ఇంటగెలిస్తేనే కదా.....???.

Update: 2018-12-16 15:30 GMT

చంద్రబాబు నాయుడి అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఇప్పటికే ప్రారంభించారు. కింగ్ కావాలనుకుంటున్నారా? కింగ్ మేకర్ పాత్రతో సరిపుచ్చుకుంటారా? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటన్న విషయాలపై సందేహాలకు తెరపడటం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రతిపక్షం ఉండటంతో ఇంటగెలవడమే కష్టసాధ్యంగా కనిపిస్తోంది. బొటాబొటి ఓట్లతోనే టీడీపీ అదికారంలోకి వచ్చింది. వైసీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువ. అయిదేళ్ల తర్వాత కచ్చితంగా ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతుంది. కొన్ని వర్గాలు దూరమైన పరిస్థితి. మరోవైపు వైసీపీకి తోడు జనసేన పవన్ కల్యాణ్ కూడా ప్రజల్లోకి వెళుతూ ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. తెలంగాణలో కూటమి కట్టించడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారనే ఉద్దేశంతో కేసీఆర్ రగిలిపోతున్నారు. ఏదో విధంగా బాబును దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదిపే సూచనలున్నాయి. కేసీఆర్ దౌత్యం నెరపి పవన్, జగన్ ల ను ఏదో ఒక మేరకు అవగాహనకు ఒప్పించగలిగితే చంద్రబాబుకు మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. విపక్షాలను ఎదుర్కోవడం ఏమంత సులభం కాదు. జాతీయ రాజకీయాల సంగతి తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడమనేది ప్రథమ కర్తవ్యంగా మారుతోంది.

కేసీఆర్ క్లియర్...

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ హెచ్చరించడంలో అంతర్లీనంగా అనేక ఉద్దేశాలున్నాయి. జాతీయ రాజకీయాల్లో హవా చెలాయించాలనుకుంటున్న చంద్రబాబుకు పర్మినెంట్ గా చెక్ పెట్టి తాను ఆస్థానాన్ని ఆక్రమించాలనే వ్యూహంలో ఉన్నారు కేసీఆర్. ఏపీలో టీడీపీ పరిస్థితులతో పోల్చి చూస్తే తెలంగాణలో కేసీఆర్ రాజకీయంగా చాలా స్థిరమైన పొజిషన్ లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో సవాల్ చేయగల స్థితి కూడా లేదు. దాంతో తెలంగాణ ఎంపీ స్థానాలను, ఎంఐఎం ద్వారా జాతీయంగా మైనారిటీ ఓట్లను పెట్టుబడిగా చేసుకుంటూ దేశయవనికపై వెలిగిపోవాలని చూస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే రాష్ట్ర పార్టీ బాధ్యతలను కుమారుడు కేటీఆర్ కు అప్పగించేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సైతం తన పాత్రను,పరిధిని కుదించుకునే యోచనలో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిగా జాతీయరాజకీయాలకే సమయాన్ని వెచ్చించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పట్నుంచే అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళిక తయారుచేసుకున్నారు. ప్రభుత్వ పాలన ఇప్పటికే కుదుట పడిపోయింది. కొత్తగా చేయాల్సిందేమీలేదు. కొత్త హామీల అమలుకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలను ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటుంది. తగిన గైడెన్సు మాత్రం కేసీఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తన జాతీయ పాత్రను నిర్వచించుకుంటున్నారు. చంద్రబాబుకు ఏపీలో చెక్ పెడితేనే తనకు భారతదేశవ్యాప్తంగా ప్రాముఖ్యం లభిస్తుందన్న సంగతీ కేసీఆర్ తెలుసు. సొంత రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయంగా బలహీనపడితే దేశంలోని మిగిలిన పార్టీలు కూడా పెద్దగా పట్టించుకోవు. ప్రస్తుతం కేసీఆర్ ఏపీలో బాబును బలహీనపర్చడమెలా అనే అంశంపైనే దృష్టి పెడుతున్నారు.

మమత సడన్ అటాక్...

ప్రధాని పదవికి తగినన్ని అర్హతలు తనకు ఉన్నాయని మమత బలంగా భావిస్తారు. అయితే తనకంటే విపక్షాల్లో సీనియర్లు చాలా మందే ఉండటంతో చాలావరకూ మౌనంగా ఉంటూ వస్తున్నారు. రాహుల్ గాంధీ ఇంకా ప్రధాని పదవికి సిద్ధం కాలేదు. విపక్షాలతో రాజీ పడి అయినా మోడీని పదవినుంచి దింపడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెసు పెట్టుకుంది. ఈ బలహీనతే మమతాబెనర్జీకి బలంగా మారింది. విపక్షాల్లో ప్రధాని పదవికి తగిన వారు ముగ్గురే కనిపిస్తున్నారు. దేవెగౌడ, చంద్రబాబు నాయుడు, శరద్ పవార్. దేవెగౌడ వయసురీత్యా పక్కనపెట్టాల్సిన వ్యక్తి. శరద్ పవార్ పార్టీకి మహారాష్ట్రలోనే పెద్దగా బలం కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు మాత్రం చాలా చురుకుగా కనిపిస్తున్నారు.

ఏపీలో కష్టమేనంటూ.....

అయితే తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కూటమితోపాటు టీడీపీ సైతం బాగా దెబ్బతింది. ఏపీలోనూ టీడీపీ ప్రస్తుత ప్రాబల్యాన్ని నిలుపుకోవడం కష్టమనేది ఇంటిలిజెన్సు వర్గాల సమాచారం. ఒకవేళ ఏపీలో టీడీపీ అదికారాన్ని నిలబెట్టుకోలేకపోతే గతంలో ఎన్టీరామారావుకు ఎదురైన పరిస్థితే చంద్రబాబుకు కూడా ఎదురవుతుంది. 1989లో నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షునిగా ఎన్టీరామారావు చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రధాని పదవికి రేసులో నిలిచారు. కానీ ఎన్నికల్లో ఏపీలో అధికారం కోల్పోవడంతో నేషనల్ ప్రంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ రామారావును పక్కనపెట్టేశారు. ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బీజేపీయేతర కూటమి ఏర్పాటు విషయంలో చాలా బాధ్యత తీసుకుంటున్నారు. కానీ 2019లో ఇంట గెలవకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథాగా మారిపోతాయి. కేంద్రంలో అధికార మార్పిడి సాగినా టీడీపీ పెద్ద పాత్ర వహించలేకపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రధాని రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మమత సిద్ధమవుతున్నారు.

రెండూ కావాలి....

చంద్రబాబు ఇంకా సిద్ధం కాలేదు. కేసీఆర్ తరహాలో రిస్కు చేయలేకపోతున్నారు. తెలంగాణలో గెలుపు తర్వాత పార్టీని కొడుకు చేతిలో పెట్టి, తాను దేశరాజకీయాలవైపు నడుస్తానని ఘంటాపథంగా ప్రకటించేశారు. ఈ తరహా సాహసాన్ని చంద్రబాబు చేయలేకపోతున్నారు. ఏ ఎన్నికలోనూ లోకేశ్ తనను తాను ప్రూవ్ చేసుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. స్వయంగా తానే ఎమ్మెల్యే కాకుండా మంత్రి వర్గంలో చేరడానికి దొడ్డిదారిని ఎంచుకున్నారు. ప్రత్యక్ష ప్రజాప్రతినిధిగా కాకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇవన్నీ టీడీపీకి డ్రా బ్యాక్స్. కుమారుడు పార్టీని సొంతంగా నడిపేంత సామర్ధ్యాన్ని ఇంకా సంతరించుకోలేదని చంద్రబాబు భావిస్తున్నారు. అందువల్లనే లోకేశ్ పరోక్షంగా పెత్తనం చెలాయిస్తున్నప్పటికీ ఇప్పటికీ తనమాటే ఫైనల్ గా బాబు వ్యవహరిస్తున్నారు. పార్టీలో అంతర్గత విషయాల్లో రాజీలు, సర్దుబాట్లు, అసమ్మతి నాయకులను అదుపులోకి తెచ్చే బాధ్యతలను చంద్రబాబే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో సురక్షితమైన అంశాల్లోనే లోకేశ్ ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అతని భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తును నిర్దేశించే అంశాల్లో బాధ్యతలు అప్పగించడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ తెలంగాణ లో ప్రజాకూటమి ఏర్పాటు, ప్రచారం వంటి విషయాల్లో లోకేశ్ ను దరిదాపుల్లోకి రానివ్వలేదు. చంద్రబాబు అన్నీ తానై వ్యవహరించారు. పార్టీలో అభిప్రాయం కూడా నాయకుడిగా లోకేశ్ ఇంకా పరిణతి సాధించలేదని పార్టీలోని సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే నేలవిడిచి సాము చేస్తే రెంటికీ చెడ్డ రేవడిగా తయారవుతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఏపీ రాజకీయాలను చూసుకుంటూనే కేంద్రంలో కీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఉన్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News