ఇద్దరినీ మోడీ ఇరికించేస్తారా ?

పార్లమెంట్ లో చేసిన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి ఇవ్వాలిసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. వేలకోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్ట్ విషయంలో స్వప్రయోజనాల [more]

Update: 2020-10-27 03:30 GMT

పార్లమెంట్ లో చేసిన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి ఇవ్వాలిసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. వేలకోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్ట్ విషయంలో స్వప్రయోజనాల కోసం ఎపి లోని ప్రాంతీయ పార్టీలు నిర్లక్ష్యం వహించాయనే అంశాన్ని ప్రజల దృష్టి లో ఫోకస్ చేసి లబ్ది పొందాలని కమలనాధులు ఇప్పుడు ఎత్తుగడలు వేగం చేసినట్లు కనిపిస్తుంది. ప్రాజెక్ట్ కి పెరిగిన అంచనా వ్యయం దాదాపు 27 వేలకోట్ల రూపాయలను భరించాలిసింది రాష్ట్ర ప్రభుత్వమే అనే పరిస్థితిని కేంద్రం ఇప్పుడు కల్పించింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఈ ప్రాజెక్ట్ ను ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం లో చెప్పినట్లు ఏటీఎం కార్డు లా వాడేసుకోవొచ్చని టిడిపి కేంద్రం పరిధిలో ఉన్న ప్రాజెక్ట్ ను రాష్ట్రం కట్టుకుంటుందని ఒప్పించి ప్రజల నెత్తిన భారం పడేలా చేసింది. అంతే కాదు 2014 అంచనాల ప్రకారం అని అంగీకరించడం ద్వారా తరువాత పెరిగే వ్యయానికి కేంద్రానికి సంబంధం లేదన్నట్లు ఒప్పుకుని రాష్ట్ర వాసులపై పెను భారం మోపేలా కుదుర్చుకున్న ఒప్పందం గుదిబండలా తయారయింది.

ప్రాజెక్ట్ లేకుండానే ప్రచారానికి …

ఆలూ లేదు సూలు లేదు అన్నట్లు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకుండానే ఆర్టీసీ ద్వారా వేలమంది ప్రజలను అక్కడికి తరలించి ప్రచార ఆర్భాటం చేసింది గత టిడిపి ప్రభుత్వం. ఫలితంగా సుమారు 400 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా గా గోదావరిలో పోసేసింది. అలాగే ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ లపై కూడా తమ వారికి కట్టబెట్టడం ద్వారా అయాచిత లబ్ది పొందిందని వైసిపి గట్టి ఆరోపణలే ఎన్నికల ముందు చేసింది. జగన్ సర్కార్ అధికారం లోకి వచ్చాక ప్రాజెక్ట్ వ్యయాన్ని 58 వేలకోట్ల రూపాయల నుంచి 50 వేలకోట్ల రూపాయలకు రివర్స్ టెండరింగ్ ద్వారా తగ్గించింది. ఇన్ని చేసినా ప్రయోజనం లేనట్లు ఇప్పుడు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. పెరిగిన అంచనా వ్యయం తో కేంద్ర సర్కార్ కి సంబంధం లేనట్లు గతంలో ప్రభుత్వం ఆ విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడం సరికొత్త చర్చకు తెరతీసింది.

గతంలోనే ఉండవల్లి …

పోలవరం ప్రాజెక్ట్ ను టిడిపి చేపట్టడం ఆ తరువాత వైసిపి అధికారంలోకి వచ్చాక కేంద్రానికి అప్పగించకుండా వారు కాంట్రాక్టర్లను మార్చి కొనసాగించడాన్ని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ గతం నుంచి తప్పు పడుతూ వచ్చారు. పెరిగే అంచనా వ్యయం కానీ, ముంపు ప్రాంతాల పరిహారాలు తదితర సమస్యలు కేంద్రం రాష్ట్రం నెత్తిన పెట్టె అవకాశం ఉన్నందున ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రానికి అప్పగించాలని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పారు. ఇంత జరిగాక ఇప్పుడు జగన్ సర్కార్ సైతం ఆలోచనలో పడింది. ప్రోజెక్ట్ క్రెడిట్ సంగతి ఎలా ఉన్నా అవసరమైతే కేంద్రమే నిర్మించాలని అప్పగించడానికి సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాయడంతో పాటు అధికారుల బృందాన్ని ఢిల్లీ కి పంపనున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో అటు టిడిపి ఇటు వైసిపి లతో బిజెపి ఆట మొదలు పెట్టినట్లే కనిపిస్తుంది. ఈ పొలిటికల్ గేమ్ ఎలా ఉన్నా దీనివల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరికొంత కాలం ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Tags:    

Similar News