పోలవరంపై కేంద్రం వ్యూహం ఇదేనా .. ?

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనేది పేరుకు మాత్రమే అన్న చందంగా మారిపోయింది. నీతి ఆయోగ్ ను ఒప్పించి కేంద్రం పూర్తి చేయాలిసిన ప్రాజెక్ట్ ను కమిషన్ లకు [more]

Update: 2021-09-08 11:00 GMT

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనేది పేరుకు మాత్రమే అన్న చందంగా మారిపోయింది. నీతి ఆయోగ్ ను ఒప్పించి కేంద్రం పూర్తి చేయాలిసిన ప్రాజెక్ట్ ను కమిషన్ లకు కక్కుర్తిపడి వేగంగా మేమె కట్టుకుంటామని ప్రజలకు ప్రచారం చేసుకున్న గత టిడిపి సర్కార్ నిర్మాణం చేపట్టింది. పోలవరం ప్రాజెక్ట్ మొదలు పెట్టింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా అయితే ఆ క్రెడిట్ తనఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత రవాణా ఏర్పాటు చేసి ఉచిత భోజనాలు పెట్టి మరీ రాష్ట్రంలో ప్రజలను పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు తీసుకుపోయింది బాబు ప్రభుత్వం. ఈ స్థాయిలో చంద్రబాబు సర్కార్ కిందా మీదా పడినా ప్రధాని గా ఉన్న మోడీ గత ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాజెక్ట్ ను ఎటిఎం కింద వాడేశారంటూ బాంబు పేల్చారు.

ఎంత ప్రచారం చేసుకున్నా …

పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు నింగి నేలా కమ్మేశాలా చేసిన ప్రచారాన్ని గత ఎన్నికల్లో ప్రజలు విశ్వసించలేదు. ఆయన దారుణంగా ఓటమి పాలు అయ్యారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి అఖండ మెజారిటీ తో అధికారం చేపట్టింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తన తండ్రి కల ను నే నెరవేరుస్తా అంటూ కేంద్రానికి పోలవరాన్ని అప్పగించకుండా రాష్ట్రమే పూర్తి చేస్తుందని టిడిపి దారిలోనే ముందుకు సాగారు జగన్. అంతకుముందు పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రానికి అప్పగించాలన్న వైసిపి అధికారంలోకి వచ్చాకా ఆ మాటే మరచిపోవడం మరోసారి ఏపీకి శాపంగా మారింది. ఇప్పుడు కేంద్రం ఆట మళ్ళీ మొదలు పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిధుల విడుదలలో ఎలా వేధించిందో అంతకుమించి ఏడిపిస్తుంది జగన్ సర్కార్ ను. కనీసం బాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక పోలవరంలో జరుగుతున్న అన్యాయాన్ని ధర్మపోరాట దీక్షల్లో ప్రస్తావించి మోడీ ని నిలదీసేవారు. కానీ వైసిపి ప్రభుత్వం అదీ చేయలేక కేంద్రాన్ని తన బృందాలతో బతిమాలే పని మాత్రమే చేయడం విమర్శలకు దారి తీస్తుంది.

ప్రాజెక్ట్ అధారిటీ ని మరోసారి …

పోలవరం ప్రాజెక్ట్ పై నీలి నీడలు కమ్ముకుంటూనే వస్తున్నాయి. పనులు వేగంగా జరుగుతున్నా కొర్రీల మీద కొర్రీలు వేస్తూ కేంద్రం ఏపీ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆడుకుంటూ వస్తున్న సంగతి అందరికి తేటతెల్లం అయిపోతుంది. తాజాగా మరోసారి ప్రాజెక్ట్ అంచనాలపై కేంద్ర జలశక్తి సంఘం పోలవరం అధారిటీ ని వివరాలు పంపాలని కోరింది. ఇప్పటికి 2013 – 14 అంచనాల ప్రకారమే నిధులు చెల్లిస్తామంటున్న కేంద్రం పార్లమెంట్ లో ఒకలా బయట మరోలా నాటకాలు ఆడుతుంది. ఏపీకి న్యాయంగా ఖర్చు చేసిన సొమ్ము చెల్లించాలిసి ఉన్నా ఆ సొమ్ము తొక్కిపెట్టి ఆర్ధిక శాఖ ఇక్కట్లు సృష్టిస్తూనే వస్తుంది.

నిధుల విడుదల నిలుపుతోంది అందుకేనా … ?

కారణం 2018- 19 పెరిగిన అంచనా విలువ ప్రకారం 55 వేలకోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇందులో 20 వేలకోట్ల రూపాయలకే ఇప్పటివరకు కేంద్రం అంగీకరించింది. అందులో 11 వేలకోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించినట్లు పార్లమెంట్ లో ప్రకటించిన నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టం లో ఇచ్చిన హామీని సైతం కేంద్రం అమలు చేసేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేనట్లే కనిపిస్తుంది. మరో 44 వేలకోట్ల రూపాయలను కేంద్రం ఎప్పటికి ఏపీకి ఇస్తుంది. 2005 నుంచి మొదలై ఇప్పటికి 2021 నడుస్తున్నా ఐదు వంతుల్లో ఒకవంతు మాత్రమే ఖర్చు పెడితే మిగిలిన సొమ్ము ఎవరు భరిస్తారన్నది ప్రశ్నార్ధకమే. ఈ విధంగా చేయడం ద్వారా నిర్మాణ భాధ్యతను వైసిపి సర్కార్ స్వచ్చందంగా వదులుకోక తప్పదని అంటున్నారు. అలా ప్రాజెక్ట్ క్రెడిట్ ను కేంద్రం దక్కించుకోవాలనుకోవడం వల్లే నిధుల వ్యవహారంలో ఇబ్బందులు ఏర్పరుస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News