వారు కొంప ముంచేలా ఉన్నారే …?

సామాజిక దూరం పాటించండి. కరోనాను తరిమికొట్టండి అనేది ప్రపంచ నినాదం గా మారింది. ఈ విషయంలో భారత్ లోని ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ స్వీయ నిర్బంధం [more]

Update: 2020-04-17 18:29 GMT

సామాజిక దూరం పాటించండి. కరోనాను తరిమికొట్టండి అనేది ప్రపంచ నినాదం గా మారింది. ఈ విషయంలో భారత్ లోని ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ స్వీయ నిర్బంధం లో ఉంటూ వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తున్నారు. నిత్యావసరాల సమయంలో అత్యవసరం అయితే తప్ప లాక్ డౌన్ ను ఉల్లంఘించడంలేదు. అందరి ఐక్యతే లక్షల సంఖ్యలో భారత్ లో కరోనా విస్తరిస్తుందని జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టారు ప్రజలు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ముంబయి, ఢిల్లీ సంఘటనలు ఒక్కసారిగా దేశవాసుల్లో కలవరాన్ని పెంచింది.

వలస కూలీలు దడపుట్టిస్తున్నారు …

ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న దశలో ఉంది. ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి వలసకూలీలను తప్పుదోవ పట్టించాడు. సొంత ఊళ్లకు వెళ్లేవారంతా బాంద్రా రైల్వే స్టేషన్ కి చేరుకోవాలని సందేశం వైరల్ చేశాడు. దాంతో వేలాదిమంది ఆ మాటలు నమ్మి వలస కూలీలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులతో పెద్ద యుద్ధమే నడిచింది. మొత్తానికి ఇంతటి ఘోరానికి కారణం అయిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. కానీ వైరస్ ప్రమాదంలో ఉన్న ముంబయి వాసులే కాదు ఈ సీన్ చూసి దేశం ఉలిక్కి పడింది. ఇది కట్ చేస్తే అలాంటి సంఘటనే ఢిల్లీ యమునా తీరంలో ఎదురైంది. వేలమంది వలస కూలీలు అక్కడికి చేరి తమను సొంత ఊరికి పంపాలనే డిమాండ్ తో ఒక చోట చేరారు. అయితే గుడ్డిలో మెల్ల ఏమిటి అంటే వీరిని ఇలా గుంపుగా చేర్చడంలో ఉన్నవారు సామాజిక దూరంలో కూర్చుని ఉద్యమం చేయించారు. దీన్ని క్రేజీ వాల్ ప్రభుత్వం తక్షణం గుర్తించి వారందరిని ప్రత్యేక షెల్టర్ లకు తరలించారు. తమకు ఒక పూటే భోజనం ఉండటంతో సొంత ఊర్లకు బయల్దేరాలని నిర్ణయించామని వీరు చెప్పడం విశేషం.

దేశమంతా అదే సమస్య …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి లాక్ డౌన్ అస్త్రాన్ని బాగానే ప్రయోగించాయి. అయితే వలస కూలీలా సమస్యలను పరిష్కరించడం పై ఫోకస్ విస్మరించారు. ఫలితంగా ఇప్పటికే వందల కిలోమీటర్ల దూరం కాలినడకన వీరంతా వివిధ రాష్ట్రాల నుంచి బయల్దేరడం దయనీయంగా కనిపిస్తూనే ఉంది. వీరిని ప్రత్యేక వాహనాల్లో వారిని సొంత గ్రామాలకు తరలించేందుకు చర్యలు లేకపోవడమే ప్రమాద ఘంటికలు పదేపదే మోగిస్తున్నా కేంద్రం వీరి అంశంపై దృష్టి పెట్టకపోవడం పై విమర్శల వర్షం కురుస్తుంది. తాజాగా ఈనెల 20 నుంచి కేంద్రం లాక్ డౌన్ నిబంధనలలో సడలింపులు కి సిద్ధమైంది. ఇందులో కూడా వలస కూలీల సమస్య ను ప్రస్తావించకపోవడం ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉందని అంతా ఆందోళన చెందుతున్నారు. మరి దీనిపై ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి వీరి కష్ఠాలు తీర్చకపోతే ప్రమాదమే.

Tags:    

Similar News