వాళ్ల గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం పక్కాగా ఆరా తీస్తోంది. ఇప్పటికే అన్ని రకాల పరిమితులు అధిగమించి, కొత్త అప్పులకోసం ఏపీ ఎదురు చూస్తోంది. ఈ నేపధ్యంలోనే [more]

Update: 2021-07-30 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం పక్కాగా ఆరా తీస్తోంది. ఇప్పటికే అన్ని రకాల పరిమితులు అధిగమించి, కొత్త అప్పులకోసం ఏపీ ఎదురు చూస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్రం పగ్గాలు బిగించేందుకు సిద్దమవుతోంది. గడచిన రెండు మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వం పంపిన అన్ని రకాల ఆర్థిక ప్రతిపాదనలు, అభ్యర్థనలను పక్కన పెడుతోంది. ఇతర విన్నపాలకు సంబంధించి కూడా వేగం తగ్గించింది. కేంద్రం సొంత ప్రయోజనాలకు సంబంధించి మాత్రం సత్వరం చర్యలు తీసుకుంటోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రం కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లేనని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నెల నుంచి వచ్చే మార్చి వరకూ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో కేంద్రం నియంత్రణ పెరుగుతుందంటున్నారు. రుణాలను పూర్తిగా నియంత్రించే దిశలో చర్యలకు ఆర్థిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. దీనివల్ల వైసీపీ ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, సంక్షేమ పథకాలపై పెను ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

టీడీపీ గిల్లికజ్జాలు…

రాజకీయంగా వైసీపీతో పోటీ పడలేకపోతున్న తెలుగుదేశం పార్టీ ఆర్థిక అస్త్రాలతోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తోంది. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ ప్రశ్నలు గుప్పిస్తోంది. అదుపు తప్పిన వ్యయంపై కేంద్రం నియంత్రణ చర్యలు తీసుకుంటుందో, లేదో చెప్పాలంటూ నిలదీస్తోంది. ఒక రకంగా కేంద్రాన్ని ఏపీపై ఎగదోసేందుకు తెలుగుదేశం ఏర్పాట్లు చేసుకుంటోంది. వైసీపీ దీనిని కౌంటర్ చేయలేని నిస్సహాయ స్థితి లో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉండే రాజకీయం హస్తినలో ప్రదర్శితమవుతోంది. టీడీపీ, వైసీపీల రాజకీయ వైరం కేంద్రానికి కలిసి వస్తోంది. ఇప్పటికే ఏపీపై బీజేపీ పెద్దలు ఒక కన్నేసి ఉంచారు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్టు తెలుగుదేశం అన్నిటికీ రెడీ అవుతోంది. కేంద్రం చేతికి కావాల్సినంత రాజకీయ ముడి సరుకు అందిస్తోంది. సాంకేతికంగా ఉన్న అవకాశాలను కేంద్రం కూడా వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్తిక దిగ్బంధనంలో చిక్కుకోక తప్పదు.

ఆర్థిక సంస్థలకు సంకేతం…

కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా తీసుకునే చర్యలకంటే పరోక్ష సంకేతాలు ప్రమాదకరమైనవి. సాధారణ పరిస్థితుల్లో ద్రవ్య నిర్వహణ చట్టం అనుమతించిన పరిమితుల కంటే 24 వేల కోట్ల కు పైగా ఏపీ వినియోగించుకుంది. మామూలుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం అంటే 30 వేల కోట్ల రూపాయల వరకూ ఏటా అప్పులు తెచ్చుకోవచ్చు. కానీ అది 54 వేల కోట్ల రూపాయలై కూర్చుంది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి లెక్క. అందులో 20 వేల కోట్ల రూపాయల వరకూ కరోనా వెసులుబాటుగా రెండు శాతం అదనపు రుణానికి కేంద్రం అనుమతించింది. ఆ పరిమితిని కూడా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అధిగమించేసింది. ఇవి కాకుండా కార్పొరేషన్ల రూపంలో చేసిన అప్పులు అదనం. రాజ్యసభలో వివరాలను టీడీపీ అడిగి రాబట్టింది. ఆయా వివరాలన్ని బహిర్గతం చేస్తూ కేంద్రం కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. అన్నిరకాల పరిమితులను ఆంధ్రప్రదేశ్ అధిగమించిందనేది కేంద్రం చేసిన వ్యాఖ్యల సారాంశం. వీటి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ లో రుణానికి చేసే ప్రయత్నాలకు గండి పడవచ్చు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరపతికి దెబ్బతగిలి ఆర్థిక సంస్తలనుంచి సాయం అందకపోతే ఎదురీత తప్పదు.

ఆందోళనలో వైసీపీ…

పార్లమెంటు సమావేశాలకు ముందుగా రాష్ట్ర ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఆర్థిక స్థితిగతులపై సమావేశంలో చర్చ జరిగింది. కేంద్రం పై ఒత్తిడి పెంచి పథకాల రూపంలో అయినా నిధులు వచ్చేలా చేయాలని స్పష్టంగానే ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం బకాయిలు , కేంద్రం నుంచి ముందస్తుగా ఈ క్వార్టర్ కు రావాల్సిన నిధులు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. అయితే అదంత సులభంగా కనిపించడం లేదని వైసీపీ ఎంపీలు వాపోతున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటే ఆంధ్రప్రదేశ్ కూడా అని కేంద్రం చెప్పేస్తోంది. పైపెచ్చు ఆర్థిక క్రమశిక్షణ పేరిట కోతలు విధించేందుకూ సిద్దమవుతోంది. పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారుతోంది. కేంద్రంపై తీవ్రమైన పోరాటం చేస్తే మరింతగా కట్టడి పెరుగుతుందేమోననే ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది. అటు ప్రతిపక్షాలతో కలిసి గొంతు కలపలేక, ఇటు బీజేపీ పట్టించుకోక రెంటికీ చెడ్డ రేవడిలా మారింది ఢిల్లీలో వైసీపీ పరిస్థితి. రానున్నది గ్గడ్డుకాలమేనని ఆ పార్టీ అంగీకరిస్తోంది. తన చేతికి మట్టి అంటుకోకుండా ఏపీ దు్స్థితిని ప్రజల కళ్ల ముందు పెట్టడానికి బీజేపీకి తాజా లెక్కలు ఆధారమవుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News