ఆరామం…అఖండ భారతం

శతాబ్దాల కల నెరవేరింది. భారతీయ ఆధ్యాత్మిక చైతన్యం ప్రభవించింది. అయోధ్యాపురం పల్లవించింది. కోట్లాది భక్తుల హృదయం పరవశించింది. గుండె గుండెలో జై శ్రీరామ్ ప్రతిధ్వనించింది. కోదండపాణి స్వర్గంగా [more]

Update: 2020-08-06 16:30 GMT

శతాబ్దాల కల నెరవేరింది. భారతీయ ఆధ్యాత్మిక చైతన్యం ప్రభవించింది. అయోధ్యాపురం పల్లవించింది. కోట్లాది భక్తుల హృదయం పరవశించింది. గుండె గుండెలో జై శ్రీరామ్ ప్రతిధ్వనించింది. కోదండపాణి స్వర్గంగా భావించిన జన్మస్థలిలో రామమందిర నిర్మాణానికి నాందీ ప్రస్తావన జరిగింది. అణువణువూ భక్తి భావ ప్రవాహంలో తేలియాడిన అయోధ్య భూమి పూజ నిజంగానే దేశ ప్రస్థానంలో ఒక చారిత్రక ఘట్టం.

పాలకులకు మార్గనిర్దేశకం…

అఖండ భారతావని అంబరాన్ని తాకేలా సంబరాలు జరుపుకుంటున్న వేళ అయోధ్యాపురి ఆధ్యాత్మిక చైతన్య పతాకను ఎగరవేసింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటూ ఆ సాకేత రాముడే స్వయంగా ప్రవచించిన సూక్తి సుదృఢమై మందిర రూపంలో కొలువు అవుతున్నశుభ సంకల్పానికి తొలి అడుగు పడింది. భారత దేశ చరిత్రలో ఒక అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులకు ఆరాధ్యదైవమైన జానకీ వల్లభుడు జన్మభూమిలో కోదండపాణిగా పున: ప్రతిష్ఠను పొందుతున్న పుణ్యఘడియలు సాకారమయ్యాయి. శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయుల స్వప్నం నెరవేరింది. దైవం మానుష రూపేణా అని నిరూపించిన మహిమాన్వితుడే శ్రీరాముడు. ధర్మానువర్తనకు, ప్రజారంజక పాలనకు పట్టం గట్టి దేశంలో ఇంటింటా, ఊరువాడా కొలువైన ఇక్ష్వాకుల తిలకునికి ఇప్పుడు అయోధ్యలో ప్రతిష్టాత్మక మందిరం రూపుదాల్చబోతోంది. శతాబ్దాల పూర్వం రాముడు దేశాన్ని పరిపాలించాడనేది ఇతిహాసం. నేటికీ సుపరిపాలనకు రామరాజ్యం మారుపేరు. ప్రజాస్వామ్య పాలకులకు మార్గనిర్దేశం .

రామో విగ్రహవాన్ ధర్మ:…

వ్యక్తిత్వ సర్వస్వం, పరిపాలన స్వరూపం, ధర్మానికి మూర్తిమత్వం శ్రీరాముడు. విశాల విక్రమ పరాజిత భార్గవ రాముడు సద్గుణ సోముడు, సువ్రత కాముడు అంటూ వేల సంవత్సరాలుగా వేవేల ప్రజానీకంతో కీర్తిస్తుతులందుకున్నాడు. శిష్టపరిపాలన, కష్ట నివారణ, దుష్ట సంహారం అనే రామలక్షణాలే పరిపాలనకు రాజలక్షణాలుగా రూపాంతరం చెందాయి. లంకేశు వైరి వంటి రాజును కలడే అని కవులు గ్రంధస్తం చేయడానికి కారణలయ్యాయి. దశరథ నందనుడు , దశముఖ మర్దనుడు అయిన రాముడు నాటికీ, నేటికీ ఆదర్శ పురుషునిగా నిలిచిపోవడమే కాదు, భారతీయతకు ప్రతీకగా నీరాజనాలందుకొంటున్నాడు. నేటి అపూర్వ ఘట్టం ప్రాముఖ్యానికి అదే ప్రధాన కారణం.

సాకేత పుర నీరాజనం…

ప్రధాని నరేంద్రమోడీ సహా ప్రముఖులు పాల్గొన్న రామమందిర శంకుస్థాపన క్రతువు ఒక సాంస్కృతిక , ఆధ్యాత్మిక సంబరాల మేలు కలయికగా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షప్రసారంలో కోట్ల మంది వీక్షించి తరించిన అరుదైన రికార్డు. రామాయణంలో రావణ వధ తర్వాత శ్రీరాముడు అయోధ్య ప్రవేశించిన అలనాటి వేడుకలను తలపింపచేసింది నేటి ఆధ్యాత్మిక శోభ. కవయిత్రి మొల్ల ప్రవచించినట్లు … ‘దానంబులిచ్చి భద్ర స్నానంబులు సేసి, భూషణంబుల్ పరిమళ సూనంబులు దాల్చి రధిక శోభనలీలన్ ’ అన్నంతగా అయోధ్యానగరం పండుగ చేసుకుంది. ‘మా కొరకు జనన మొందితివి, రాకాసుల రాజు చంపి రక్షించితివౌ , లోకంబులెల్ల కృపతో సాకేత పురాధినాథ, సజ్జన వినుతా’ అంటూ సాక్షాత్తూ రాముడికి కృతజ్ణతా సమర్పణగా హారతులు పట్టింది అయోధ్యానగరం.

ఇహపర సాధనం…

భక్తి సాగరం పరవశించి అలలు అలలుగా ఎగసింది. గుండెను గుడిగంటలుగా చేసుకున్నభక్తుల హృదయం పరవశించి భావోద్వేగం అలుముకుంది. మొత్తం అయోధ్యానగరం అంతా రామమయంగా భాసించింది. ‘అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా, మనునా మానవేంద్రేణా, యా పురీ నిర్మితా స్వయం’ అని ఆది కవి వాల్మీకి ప్రస్తుతించిన పురాణేతిహాస ప్రసిద్ధ సాకేతపురం కనులముందు సాక్షాత్కరించింది. రాముడంటే మానవుల్లో మానవుడు. దేవుళ్లలో దేవుడు. నరనారాయణ సంబంధానికి ప్రతీక. తండ్రిమాట జవదాటని కుమారునిగా, సోదర ప్రేమకు పట్టం గట్టే సహోదరునిగా, స్నేహానికి భాష్యం చెప్పే ఆత్మీయునిగా, శత్రువుని సైతం సమాదరించే ఆశ్రిత వత్సలునిగా , సేవకుడినైనా సమభావంతో చూసే సౌహార్ద హృదయునిగా రాముడు ప్రతివ్యక్తికీ ఆదర్శ పురుషుడే . ముఖ్యంగా ఏకపత్నీ వ్రతం. ఆదర్శ దాంపత్యం పేరు చెబితే శ్రీరాముడే గుర్తుకొస్తాడు. త్రేతా యుగంలోనే స్త్రీ సమానత్వాన్ని ఆచరించి చూపిన ధీరోదాత్తుడు. సీతారాముడు, జానకీ వల్లభుడుగానే ఆయన జగత్ ప్రసిద్ధుడు. అందుకే రామచరితమానస్ లో తులసీ దాస్ ..రాముడొక్కడే తప్ప .. స్వార్థరహితంగా మోక్షమిచ్చే ఇహపర సాధనం ఇంకెవరు? అంటూ ప్రశ్నిస్తాడు.

సయోధ్య…సాంత్వన…..

‘తారకమంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని రామా..’ అంటాడు మన భద్రాచల రామదాసు. ‘అంతయు నీవే హరి పుండరీకాక్ష.. చెంత నాకు నీవే శ్రీ రఘురామా.’ అంటూ రామావతార స్వారస్యాన్ని చాటిచెబుతాడు పదకవితా పితామహుడు అన్నమయ్య. రామ సుధారస పానము చేసి రంజిల్లవే మనసా అంటూ అనాదిగా ఆధ్యాత్మిక సాంత్వన పొందిన వారెందరెందరో. మొత్తానికి కొన్నితరాలుగా ఎదురుచూస్తున్న మహోత్క్రుష్ట ఘట్టం సాధికారికంగా సాకారమవ్వడం ప్రతి భారతీయుడు సగర్వంగా, సభక్తికంగా సంతోషించాల్సిన అంశం. రామనామమే సర్వజనహితాయ, సర్వజన సుఖాయ అని చెబుతారు. బాబ్రీ మసీదు కోసం పోరాడిన ఇక్బాల్ అన్సారీ తొలి ఆహ్వానం అందుకోవడం, రావణ జన్మభూమిగా భావించే బిస్రాఖ్ లోనూ ఈ తరుణంలో సంబరాలు చేసుకోవడం, అయోధ్యలో అన్నివర్గాల ప్రజలు ఈవేడుకలో భాగస్వాములు కావడం రామతత్వానికి నిదర్శనాలు.. అయోధ్య నేడు సయోధ్య పురి. రాముడు అందరి వాడు. అందుకే జగమంతా రామమయం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News