మళ్ళీ అధికారం ఖాయమేనా?

ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉంది. 1982లో తెలుగుదేశం పార్టీ పుట్టాక కాంగ్రెస్, టీడీపీ మధ్యన ప్రత్యక్ష యుధ్ధం సాగుతూ వచ్చింది. అంతకు [more]

Update: 2020-01-31 15:30 GMT

ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉంది. 1982లో తెలుగుదేశం పార్టీ పుట్టాక కాంగ్రెస్, టీడీపీ మధ్యన ప్రత్యక్ష యుధ్ధం సాగుతూ వచ్చింది. అంతకు ముందు వరకూ కాంగ్రెస్ ఏకపక్షంగా విజయాలను సొంతం చేసుకుంది. ఇక కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీలో బహు నాయకత్వాలతో పాటు, కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన జాప్యాలు ఇవన్నీ కూడా బలమైన ప్రాంతీయ పార్టీగా అప్పట్లో టీడీపీకి అడ్వాంటేజ్ గా ఉండేవి. ఇక వైఎస్సార్ సీఎం అయ్యాక ఏపీ కాంగ్రెస్ ని కూడా ఒక ప్రాంతీయ పార్టీగా మార్చి రాజ్యం చేయడంతో అసలైన పోరాటం రెండు పార్టీల మధ్య ఏర్పడింది. దాంతో అయిదేళ్ళకు ఒకమారు మారే అధికార మార్పిడి సంప్రదాయాన్ని వైఎస్సార్ విజయవంతంగా అడ్డుకుని రెండు సార్లు వరసగా చంద్రబాబుని విపక్షంలో కూర్చోబెట్టారు.

సమరమే…

ఇక ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోయి జగన్ నాయకత్వాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత చంద్రబాబుకు అసలైన పోటీ మళ్ళీ ఎదురైంది. సమరమే అన్నట్లుగా జగన్, బాబుల మధ్య రాజకీయ పోరాటం నడిచింది. ఇక జగన్ అయిదేళ్ళ పాటు విపక్ష నేతగా గట్టిగా నిలబడి చంద్రబాబుని ఢీ కొట్టారు. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా 151 సీట్లతో ముఖ్యమంత్రి కుర్చీ పట్టేశారు. జగన్ పట్ల జనానికి ఉన్న మోజుని చూసిన వారు ఎవరూ చంద్రబాబుకు 2024లో కూడా అధికారం దక్కదని భావించరు. చంద్రబాబు సైతం అలాగే అనుకున్నారు. అయితే ఇపుడిపుడే చంద్రబాబులో కొత్త ఆశలు చిగిరిస్తున్నాయట

రివర్స్ నుంచి ప్లస్…..

జగన్ అధికారంలోకి వచ్చాక వరసగా రివర్స్ లో నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా తాను చేసిన ప్రతి నిర్ణయాన్ని జగన్ తిరగతోడుతున్నాడని, అది మంచికైనా, చెడ్డకైనా కూడా జగన్ అదే పనిగా చేసుకుంటూ దూకుడుగా వెళ్తున్నాడని చంద్రబాబు భావిస్తున్నారుట. ఇలా రివర్స్ నిర్ణయాలలో మొదటిగా ప్రజా వేదికను కూల్చడం, ఆ తరువాత పోలవరం, అమరావతి మీదుగా ఇపుడు ఏకంగా శాసనమండలిని రద్దు చేయడం దాకా జగన్ రివర్స్ గేర్ వేస్తున్నారని, ఇది కచ్చితంగా ఆయన పార్టీకి పెద్ద దెబ్బ అని చంద్రబాబు ఒక అంచనాకు వస్తున్నారుట. చివరికి ఇదే తనకు ప్లస్ అవుతుందని కూడా బాబు లెక్కలేసుకుంటున్నారుట.

సవాళ్ళు అందుకేనా…?

ఇపుడే ఎన్నికలు పెట్టు నీ సంగతో నా సంగతో తేలిపోతుందని గత కొన్నాళ్ళుగా చంద్రబాబు అంటున్నారు. జగన్ కి డైరెక్ట్ గానే సవాల్ చేస్తున్నారు. మూడు రాజధానుల ముచ్చట పట్ల ఏపీ జనం వ్యతిరేకంగా ఉన్నారన్నది చంద్రబాబు బలమైన అభిప్రాయంగా ఉందట. అదే విధంగా జగన్ మొండి వైఖరితో తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కూడా మేధావుల్లో చర్చకు వస్తున్నాయిట. జగన్ అనేక పధకాలు ప్రవేశపెడుతున్నా కూడా జనంలో ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతోందని, చివరికి మండలి రద్దుతో సొంత పార్టీలో కూడా బాగా వ్యతిరేకత మూటకట్టుకున్నారని చంద్రబాబు స్థిరమైన నమ్మకంతో ఉన్నారట. అందుకే అసెంబ్లీ రద్దు చేయ్ అంటున్నారుట. మరి జగన్ మీద జనంలో అంతలా వ్యతిరేకత ఉందా, టీడీపీకి ఏపీ జనం అనుకూలంగా ఉన్నారా, సార్వత్రిక ఎన్నికల వరకూ ఎందుకు… స్థానిక ఎన్నికల్లో ఎవరి బలం ఏపాటిదో తెలిసిపోతుంది కదా అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News