అప్పుడు.. ఇప్పుడు..ఎప్పుడూనా?

జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగానే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఇప్పటికి ఏడుసార్లు భేటీ అయ్యారు. [more]

Update: 2020-02-16 08:00 GMT

జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగానే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఇప్పటికి ఏడుసార్లు భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే ఫలితం శూన్యం. కేవలం భేటీలే తప్ప కాసులు రాల్చడం ఇంతవరకూ పెద్దగా లేదు. దీంతో ఆరేళ్లు కావస్తున్నా విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. దీనికి తోడు సంక్షేమ పథకాలు కూడా ఖజానాను ఖాళీ చేస్తున్నాయి.

కాసులు విదిల్చింది…..

ఏపీ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటా 31.6 శాతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం జడీపీలో 17 శాతం మాత్రమే అప్పులున్నాయి. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆదుకుంది ఏమీ లేదనే చెప్పాలి. 2014 నుంచి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కాసులు విదిల్చింది లేదు. పైగా ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీని పైకి తెచ్చారు. దానిని కూడా అమలు చేయలేదు. నిజానికి చంద్రబాబు నాలుగేళ్ల పాటు మోదీతో సయోధ్యగానే ఉన్నారు.

బాబు హయాంలోనూ….

కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉన్నారు. రాష్ట్రానికి రావల్సిన సంస్థలు తప్ప ఆర్థికంగా ఆదుకున్నదీ అప్పుడూ లేదు. ఇప్పుడూ లేదు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడం లేదు. చంద్రబాబు కూడా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం, అమరావతికి నిధులను అప్పులు చేసి వినియోగించాల్సి వచ్చింది. చంద్రబాబు తన హయాంలో లక్ష 90 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. తర్వాత వచ్చిన జగన్ సర్కార్ చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేేసింది. ఆ భారాన్ని మోయడం తమ వల్ల కాదని చెబుతూ వస్తుంది. బాబు చేసిన అప్పులకు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి శాసనసభలోనే చెప్పేశారు.

కత్తి మీద సామే…..

అయితే పాలన చేతకాక, సంపద సృష్టించడం చేతకాకనే అప్పులంటూ గోలపెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తుతూనే ఉన్నారు. దీంతో వచ్చే నెలలోనే బడ్జెట్ సమావేశాలున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ ను జగన్ ప్రభుత్వం తొలిసారి పెట్టనుంది. మరి ఇటు సంక్షేమ పథకాలు, అటు అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ వెళ్లాలంటే జగన్ ప్రభుత్వానికి కత్తిమీద సామే మరి. ఇటు చంద్రబాబు, అటు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది శూన్యమేనని చెప్పాలి. మరి జగన్ ప్రభుత్వం ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

Tags:    

Similar News