సవాళ్లు ఏమయ్యాయి… చప్పపడిపోయారా?

అమరావతి రాజధాని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు 48 గంటల సమయం ఇచ్చారు. రాజధానిపై తీర్పు కోరేందుకు తిరిగి ఎన్నికలకు [more]

Update: 2020-08-20 08:00 GMT

అమరావతి రాజధాని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు 48 గంటల సమయం ఇచ్చారు. రాజధానిపై తీర్పు కోరేందుకు తిరిగి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని ఐదు కోట్ల మంది కోరుకుంటున్నారని, రాజధాని మార్పుకు మీరు సిద్ధమయితే రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే దీనికి జగన్ నేరుగా స్పందించకపోయినా ఆ పార్టీ మాత్రం స్పందించింది.

సవాల్ – ప్రతి సవాల్…..

రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని భావిస్తే పరిపాలన రాజధానిగా మార్చనున్న విశాఖలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ నేతలు సవాల్ విసిరారు. లేకుంటే 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలచి వస్తే తాము రాజధాని మార్పుపై ఆలోచిస్తామని వైసీపీ నేతలు సవాళ్లు విసిరారు. అంతే తప్ప తమ నిర్ణయం సబబు అనుకుంటున్నాము కాబట్టి తమకు రాజీనామా చేయాల్సిన అవసరంలేదని వారు తేల్చి చెప్పారు.

వారం రోజుల పాటు డ్రామా…..

ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు సాగిన రాజీనామాల డ్రామాకు తెరపడినట్లే కన్పిస్తుంది. అధికార పార్టీ తన పని తాను చేసుకు వెళుతుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా మూడు రాజధానులకు పునాది త్వరలోనే వేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి మరోసారి చెప్పడంతో న్యాయపరమైన చిక్కులు వీడిన వెంటనే రాజధాని తరలింపు ఖచ్చితమని తేలిపోయింది.

కిమ్మనడం లేదే…?

చంద్రబాబు ప్రస్తుతం కరోనా కారణంగా హైదరాబాద్ లో చిక్కుకుపోయారు. ఆయన ఇప్పట్లో అమరావతికి వచ్చే అవకాశం లేదు. దీంతో జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నా చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయతలోనే ఉన్నారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిస్తున్నా స్పందన మాత్రం పెద్దగా లేదు. ఇక రాజధాని తరలింపునకు నిరసనగా రాజీనామాలు చేసే యోచనలో కూడా తెలుగుదేశం పార్టీ లేదు. దీంతో రెండు పార్టీలు రాజీనామాలతో కొద్దిరోజులు జనంతో ఆడుకున్నాయే తప్ప ఆచరణలో మాత్రం అది సాధ్యం కాదని స్పష్టమయింది.

Tags:    

Similar News