చంద్రబాబే అవకాశం ఇచ్చారా

చంద్రబాబు భారీ ఆశలు, అతి విశ్వాసం, తనకు ఎక్కడా తిరుగులేదని అహంకారానికి పోవడం ఇవన్నీ కూడా బంపర్ మెజార్టీతో జగన్ అధికారంలోకి రావడానికి కారణాలు అయ్యాయి. వీటితో [more]

Update: 2019-08-23 06:30 GMT

చంద్రబాబు భారీ ఆశలు, అతి విశ్వాసం, తనకు ఎక్కడా తిరుగులేదని అహంకారానికి పోవడం ఇవన్నీ కూడా బంపర్ మెజార్టీతో జగన్ అధికారంలోకి రావడానికి కారణాలు అయ్యాయి. వీటితో పాటు పాలనాపరంగా జగన్ చేపడుతున్న చర్యలకు కూడా చంద్రబాబు గత పాలనా విధానాలే కారణమన్నది అంతా అంటున్న విషయం. చంద్రబాబు ఏ పనినీ అయిదేళ్లలో సక్రమంగా పూర్తి చేయలేదు. ముఖ్యంగా చంద్రబాబుకి ఒకే ఒక విషయంలో తటస్థులు కూడా నమ్మి ఓటేసారు. అలా వారంతా చివరి నిముషంలో మొగ్గడం వల్లనే చంద్రబాబు ఏపీలో మూడవసారి అధికారంలోకి వచ్చారు. ఇంతకీ వారు చంద్రబాబు అనుభవాన్ని ఎందుకు నమ్మారంటే అడ్డగోలుగా జరిగిన విభజన ఫలితంగా ఏపీకి రాజధాని లేకుండా పోయింది. హైటెక్ సిటీ సృష్టి కర్త అయిన చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకుంటే హైదరాబాది తలదన్నే రాజధానిని నిర్మించి ఇస్తారన్న సగటు జనం విశ్వాసమే చంద్రబాబుని గద్దె మీదకు కూర్చోబెట్టింది. అదే జగన్ కి అయిదున్నర లక్షల ఓట్ల తేడాతో వెనక్కి నెట్టింది.

అమరావతి ఎంపిక‌ నుంచి….

ఇక చంద్రబాబు విషయానికి వస్తే గెలిచిన తరువాత ఏడాది వరకూ ఆయన హైదరాబాద్ విడిచి రాలేదు. ఈ లోగా ఆయన చేసిన పనేంటి అంటే అందరి ఆమోదం కోసం కనీసమాత్రమైన ప్రయత్నం కూడా చేయకుండా అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం. అక్కడ తన సొంత సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో వారికి లాభం చేకూర్చేటందుకే చంద్రబాబు ఇలా చేశారన్న ప్రచారం జనంలో బలంగా నాటుకుపోయింది. దాంతో మొదట్లోనే చంద్రబాబు మీద అపనమ్మకం అలా మొదలైంది. ఇక అమరావతి రాజధానిని అయిన చంద్రబాబు ఏ మాత్రమైన శ్రధ్ధ చూపి నిర్మాణాలు మొదలుపెట్టారా అంటే అదీ లేదు. అన్నీ టెంపరరీ బిల్డింగులే, అన్నీ తాత్కాలికమే. ఇక శాశ్వత భవనాలు అంటూ నోరూరించినవి అన్నీ గ్రాఫిక్స్ లోనే కనిపిస్తున్నాయి. అవి పూర్తి కావాలంటే లక్షల కోట్ల రూపాయలు అవసరం. అంతే కాదు, కనీసం ఇరవయ్యేళ్ల కాలం కూడా పడుతుంది. దాంతోనే అమరావతి రాజధానికి చంద్రబాబు కూడా భారీ బడ్జెట్ పెట్టి బొక్క బోర్లా పడ్డారు.

జగన్ కి అరుదైన అవకాశం….

ఏపీకి రాజధాని నిర్మించే గొప్ప అవకాశం చంద్రబాబుకు వచ్చినా కూడా ఆయన కోరి చెడగొట్టుకున్నారన్న ప్రచారం ఉంది. ఇక అయిదేళ్ళు తిరగకుండానే జగన్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఇపుడు ఆ అవకాశం అలాగే ఎదురువచ్చింది. జగన్ అమరావతి విషయంలో ఏ రకమైనా ఆలోచన చేసినా ఆ చుట్టుపక్కన ప్రాంతాల వారికి తప్ప మిగిలిన ఏపీ ప్రజలకు ఎటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశాలైతే లేవు. ఎందుకంటే అది ఓ సామాజికవర్గానికి ప్రతిపాదించిన రాజధాని అన్నది ఏపీ జనంలో బలంగా భావన ఉంది. అందువల్ల జగన్ అమరావతిని అలాగే ఉంచేసి అభివృధ్ధి వికేంద్రీకరించినా జనం హర్షిస్తారు. లేక ఆయన దొనకొండ వంటి చోటకు రాజధానిని తరలించి అయిదేళ్ళ కాలంలో శాశ్వతమైన భవనాలు కట్టి చూపించినా ఆయనకు జేజేలు పలుకుతారు. ఇక ఎక్కడ రాజధాని పెట్టినా కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు రెండవ రాజధాని కనుక ఇస్తే జగన్ కి జనం బ్రహ్మరధమే పడుతారు. ఇపుడు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం జగన్ కి ఉంది. చంద్రబాబు పోగొట్టుకున్న బంగారు అవకాశం జగన్ పరమైంది. ఆయన దాన్ని వాడుకుంటూ అయిదేళ్లలో మంచి రాజధాని నిర్మిస్తే ఆయనకు తిరుగుండదన్నది వాస్తవం.

Tags:    

Similar News