క‌మ‌ల‌ద‌ళంపై చంద్ర‌బాబు మైండ్‌గేమ్‌

Update: 2018-06-06 20:30 GMT

దేశంలోనే సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌ల్లో టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి ఒక‌రు.. మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న కాలంలోనే చంద్ర‌బాబు దేశ‌ రాజ‌కీయాల్లో కీల‌కపాత్ర‌ పోషించారు. కూట‌మి రాజ‌కీయాల్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు. ఇక బాబు వ్యూహాలు త‌ల‌పండిన రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు కూడా అంత సులువుగా అర్థం కావు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంతో కేంద్రం, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌ధాని మోడీ తీరును ఏకిపారేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ అంతుచూసేందుకు చంద్ర‌బాబు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

ప్రధానిని మేమే నిర్ణయిస్తాం...

ఇప్ప‌టికే స‌మావేశాలు, స‌భ‌ల్లో కేంద్రంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపును అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న మైండ్‌గేమ్ మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే... తాను మోడీ కంటే సీనియ‌ర్‌న‌నీ, త‌న‌కు ఢిల్లీ రాజ‌కీయాలు కొత్త‌కాద‌నీ.. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధాని ఎవ‌ర‌న్న‌ది తామే నిర్ణ‌యిస్తామంటూ చంద్ర‌బాబు త‌రుచూ అంటున్నారు. అంతేగాకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో క‌లుస్తాం.. ఏం జ‌రుగుతుందో మీరే చూస్తారుగా.. అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడుతున్నారు.

రాష్ట్రం జోలికి రావద్దని హెచ్చరికలు...

ఓవైపు క‌మ‌ల‌ద‌ళాన్ని మైండ్‌గేమ్‌తో దెబ్బ‌కొడుతూనే.. మ‌రోవైపు రాష్ట్ర ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల జోలికి రావొద్దంటూ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాకు చురక‌లు అంటించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా... రాష్ట్ర ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు నితీశ్‌కుమార్ జేడీయూ, ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన సిద్ధంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ త‌ర్వాత‌నే మిగ‌తా మిత్ర‌ప‌క్షాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌ప‌డుతున్నాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు.

ఎన్డీయే మిత్రపక్షాలు వయటకు వచ్చేలా...

ఏది ఏమైనా.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవ‌డ‌మే ధ్యేయంగా చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు. ఇక బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఇప్ప‌టికే చంద్ర‌బాబుతో ట‌చ్‌లో ఉన్నారు. మ‌మ‌తో ఏదోలా చంద్ర‌బాబును తాము ఉండే కూట‌మిలోకి తీసుకు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అటు మాయావ‌తి లాంటి వాళ్లు కూడా చంద్ర‌బాబుతో ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇటు చంద్ర‌బాబు ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేలా చంద్ర‌బాబు మైండ్‌గేమ్‌కు తెర‌లేపార‌నే టాక్ వినిపిస్తోంది.

Similar News