బాబు మార్క్ రిపేర్ పరిగెత్తించేనా?

ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి రెండో సారి అధికారంలోకి వ‌ద్దామ‌ని అనుకున్న చంద్రబాబుకు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. పార్టీ ఘోరంగా [more]

Update: 2019-11-26 09:30 GMT

ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి రెండో సారి అధికారంలోకి వ‌ద్దామ‌ని అనుకున్న చంద్రబాబుకు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. పార్టీ ఘోరంగా విఫ‌ల‌మై.. అధికారానికి దూర‌మైంది. దీంతో కొన్నిరోజులు ఆయ‌న ఆ బాధ నుంచి తేరుకో లేదు. ఇంత‌లో ప‌లువురు నాయ‌కులు పార్టీ నుంచి జంప్ చేస్తుండ‌డంతో ఇక, ఉపేక్షించి కూర్చోవ‌డం, చింతిస్తూ.. ఉంటే లాభం లేద‌ని అనుకున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్షలు, విస్తృత స్థాయి స‌మావేశాల‌కు తెర‌దీశారు. త‌ద్వారా పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇవ్వాల‌ని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్యటించి త‌మ్ముళ్లలో జోష్ నింపుతున్నారు.

పోయిన చోటే…..

ఇక‌, ఇప్పుడు తాజాగా ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితుల‌ను చ‌క్కదిద్దేందుకు, అక్కడ త‌మ్ముళ్లను లైన్‌లో పెట్టేందుకు చంద్రబాబు పెద్ద వ్యూహ‌మే సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే త‌డువుగా ఆయ‌న వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాపై దృష్టి పెట్టారు. త‌ణుకులో నాలుగు రోజులుగా మాకం వేసి మ‌రీ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను స‌మీక్షించారు. ఈ జిల్లా టీడీపీకి కంచుకోట‌. కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో పార్టీ వ‌రుస విజ‌యాల‌ను కూడా కైవ‌సం చేసుకుంది. రెండు ద‌శాబ్దాలుగా ఓట‌మి ఎరుగ‌ని రికార్డును పార్టీ సొంతం చేసుకుంది. అలాంటి జిల్లాలో 2014 ఎన్నికల్లో ఒక్క తాడేప‌ల్లిగూడెం మిన‌హా అన్నీ త‌న ఖాతాలో వేసుకుంది. అది కూడా టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ గెలుచుకుంది.

జెండా కట్టేవారు లేక….

కానీ, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. కంచుకోట‌లైన గోపాల‌పురం, కొవ్వూరు, పోల‌వ‌రం, దెందులూరు లాంటి నియోజ‌క‌వ‌ర్గాలు పార్టీకి దూర‌మ‌య్యాయి. మెట్టలో ఉన్న రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గ్రూపు రాజ‌కీయాల‌తో ఘోరంగా దెబ్బతింది. పోల‌వ‌రంలో 40 వేలు, చింత‌ల‌పూడిలో 35 వేలు, గోపాల‌పురంలో 37 వేలు, కొవ్వూరులో 24 వేల భారీ తేడాతో టీడీపీ నాయ‌కులు ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నారు. దీంతో ఇక్కడి కేడ‌ర్‌లోనూ ఉత్సాహం క‌రువైంది. ఫ‌లితంగా ఇక్కడ టీడీపీ జెండా క‌ట్టే నాథుడు కూడా క‌రువ‌య్యాడు.

కొత్త వారిని నియమించి…..

దీంతో ప‌రిస్థితిని గ‌మ‌నించిన చంద్రబాబు.. ఇక్కడ త‌న‌దైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించ‌క‌పోతే.. ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతుంద‌ని అనుకున్నారు. ఆ వెంట‌నే ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల‌ను కీల‌క నేత‌ల‌కు అప్పగించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని అభివృద్ధి చేయ‌డం, ఇక్కడ మైన‌స్‌లు, ప్లస్‌ల‌ను గుర్తించి పార్టీని ముందుకు తీసుకు వెళ్లడం వంటి బాధ్యత‌ల‌ను వారికి అప్పగించారు. ఈ నాలుగు చోట్లా ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను ఇంచార్జ్‌లుగా నియ‌మించి , వారికి ఇక్కడి పార్టీ బాధ్యత‌లు అప్పగించారు. పార్టీకి కంచుకోట అయిన చింత‌ల‌పూడికి త‌ణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను నియ‌మించారు. ఇక్కడ ఉన్న గ్రూపు తాగాదాలు జిల్లాలో ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ లేవు. అసలు ఇప్పుడున్న క‌న్వీన‌ర్ క‌ర్రా రాజారావుతో పార్టీ పుంజుకుంటుంద‌న్న ఆశ‌లు ఆ పార్టీ వాళ్లకే లేవు. ఇక్కడ పార్టీని ఒకే తాటిమీద‌కు తేవ‌డం రాధాకు క‌త్తిమీద సామే.

పోలవరం బాధ్యతను….

పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులును చంద్రబాబు నియ‌మించారు. ఈయ‌న గ‌త ఏడాది జ‌రిగిన‌ తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచిన రెండు సీట్లలో అశ్వ‌రావుపేట‌లో ఇంచార్జ్‌గా ఉన్నారు. అప్పట్లో ఇక్కడ‌ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడంలో కీల‌క పాత్ర పోషించారు. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడంలో దిట్ట అయిన గ‌న్నికి ఇప్పుడు పోల‌వ‌రం బాధ్యత‌లు ఇచ్చారు. ఇక్కడ పార్టీ ఏకంగా 40 వేల‌తో ఓడింది. ఇప్పుడున్న క‌న్వీన‌ర్ బొర‌గం శ్రీను నాయ‌కుల‌ను స‌మ‌న్వయం చేయ‌లేక‌పోతున్నారు.

గ్రూపు తగాదాలుండటంతో….

అదేవిధంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో భారీ మెజారిటీతో గెలిచిన పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి టీడీపీ కంచుకోట వంటి గోపాల పురం నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను చంద్రబాబు అప్పగించారు. ఈయ‌న ఇక్కడ పార్టీని డెవ‌ల‌ప్ చేయాల్సి ఉంటుంది. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు మండ‌లాల్లోనూ గ్రూపు త‌గాదాలు తీవ్రంగా ఉన్నాయి. ఇక‌, కొవ్వూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాన్ని మాజీ మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ‌, స్థానికంగా బ‌ల‌మైన నాయ‌కుడు పెండ్యాల అచ్చిబాబుకు అప్పగించారు.

జవహర్ ను కాదని….

ఇక్కడకు వ‌చ్చేందుకు జ‌వ‌హ‌ర్ మ‌ళ్లీ ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అయితే అచ్చిబాబుకు అది ఇష్టం లేద‌ని టాక్‌.. ? మ‌రి ఇప్పుడు అదే అచ్చిబాబుకు చంద్రబాబు బాధ్యత‌లు ఇవ్వడంతో ఏం జ‌రుగుతుందో ? చూడాలి. ఇక చంద్రబాబు నియ‌మించిన ఇన్‌చార్జ్‌లు అంద‌రూ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగి పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌ని, వ‌చ్చే స్తానిక ఎన్నిక‌ల్లో భారీ స్థానాలు కైవ‌సం చేసుకునేలా చూడాల‌ని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతో పంక్చరైన ప‌శ్చిమ సైకిల్‌కు చంద్రబాబు త‌న‌దైన శైలిలో కాయ‌క‌ల్ప చికిత్స చేస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రి ఏమేరకు ఈ ప్రయ‌త్నాలు ఫ‌లిస్తాయో ? చూడాలి.

Tags:    

Similar News