున్నా కూడా చంద్రబాబుకు ఉపశమనమేనని అంటున్నారు. ముందు పవన్ దారి తీస్తే ఆనక తాను కూడా ఆ గూటిలో చేరవచ్చునన్న ధైర్యం చంద్రబాబుకు వచ్చేస్తోంది. ఇప్పటికి రెండు పర్యాయాలు ఢిల్లీకి వెళ్ళిన పవన్ సాధించింది కొంత అవగాహన. బీజేపీతో చెట్టాపట్టాలు వేసేందుకు కొంత సానుకూలత. అది పవన్ కంటే టీడీపీలోనే ఎక్కువ సంతోషంగా ఉందిట. అదే సమయంలో అమిత్ షా లాంటి పెద్దలు పవన్న్ని కలవకపోవడం మాత్రం తమ్ముళ్ళకు నిరాశగా ఉంది. ఏది ఏమైనా కొంత కదలిక వచ్చిందన్న నిబ్బరం మాత్రం పసుపుశిబిరంలో కనిపిస్తోంది.

కలసిపోదాం…

టీడీపీ విషయం తీసుకుంటే పవన్ ద్వారా బీజేపీకి చేరువ కావాలని చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ సంగతి గమనించే బీజేపీ కూడా తొందరపడకూడద‌ని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. పవన్ తో బీజేపీకి ఇప్పటికిపుడు అవసరం పెద్దగా లేదు, బీజేపీకి ఇప్పుడు ఏపీలో పెద్ద కుర్చీ ఏమీ వచ్చి పడిపోదు, సార్వత్రిక ఎన్నికలు కూడా నాలుగేళ్ళ దూరంలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో పవన్ ని కూడా జాగ్రత్తగానే బీజేపీ స్టడీ చేస్తోందని అంటున్నారు. పాచిపోయిన లడ్డూలు అంటూ మొదట పవన్ గొంతు విప్పితే చివరి ఏడాది చంద్రబాబు పొత్తు చిత్తు చేసి మోడీకే సవాల్ చేశారు. ఇలా ఇద్దరు మిత్రులు కూడబలుక్కునే ఏపీలో తమకు చేటు తెచ్చారన్న బాధ, ఆగ్రహం బీజేపీ పెద్దల్లో ఇప్పటికీ ఉందని అంటున్నారు. అయినా అన్నీ మరచి కలసిపోదామని పవన్ అంటున్నా బీజేపీ నిదానమే ప్రదానం అంటోంది.

విలీనమేనా…?

ఇక పవన్ లో ఒక్క సీట్లో గెలవకపోయినా భేషజం మాత్రం తగ్గలేదని బీజేపీ నుంచి వినిపిస్తున్న నిష్టూరం మాట. పొత్తుకే సుముఖం విలీనం కాదని పవన్ అంటూంటే ముందు వచ్చి పార్టీలో చేరిపోండి. తరువాత ఏపీలో బీజేపీని ఎలా బలపరచాలో మేము చెబుతామని ఢిల్లీ పెద్దలు అంటున్నారుట. ఇక్కడే ప్రధామైన అడ్డంకి వచ్చినట్లుగా ప్రచారంలో ఉంది. అందుకే అమిత్ షా లాంటి పెద్దలు ముఖం చాటేశారని అంటున్నారు. ప్రస్తుతానికి కలసి నడిస్తే రాబోయే రోజుల్లో చూసుకోవచ్చునని జనసేన సణుగుడుని కూడా కమలం ఖాతరు చేయడంలేదని అంటున్నారు. అయితే చంద్రబాబు కంటే పవన్ బెటర్ అని కొంత బీజేపీలో చర్చ ఉంది. దీంతో పవన్ కి ఆ మాత్రం అయినా మర్యాద ఢిల్లీలో లభిస్తోందని అంటున్నారు. ఇక పవన్ని బీజేపీ దగ్గరకు తీస్తే ఎన్నికల ఏడాదికైనా తమను కూడా పిలిచి పెద్ద పీట వేయకపోతారా అన్నది టీడీపీ పెద్ద ఆశ. మొత్తానికి పవన్ బీజేపీ కలయిక టీడీపీలో కొంత ఊరటగా ఉందని మాత్రం అంటున్నారు.

Tags:    

Similar News