ఆ ఎంపికి ముళ్లబాటే ?

రాష్ట్రం అంతా ఒకదారైతే రాజమండ్రి ఓటర్లది మరోదారి అయ్యింది ఈసారి. దాంతో వైసిపి అధికారంలో ఉంటే రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఓటర్లు టిడిపి కి పట్టం [more]

Update: 2019-06-20 12:30 GMT

రాష్ట్రం అంతా ఒకదారైతే రాజమండ్రి ఓటర్లది మరోదారి అయ్యింది ఈసారి. దాంతో వైసిపి అధికారంలో ఉంటే రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఓటర్లు టిడిపి కి పట్టం కట్టి వినూత్న తీర్పు ఇచ్చారు. పార్లమెంట్ స్థానం మాత్రం వైసిపి దక్కించుకున్నా గుండెకాయ లాంటి రెండు నియోజకవర్గాలను వైసిపి కోల్పోయింది. దాంతో ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ ను మరింతగా పెంచాలిసిన బాధ్యత ఏ మాత్రం అనుభవం లేని యువ ఎంపి మార్గాని భరత్ రామ్ పై పడింది. లోక్ సభ వైసిపి చీఫ్ విప్ పదవి కూడా భరత్ రామ్ నే వరించడం తో ప్రస్తుతానికి ఎంపి జోష్ మీదే వున్నారు. అయితే ఎవరిని పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోవడంతో భరత్ రామ్ తీరుపై అప్పుడే పార్టీ స్థానిక క్యాడర్ లో అసంతృప్తి నెమ్మదిగా మొదలైంది. ఈ వ్యవహారం అధిష్టానం వరకు ఇంకా చేరకున్నా రాబోయే రోజుల్లో పార్టీకి మరింత నష్టమే తెచ్చి పెట్టేలా ఉందంటున్నారు స్థానికులు.

కార్పొరేషన్ ఎన్నికల నాటికి మరింత దిగజారానున్న అధికారపార్టీ …

రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి చాలా స్ట్రాంగ్ గా వుంది. ఫ్యాన్ గాలికి ఎదురొడ్డి మరీ ఇక్కడ పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని విజయం సాధించారు. తెలుగుదేశం క్యాడర్ సైతం బూత్ స్థాయి నుంచి పై వరకు రాజమండ్రి సిటీ, రూరల్ లో పెట్టని కోట లా వుంది. సిటీ లో 30 వేలకు పైచిలుకు మెజారిటీ తేడాతో వైసిపి అభ్యర్థి రౌతు సూర్య ప్రకాశరావు పరాజయం పాలైతే, రూరల్ లో వైసిపి అభ్యర్థి ఆకుల వీర్రాజు పదివేలకు పైన మెజారిటీ తో ఓడిపోయారు. ఈ లెక్కలు చాలు పసుపుదళం రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి ని ధీటుగా ఎదుర్కొని మరో విజయం సాధించడానికి. డివిజన్ ల వారీగా వైసిపి ఈ నియోజకవర్గాల్లో చాలా బలహీనంగా వుంది. రౌతు కు అంతర్గత శత్రువులు అడుగడుగునా ఆయన ముందుకు వెళ్లకుండా గ్రూప్ ల వారీగా తమ ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపి భరత్ రామ్ మాత్రమే అందరిని కలుపుకుని ముందుకు వెళుతూ మొన్నటి ఎన్నికల్లో మైనస్ అయిన డివిజన్ లలో క్యాడర్ ను బలపరచడం ప్రజల తల్లో నాలుకలా వ్యవహరించాలి. కానీ ఆయన ధోరణి నేను నా సైన్యం అనే తీరులోనే సాగుతుందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఇటీవల కార్పొరేషన్ కమిషనర్ తో నగర పర్యటనలు భరత్ రామ్ ఒక్కడే చేపట్టడం అసంతృప్త నేతలకు మరింత ఆజ్యం పోసింది.

అధిష్టానం దృష్టి పెట్టలేదుగా ….

ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కూడా కాకపోవడంతో బాటు భారీ విజయం హుషారులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఢిల్లీ వంటి పర్యటనలతో పూర్తి బిజీ అయిపోయారు. దాంతో పార్టీ ఓడిన నియోజకవర్గాల్లో సమీక్షలు చేసే తీరిక లేకుండా పోయింది. దాంతో మరమ్మత్తు చేసుకునే ఛాన్స్ కూడా వైసిపి కి రాజమండ్రి వన్, టూ లో లేకుండా పోయింది. పార్టీని సమన్వయంతో నడిపించే వారు లేకపోవడంతో ప్రస్తుతానికి మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్యప్రకాశ రావు సోలో పాట పాడుకుంటూ పనిచేసుకుపోతున్నారు. వాస్తవానికి టిడిపి కి లేని బలమైన నేతలు రాజమండ్రి సిటీలో గత ఎన్నికల ముందు వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. వీరిలో చాలామంది ఎంపి ఎమ్యెల్యేలుగా పోటీ చేసే సత్తా వున్నవారే కావడం గమనార్హం. అయితే సరైన సమన్వయం, వ్యూహం లేకపోవడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. అంతా సమిష్టిగా పనిచేసివుంటే సిటీలో టిడిపికి మెజారిటీ తగ్గడం, రూరల్ లో గెలుపును అందుకునేవారమని ఆ పార్టీ వర్గాలే వాపోతున్నాయి. వైసిపి కార్పొరేటర్లు వున్న వార్డుల్లోనే టిడిపి సాధించిన ఆధిక్యం ఫ్యాన్ పార్టీ డొల్లతనాన్ని బయటపెడుతోంది.

ఎప్పుడు పసుపు జండానే ….

రాజమండ్రి కార్పొరేషన్ ఏర్పాటు అయ్యాకా జరిగిన ప్రతీ ఎన్నికల్లో టిడిపి మేయర్లు వరుసగా గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టారు. మాజీ మంత్రి స్వర్గీయ బత్తిన సుబ్బారావు అల్లుడు ఎంఎస్ చక్రవర్తి ఎస్సి జనరల్ రిజర్వేషన్ రావడంతో తోలి మేయర్ అయ్యారు. ఆ తరువాత బిసి లేడి రిజర్వేషన్ లో ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్ గా గెలిచారు. ఆ తరువాత ప్రస్తుత మేయర్ జనరల్ మహిళా రిజర్వేషన్ లో పంతం రజని శేష సాయి గెలుపొందారు. వీరిలో తొలిమెయర్ చక్రవర్తి చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిస్తే, ఆదిరెడ్డి వీరరాఘవమ్మ వైఎస్ హవాను సైతం ఎదిరించి గెలిచి నిలిచారు. ఇక సిట్టింగ్ మేయర్ పంతం రజని 2014 టిడిపి వేవ్ లో విజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు వైసిపికి ప్రతిష్టాత్మకం కానున్నాయి. అధికారంలో ఉండి కూడా గెలవకపోతే అది జగన్ నాయకత్వానికి సవాల్ గా మారనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం టిడిపినే ఇక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబును ప్రతిపక్షంలో కుర్చోపెట్టిన జగన్ అంత ఈజీగా ఓడిన చోటును టిడిపికి విడిచిపెట్టే అవకాశాలు లేకపోయినా నేతల నడుమ సఖ్యత సాధించడం, ఏక్ నిరంజన్ లా సాగుతున్న వారి దూకుడుకి ఏ మేరకు అడ్డుకట్టవేస్తారో చూడాలి.

Tags:    

Similar News