పోలవరంపై తప్పటడుగు బాబుదా? జగన్ దా?

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు. ప్యాకేజీ ఇప్పించండి చాలు. పోలవరం సవరించిన అంచనాల ప్రకారం నిధులు, పునరావాస ప్యాకేజీ పై స్పష్టత ఇవ్వకపోయినా ఫరవాలేదు. జగన్ [more]

Update: 2021-07-27 08:00 GMT

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు. ప్యాకేజీ ఇప్పించండి చాలు. పోలవరం సవరించిన అంచనాల ప్రకారం నిధులు, పునరావాస ప్యాకేజీ పై స్పష్టత ఇవ్వకపోయినా ఫరవాలేదు. జగన్ పై కేసులు మరింత బిగించి లోపలవేస్తే చాలు. ఈ తరహా రాజకీయంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి కూడా కీలక అంశాల్లో చంద్రబాబు మోడీ సర్కార్ తో నాడు పడిన రాజీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపంగా మారిందంటారు విశ్లేషకులు. నాటి సర్కార్ పాపాలు నేటి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఫలితంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేసేందుకు కేంద్రం మోకాలు అడ్డుతుంది.

పార్లమెంట్ లో కేంద్రం బుకాయింపు ….

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంట్లో పోలవరంపై సంధించిన ప్రశ్న కు కేంద్రమంత్రి షెకావత్ ఇచ్చిన జవాబు పోలవరం నిధుల విడుదల లో మొండిచెయ్యి చూపిస్తామన్న క్లారిటీ లభించింది. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లు మార్పు వల్ల పెరిగిన అంచనా వ్యయంతో మాకు సంబంధం లేదు. 2014 లో ఉన్న లెక్క ప్రకారమే మేము సొమ్ములు చెల్లిస్తాం ఇది కేంద్రమంత్రి ఇచ్చిన జవాబు. ఇప్పటికే పునరావాస ప్యాకేజీ అమలు మాకు సంబంధం లేనట్లే కేంద్రం వ్యవహరిస్తోంది. దీనికి తోడు ప్రతీ ఏటా పెరిగే అంచనాలు తమకు సంబంధం లేనట్లు ప్రకటించడం చూస్తే ఆంధ్రప్రదేశ్ పై మోడీ సర్కార్ చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో చెప్పక్కర్లేదు.

నాటి ప్రధాని హామీ నీటి మూటేనా …?

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పై రాజ్యసభలో చర్చ సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పోలవరం ప్రాజెక్ట్ పై స్పష్టంగా హామీ ఇచ్చారు. పెరిగే ప్రాజెక్ట్ వ్యయానికి అనుగుణంగా ఎంత అయితే అంత ఖర్చు జాతీయ ప్రాజెక్ట్ కు అందిస్తామన్నారు. పునరావాసానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందని అభయమిచ్చారు. కానీ ఇప్పుడు మోడీ సర్కార్ సీన్ చూస్తే పూర్తి రివర్స్ లో ఉంది. నాటి యూపీఏ చేసిన చట్టం కానీ ఇచ్చిన హామీలు మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నా అటు అధికార వైసీపీ ఇటు ప్రతిపక్ష టీడీపీ నిలదీయలేని నిశ్శహయతలో నిలబడ్డాయి.

బాబు చేపట్టకుండా ఉంటే …

చంద్రబాబు ఎన్డీఏ లో ఉండి చేసింది ఏమిటి అంటే పోలవరంను జాతీయ ప్రాజెక్ట్ ను కాస్తా రాష్ట్ర ప్రాజెక్ట్ గా చేసుకుని కేంద్రం నుంచి డబ్బులు పిండుకోవాలని చూశారు. మేము అయితే శరవేగంగా పూర్తి చేస్తామని నీతి ఆయోగ్ ను బలవంతంగా ఒప్పించి చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసేసారు. అదే ఇప్పుడు కేంద్రానికి బలంగా మారింది. విభజన చట్టం ప్రకారం కేంద్రం కట్టించాలిసిన ప్రాజెక్ట్ ను తగుదున్నమ్మా అంటూ రాష్ట్రం చేపట్టడమే నేటి దుస్థితికి కారణమని విశ్లేషకులు అంటుంటారు. పోనీ చంద్రబాబు తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరం ప్రాజెక్ట్ ను మీరే పూర్తి చేయండని కేంద్రానికి అప్పగించినా ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు. కానీ జగన్ సైతం చంద్రబాబు రూట్ లోనే వెళ్ళడంతో కేంద్రం ఏపీ సర్కార్ పై డ్యాన్స్ చేయడానికి ఆస్కారం కలిగిందన్నది వినిపిస్తుంది. మొత్తానికి నాడు బాబు నేడు జగన్ ప్రభుత్వాలు ముందు చూపు లేకుండా వేసిన అడుగులు ఏపీ వాసులను పోలవరంలో నిండా ముంచాయనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News