సాహసం చేయలేకపోతున్నారా?

Update: 2018-04-07 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న పొలిటికల్ హైడ్రామాలో గతంలో చేసిన తప్పులు పార్టీలను పాపాలై వెన్నాడుతున్నాయి. ప్రజావిశ్వాసాన్ని చూరగొనడానికి ఆటంకంగా మారుతున్నాయి. కొన్ని పార్టీలు సంయమనం కోల్పోయి తిట్లదండకాన్ని లంఘించుకుంటున్నాయి. ద్వేషించడం ద్వారా పొరపాట్లు, తప్పులన్నిటినీ ఎదుటివారిపైకి నెట్టేస్తే సరిపోతుందని భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక జాతీయస్థాయి చర్చ. ఏపీకి అన్యాయం జరిగిందని మెజార్టీ రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా భావిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో మాత్రం ఇంకా పొలిటికల్ గిమ్మిక్కులకే పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. ఇందులో ఎవరూ వెనకబడిలేరు. ఒకరికొకరు పోటాపోటీగానే నిలుస్తున్నారు. రాష్ట్రప్రయోజనాలకంటే రాబోయే ఎన్నికల విజయాలపైనే కేంద్రీకరిస్తున్నారు. 2009 తర్వాత ఏపీలో బహుముఖ పోరాటం షురూ అయ్యే వాతావరణం తొంగిచూస్తోంది. ఈ పరిస్థితులే ప్రధాన పక్షాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రాజకీయ నాడిని పట్టుకునే అవకాశం దొరకడం లేదు. అంతా కంగాళీగా మారిన పరిస్థితుల్లో కంగారు పడకతప్పని అనివార్యతను ఎదుర్కొంటున్నాయి రాజకీయ పక్షాలు.

కమలనాథుల కంగారు...

నిజానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి పెద్ద విషయం కాదు. ఆపార్టీకి ఇక్కడ పెద్దగా లాభించే అంశాలు, సీట్లు కూడా లేవు. దాంతోనే నిర్లక్ష్యం చేశారు. కానీ ఏపీ ప్రస్తుతం జాతీయ రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది. మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై తొలి అవిశ్వాసానికి వేదికగా రూపుదాల్చింది. కాంగ్రెసు సహా విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావడానికి మార్గదర్శకమైంది. మోడీ, అమిత్ షాలు ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవిశ్వాస అంశం ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని ఊహించలేదు. ఏదో మొక్కుబడి తంతుగా ముగిసిపోతుందనుకున్నారు. ఒకానొక సందర్భంలో అవసరమైతే తీర్మానాన్ని అనుమతించవచ్చనీ ఆలోచించారు. మిత్రపక్షాలనే నమ్మలేని పరిస్థితి, అవిశ్వాస చర్చలో లేవనెత్తే అంశాలపై ఆందోళన వ్యక్తమైంది. చర్చ జరిగితే కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తక్షణం దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో బీజేపీకి చేసే నష్టం గ్రహించే వెనకడుగు వేయాల్సి వచ్చింది. అందులోనూ మిత్రపక్షాలనూ, సొంతపార్టీలోని సీనియర్ ఎంపీలనే నమ్మలేని పరిస్థితి. తక్షణం ప్రభుత్వం కుప్పకూలకపోయినా తమకున్న వాస్తవబలం తగ్గినట్లు కనిపిస్తే రాజకీయంగా ప్రజల్లోకి చెడుసంకేతాలు వెళతాయి. అందుకే అవిశ్వాసాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. చర్చకు రాకుండా నొక్కిపెట్టగలిగారు. కానీ ప్రజల్లో మాత్రం జరగాల్సిన డామేజీ అయిపోయింది. అందుకే ఒకింత బాధతో ప్రతిపక్షాలన్నీ కుక్కలు, నక్కలు, పాములంటూ తిట్ల దండకాన్ని చదివి కసి తీర్చుకున్నారు అమిత్ షా. పేద ప్రధానిని గద్దెపై చూడలేకపోతున్నారంటూ తన పాత కార్డును బయటికి తీశారు మోడీ. పార్లమెంటులో అవిశ్వాసాన్ని దీటుగా ఎదుర్కోకుండా శాపాలు పెట్టడం పాలకనేతల బలహీనతను బయటపెడుతోంది.

ఒంటరి అయిపోయారు...

చంద్రబాబు కష్టం ఇంకెవరికీ రాదు. నిన్నామొన్నటివరకూ తాను కేంద్రం నుంచి ఎన్నోతెచ్చానని చెప్పుకున్న ఆయన ఇప్పుడు కేంద్రం మొండిచేయి చూపిందని చెప్పలేక చెప్పాల్సి వస్తోంది. ఇతర పార్టీలను వేటినీ చేరదీయకుండా రాజధాని నిర్ణయం, నిర్మాణం వంటి అన్ని విషయాల్లోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ బజారున పడాల్సి వస్తోంది. అండగా మీరంతా కూడా రండి అంటూ పిలవడంలోనే రాజకీయం కనిపిస్తోంది. ఏపీ అంటే తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశమే అన్నట్లుగా నాలుగేళ్లుగా ఒంటెత్తు పోకడలు పోయిన చంద్రబాబుకు సహకరించేందుకు ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు. అయిదు కోట్ల ఆంధ్రులకు దెబ్బతగులుతోందంటూ సెంటిమెంటు ప్రయోగించదలచినా ఆయన చెంతకు చేరేందుకు ప్రధాన పక్షాలు ఇష్టపడటం లేదు. మరోవైపు రాజీనామా పత్రాలు సమర్పించి వైసీపీ ఎంపీలు నిరవధిక నిరాహారదీక్షకు కూర్చోవడం చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తమ ఎంపీల చేత రాజీనామా చేయించే సాహసానికి ఆయన పూనుకోలేకపోతున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలో వైసీపీ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కొన్ని సంఘాలకే బాబు అఖిలపక్షం పరిమితమైపోయింది. ప్రధానపార్టీల బాయ్ కాట్ టీడీపీకి, ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే భావించాలి.

ప్రాంతీయతత్వానికి బాటలు....

ఇంకోవైపు మరో సమస్య ముదురుతోంది. ఏపీ అంటే అమరావతి , పోలవరం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య తాజాగా పెనువివాదానికి దారితీస్తోంది. గతంలో అభివృద్ధిని హైదరాబాదులోనే కేంద్రీకృతం చేసిన ముఖ్యమంత్రి తాజాగా అమరావతికే అన్నీ కట్టబెట్టాలని చూస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర లో ప్రత్యేక వాద ఉద్యమాలకు బీజాలు పడుతున్నాయి. పాలకుడు తమ ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ సీమ కన్నీళ్లు తుడవడం లేదంటూ రాయలసీమ అభివృద్ధి వేదిక వంటి సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందంటూ పోరాట వేదికలు పుట్టుకొస్తున్నాయి. ఇదంతా 2019 ఎన్నికలకు ముందే తీవ్ర అసంతృప్తికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ సమస్యలన్నీ అధికారపార్టీ తెలుగుదేశానికే చుట్టుకుంటాయి. టీడీపీకి, చంద్రబాబుకు ఎదురీత తప్పకపోవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News