బిగ్ బ్రదర్ సర్కార్…?

తనకు వ్యతిరేకంగా పెరుగుతున్న అసంతృప్తి, అసమ్మతి, వ్యతిరేకతలను బలవంతంగా అదుపు చేసేందుకు బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తోంది కేంద్రప్రభుత్వం. ప్రెస్, సినిమా, సోషల్ మీడియాలను ఒకే దెబ్బతో కంట్రోల్ [more]

Update: 2021-08-20 15:30 GMT

తనకు వ్యతిరేకంగా పెరుగుతున్న అసంతృప్తి, అసమ్మతి, వ్యతిరేకతలను బలవంతంగా అదుపు చేసేందుకు బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తోంది కేంద్రప్రభుత్వం. ప్రెస్, సినిమా, సోషల్ మీడియాలను ఒకే దెబ్బతో కంట్రోల్ చేసేందుకు సూపర్ యాక్టుకు రూపకల్పన చేసే దిశలో పావులు కదుపుతోంది. ఈ ఏడాది శీతాకాలం సమావేశాల్లో పార్లమెంటులో కొత్త చట్టాన్ని ఆమోదింపచేయాలని భావిస్తున్నారు. దీనికి ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు సహకరించే అవకాశాలున్నాయి. చట్టంలో భాగంగా రాష్ట్రప్రభుత్వాలకూ విస్తృత అధికారాలు లభించనున్నాయి. అందువల్ల చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించకపోవచ్చు. చట్టం రూపురేఖలు పూర్తిగా తెలియకపోయినా, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం బిగ్ బ్రదర్ వైఖరి తీసుకుంటోందని జాతీయ మీడియాలోని ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. రకరకాల రూపాల్లో ఉన్న మీడియాను ఏకీకృత చట్టం పరిధిలోకి తేవడం ద్వారా పారదర్శకత, ప్రజా ప్రయోజనాల పరిరక్షణకే సూపర్ యాక్టు తీసుకురావాలనుకుంటున్నట్లు కేంద్రం చెబుతోంది.

ప్రత్యర్థిగా మారిన మీడియా..

ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయి. కానీ ఆ పాత్రను మీడియా కొంతకాలంగా బాగా పోషిస్తోంది. తొలి దశలో కేంద్రానికి బాగా సహకరించిన ప్రధాన స్రవంతిలోని మాధ్యమాలు క్రమేపీ వ్యతిరేక గళం విప్పుతున్నాయి. విద్యా, మేధావి వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసన స్వరాలు మీడియాను ఆకర్సిస్తున్నాయి. పైపెచ్చే ఏదో రూపంలో మీడియాపై ఉక్కు పాదం మోపాలని కేంద్రం చూస్తుండటాన్ని ప్రసార, ప్రచురణ మాధ్యమాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే కొంతకాలంగా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ అంశాలను ఫోకస్ చేస్తున్నాయి. న్యాయస్థానాల తీర్పులు, పరిశీలనలు, ప్రతిపక్షాల ఆందోళనలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఇటీవలి కాలంలో మీడియా హైలైట్ చేస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ట బాగా దెబ్బతింటోంది. ప్రత్యేక సర్వేల పేరుతోనూ వ్యతిరేక వార్తలకు ఉద్దేశపూర్వకంగా పెద్దపీట వేస్తున్నాయి. చాలా కాలంగా వీటిని పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సూపర్ యాక్టు ద్వారా కంట్రోల్ చేయాలనే ఆలోచనకు వచ్చింది. తప్పుడు వార్తలు రాసే ప్రచురించే , ప్రసారం చేసే ప్రెస్ తోపాటు, సినిమా, సోషల్ మీడియాపైనా చర్యలకు కొత్త నిబంధనలకు చట్టంలో అవకాశం కల్పిస్తారు.

సినిమాపైనా చిందులు..

సినిమాలకు సంబంధించి సెన్సార్ బోర్డు నియంత్రణ సంస్థగా ఇంతవరకూ ఉంటూ వస్తోంది. అత్యంత ప్రభావశీలమైన ఈ మీడియాపై ఇప్పటివరకూ పెద్దగా రాజకీయ పరమైన ఆంక్షలు, నిబంధనలు లేవనే చెప్పాలి. సామాజిక అశాంతి, అశ్లీలతలపైనే సెన్సార్ దృస్టి పెడుతోంది. సృజనాత్మకత పేరుతో చారిత్రక అంశాలను తప్పుదోవపట్టించినా, నాటకీయంగా సంఘటలను మలిచేందుకు చరిత్రకు వక్రభాస్యాలు చెప్పినా చెల్లుబాటవుతున్నాయి. భవిష్యత్తులో అటువంటి అంశాలనూ సెన్సార్ పరిధిలోకి తేనున్నట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో సెన్సార్ అనుమతులు పొందిన సినిమాలు సైతం అభ్యంతర కర రీతిలో ఉంటే దశాబ్దాల తర్వాత కూడా రీసెన్సారింగ్ కు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంటే విధానపరమైన అంశాల్లో విభేదించే సినిమాలపైన ఫిర్యాదుల పేరుతో ప్రదర్శన అర్హతకు గండి పడవచ్చు. సినిమాలోని ఒక వర్గం ఉద్దేశ పూర్వకంగా కేంద్రప్రభుత్వానికి వ్యతిరేక వ్యాఖ్యలతో సినిమాలు నిర్మిస్తోందనేది కేంద్రం అనుమానం. బీజేపీతో సైద్దాంతిక విభేదాలతో ప్రజల్లో అశాంతికి సినిమా మాధ్యమాన్ని వినియోగించుకుంటున్నారనేది కేంద్రం ఆరోపణ.

సోషల్ కంట్రోల్ క్లియర్…

సామాజిక మాధ్యమాల్లో అంతర్జాతీయ దిగ్గజాలైన వాట్సాప్, ట్విట్టర్ వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అదుపు చేయగలిగింది. గతంలో వీటికి విచ్చలవిడితనం ఉంటుండేది. పాశ్చాత్యదేశాలకు చెందిన తమను భారత ప్రభుత్వం ఏమీ చేయలేదని కొంతకాలం క్రితం వరకూ ఈ వేదికలు భావిస్తుండేవి. అయితే న్యాయస్థానాలు సైతం ప్రభుత్వానికి మద్దతు పలకడంతో ఈ మధ్యనే ఈ సంస్థలు దారికొచ్చాయి. ఇప్పుడు నియంత్రణ యంత్రాంగాలనూ ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ విజయంతోనే కేంద్రప్రబుత్వానికి తనపై తనకు నమ్మకం ఏర్పడింది. ప్రెస్ కౌన్సిల్, కేబుల్ టీవీ నియంత్రణ చట్టం, సినిమాటోగ్రపి చట్టం వంటివాటితోపాటు ఓటీటీ వేదికపై నిర్మితమవుతున్న చిత్రాలు, సోషల్ మీడియా వివిధరూపాలను పరిగణనలోకి తీసుకుంటూ నియంత్రణ, నిర్వహణపై శక్తిమంతమైన చట్టం తేవాలని సంకల్పిస్తున్నారు. బహిరంగంగా మంచి ఉద్దేశాలను ప్రకటిస్తున్నారు కేంద్రపెద్దలు. కానీ అంతర్గతంగా ప్రభుత్వం పై ప్రచార దాడి చేయకుండా రక్షణ కవచం నిర్మించుకోవడమూ చట్టంలో లక్ష్యంగా ఉండవచ్చు. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని మీడియా, సినిమా వంటి కళారూపాలను వేదించేందుకు పూనుకునే అవకాశం కూడా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతున్నప్పుడు చాలా సంయమనం వహించాల్సి వస్తుంది. మీడియా మౌనాన్ని ఆశ్రయించకతప్పకపోవచ్చు. అదే ప్రస్తుతానికి మీడియాతోపాటు మేధావులను ఆందోళనకు గురి చేస్తున్న అంశం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News