అమరావతిని జాకీ పెట్టి లేపుతున్నా …?

చంద్రబాబు ఏ ముహూర్తాన అమరావతి రాజధాని అని ప్రకటించారో నాటి నుంచి పుట్టెడు కష్టాలు ఆ ప్రాజెక్ట్ ను వెంటాడుతున్నాయి. భూ సేకరణ ఒక సమస్య, జాతీయ [more]

Update: 2020-07-05 05:00 GMT

చంద్రబాబు ఏ ముహూర్తాన అమరావతి రాజధాని అని ప్రకటించారో నాటి నుంచి పుట్టెడు కష్టాలు ఆ ప్రాజెక్ట్ ను వెంటాడుతున్నాయి. భూ సేకరణ ఒక సమస్య, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గ నిర్దేశాలు, చివరికి నిధుల లేమి ఇలా అన్ని ఆటంకాలే. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నా ఒక్క శాశ్వత భవనం నిర్మించకుండా బాబు చేసిన నిర్వాకం ప్రజల్లో ఇది రియల్ దందా కోసమే అనే అపోహాలను పెంపొందించాయి. చివరికి అనేక కోర్టు చిక్కులు అమరావతి చుట్టూ ముప్పిరిగొన్నాయి. కేంద్రం సహకారం అంతంత మాత్రమే అయ్యింది. దాంతో ప్రపంచ బ్యాంక్ పై ఆధారపడి బండి లాగిద్దామనుకుని డిజైన్లు, గ్రాఫిక్స్ తో కాలక్షేపం చేసి దెబ్బయి పోయారు చంద్రబాబు.

మరో 20 ఏళ్ళు తానే అనుకుని …

అమరావతి ప్రాజెక్ట్ 2050 కి ఒక షేప్ కి రావొచ్చన్నది చంద్రబాబు అంచనా. అంటే అప్పటివరకు టిడిపి నే అధికారంలో ఉంటుందని తానే దీన్ని రూపొందిస్తానని అనుకున్నారు చంద్రబాబు. జరిగిన బాగోతాలను గుర్తించిన ప్రజలు అమరావతి తో పాటు అనేక సమస్యల కారణంగా అఖండ మెజారిటీ వైసిపి కి ఇచ్చేశారు. చంద్రబాబు టిడిపి అడ్రస్ లేకుండా గత ఎన్నికల్లో పోయింది. ఇలా జరుగుతుందని బాబు కలలో కూడా ఊహించలేదు. వచ్చి రావడంతోనే అమరావతి ప్రాజెక్ట్ కు నో చెప్పేశారు జగన్. అంతే కాదు మూడు రాజధానులు తెరపైకి తెచ్చి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు పెట్టారు. అంతేకాదు కార్యాచరణ మొదలు పెట్టేశారు.

స్వప్నం సాకారం కాలేదు సరికదా …

దాంతో అమరావతి కోసం చంద్రబాబు సుదీర్ఘ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు అనేక కేసులు హై కోర్టు లో ఫైల్ చేయించింది టిడిపి. పేరు రైతుల పోరాటమే అయినా కర్త కర్మ క్రియ టిడిపి నే అమరావతి ఉద్యమం వెనుక అన్నది అందరికి తెలిసిందే. రాజధాని రైతులతో బిజెపి, జనసేన, కామ్రేడ్ ల మద్దతు కూడగట్టింది. ఈ ఆందోళనకు సహజంగానే మెజారిటీ సంఖ్యలో ఉన్న టిడిపి మద్దతు ఛానెల్స్, పత్రికలు శక్తికి మించి తమ స్వామి భక్తిని నిరూపించుకున్నాయి.

షాక్ ఇచ్చిన కరోనా …

అమరావతి ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతుందని అంతా భావిస్తున్న తరుణంలో కరోనా మహమ్మారి ఎంటర్ అయిపోయింది. దాని దెబ్బకు ఉద్యమ కారులే కాదు ఈ ఉద్యమానికి ఊపిరి పోస్తున్న రాజకీయ పార్టీలు నాలుగు నెలలు మాయం అయిపోయాయి. అయితే లాక్ డౌన్ 6.0 తో నిబంధనలు సడలింపు రావడంతో ఇప్పుడు మరోసారి 200 వరోజు ఉద్యమం అంటూ అంతా రంగంలోకి దిగిపోయారు. అంతర్జాతీయ ఉద్యమం అంటూ తమ పార్టీ శ్రేణులతో వివిధ దేశాలనుంచి వర్చ్యువల్ ఉద్యమం మొదలు పెట్టి తమ ఛానెల్స్, పత్రికల్లో వెరైటీ హడావిడి చేశారు.

సమైక్య ఉద్యమ తరహాలో దెబ్బవుతారా …?

తమకు ఏమి కావాలో చెప్పకుండా సాగిన సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలోనే అమరావతి ఉద్యమం సాగుతూ ఉండటంతో వైసిపి ప్రభుత్వం తమ పని లో తాముంది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ ముందుకే సాగుతున్న నేపథ్యంలో తమ గళం మరింత గట్టిగా వినిపించకపోతే మొదటికే మోసం వస్తుందని లెక్కేశారు రాజధాని తరలింపును అడ్డుకుంటున్న వ్యూహకర్తలు. అయితే జగన్ సర్కార్ దీన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాలి.

Tags:    

Similar News