ప్రజల చేతి సొమ్ములేనా..?

భారత ప్రజల బలహీనత , బలమూ తెలిసిన కేంద్ర పెద్దలు వారికి ఆర్థిక సంకెళ్లు వేస్తున్నారు. ఇతర దేశాల కంటే కరోనా నుంచి భారతదేశం తొందరగా బయటపడే [more]

Update: 2021-01-19 15:30 GMT

భారత ప్రజల బలహీనత , బలమూ తెలిసిన కేంద్ర పెద్దలు వారికి ఆర్థిక సంకెళ్లు వేస్తున్నారు. ఇతర దేశాల కంటే కరోనా నుంచి భారతదేశం తొందరగా బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన మూడు నెలల కాలంలోనే 75 శాతం ఆర్థిక వ్యవస్థ రికవరీ అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సాధారణ ఆదాయ, వ్యయాలు, ఉత్పత్తి, అమ్మకాల్లో మరో 25శాతం మాత్రమే మాంద్యం ఉందన్నమాట. ఏప్రిల్ నాటికి అది కూడా భర్తీ అయిపోతుంది. అప్పటికి ప్రజలకు సంబంధించి కార్యకలాపాలు , దైనందిన ఆదాయం వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల గొప్పతనం కాదు. భారత ప్రజల్లో ఉండే సహజమైన క్రైసిస్ మేనేజ్ మెంట్ లక్షణాలే కారణం. కానీ ప్రభుత్వ గణాంకాలు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం భారత్ 2020 మార్చి నాటి స్థితికి రావాలంటే మరో ఏడాదిన్నర పడుతుంది. అందులోనూ 8 శాతం వృద్ధిరేటు సాధించాలి. ఈ ఆర్థిక కొలమానాలు పక్కన పెడితే ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కరోనా వంటి విపత్తులో ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు గొప్పగా స్పందించాయి. వాటి తీరుకు, భారత ప్రభుత్వం తన ప్రజలకు అందించిన సాయానికి హస్తిమశకాంతరం అంటూ పెదవి విరుస్తున్నారు ఆర్థిక వేత్తలు. పైపెచ్చు దీనిని ఒక అవకాశంగా మలచుకుంటూ ప్రభుత్వాలు ప్రజల జేబులు గుల్ల చేస్తున్నాయనే విమర్శలకు బలం చేకూరుతోంది.

ఆదుకుంటున్న అసంఘటిత రంగం…

కరోనా అనంతరం దేశం ఏమైపోతుందోననే ఆందోళనలు నిన్నామొన్నటివరకూ కొనసాగాయి. దేశంలో 80శాతం ప్రజలు అసంఘటిత రంగంపైనే ఆధారపడి ఉండటంతో , స్థిరమైన ఆదాయ,జీవన పరిస్థితులు లేకపోవడంతో భారత్ కష్టాలకు ఇప్పుడప్పుడే అడ్డుకట్ట పడదనుకున్నారు. కానీ నేడు ఆ అసంఘటిత రంగమే దేశాన్ని గట్టెక్కిస్తోంది. సంఘటిత రంగాలైన ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగుల వ్యయం కరోనా కంటే ఇప్పుడు తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి. కానీ వారందరికీ కరోనా సమయంలో మామూలుగానే జీతాలు, భత్యాలు లభించాయి. పైపెచ్చు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే సౌలభ్యం లభించింది. కానీ ముందు జాగ్రత్తతో ఆయా వర్గాలు పెద్దగా ఖర్చు చేయడం లేదని ఆర్థిక వేత్తలు, బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. కరోనా టైమ్ లో అసలు ఆదాయం లేకుండా పోయింది అసంఘటిత వర్గాలకే. వ్యాపారులు, దినసరి కూలీలు, రోడ్డు మీద చిన్నాచితక పనులు చేసుకునే వెండర్లు అంతా తమ ఆదాయాన్ని కోల్పోయారు. తాజాగా వారంతా తమతమ పనుల్లో నిమగ్నం కావడంతో ఆదాయం లభిస్తోంది. వచ్చిన ఆదాయంలో తొంభై శాతం మళ్లీ తమ అవసరాల కోసం ఖర్చు పెడుతున్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఎకానమీ ఒక్కసారిగా పుంజుకుంటోంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తమకు లభించే వేతనాల్లో సగటున 54 శాతమే ఖర్చు పెడుతున్నారు. మిగిలిన మొత్తం పొదుపు పద్దులోకి జారిపోతోంది. దీనిని బట్టి చూస్తే రోజువారీ బతుకు దెరువు వెదుక్కునే అసంఘటిత రంగం కారణంగానే భారత్ సగర్వంగా తలెత్తుకోగలుగుతోంది.

పడకేసే ప్రమాదం…

సంక్షేమం చూడాల్సిన సర్కారులు దోపిడీ పద్ధతులను అనుసరించడం ప్రజాస్వామ్యంలో చెడు లక్షణం. దురుపయోగమవుతున్న సంక్షేమ పథకాలకు కోత పెట్టలేని బలహీన స్థితికి ప్రభుత్వాలు చేరుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబాల సంఖ్యను మించి రేషన్ కార్డులు ఉన్నాయి. కిలో రూపాయికే బియ్యం అందిస్తున్నారు. ఇతర రేషన్ సరుకులూ తక్కువ ధరకే ఇచ్చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ వేల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పథకాలు. ఒక ప్రయివేటు సంస్థ వేసిన అంచనా ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 27 శాతం ప్రజలకు మాత్రమే ప్రభుత్వం అందించే రేషన్ సదుపాయం అవసరముంది. కానీ జనాభాను మించి సంక్షేమం ఇచ్చేస్తున్నారు. దాదాపు ప్రతి కుటుంబాన్ని ఏదో ఒక ప్రభుత్వ స్కీమ్ పరిధిలోకి తెచ్చేశారు. దీని కారణంగా అభివృద్ధి, మౌలిక వసతులపై పెట్టాల్సిన పెట్టుబడి వ్యయం పూర్తిగా మందగించింది. దుర్వ్యయం కారణంగా విపత్కర పరిస్థితుల్లో ఎకానమీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం తంటాలు పడాల్సి వస్తోంది. సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం చేతులు ఎత్తేయాల్సిన దుస్థితికి ప్రధాన కారణం మామూలు రోజుల్లో సాగించే దుబారా ఖర్చులే. పైపెచ్చు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదనపు ఆదాయం కోసం సుంకాల రూపంలో లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసే యత్నాలకు దిగింది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ప్రభుత్వ వ్యయమెక్కడ..?

రుణాలకు బ్యాంకులను టైఅప్ చేయడం వంటి పరిమిత చర్యలు మినహా కరోనా వంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు. ముఖ్యంగా ప్రపంచంలోని దేశాల ప్రభుత్వాలు తమ ఖర్చును విపరీతంగా పెంచుతూ ప్రజలను ఆదుకుంటున్నాయి. భారత్ లో మాత్రం 22 శాతం మేరకు ప్రభుత్వ వ్యయం కుదించుకుపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1930 లలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలో కీన్స్ ఆర్థిక సిద్దాంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాలు ప్రజలకు ఏదో రూపంలో పని కల్పిస్తూ వారి చేతిలో డబ్బులు ఉండేలా చూడాలనేది ఆ సిద్ధాంత సారాంశం. గోతులు తవ్వి మళ్లీ వాటిని పూడ్చటం అర్థరహితంగా కనిపిస్తుంది. కానీ ఆయా పనుల వల్ల ప్రజల చేతికి డబ్బులు వస్తే అదే చాలు. మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని కీ్న్స్ థియరీ చెబుతుంది. భారత దేశంలో భారీ ప్రాజెక్టులు, మౌలికవసతుల లేమి వెన్నాడుతోంది. ప్రభుత్వం రకరకాల రూపంలో మౌలిక వసతుల కల్పనకు పూనుకుంటే సహజంగానే ప్రజలందరికీ పనులు దొరుకుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఇవ్వగలం . కానీ పనులకు పరిధులు, పరిమితులు లేవు కదా. అందువల్ల ప్రభుత్వ వ్యయాన్ని పెంచితే పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయి. అంతా సర్దుకొంటోందని ప్రధాని, ఆర్థిక మంత్రి ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఆ సర్దుబాటుకు తమవంతు సాయం అందించడం ప్రభుత్వ కర్తవ్యమని గుర్తించడం మంచిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News