మళ్లీ ఒక శేషన్ కావాలి....!

Update: 2018-09-03 18:29 GMT

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. రాచరికాలు, నియంతృత్వాల స్థానంలో ప్రజాస్వామ్యాన్ని అభిలిషిస్తున్నారు. ఫలితంగా ప్రజాస్వామీకరణ ప్రక్రియ ఊపందుకుంటోంది. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే పునాది. అధ్యక్ష తరహా పాలన కావచ్చు లేదా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కావచ్చు. తప్పనిసరిగా ఎన్నికల సంఘం ఆవశ్యకత ఉంది. భారత్ తన ఆవిర్భావంతోనే ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంది. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం స్వతంత్ర ప్రతిపత్తిగల ఎన్నికల సంఘం అవసరాన్ని నాటి రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. రాజ్యాంగంలోని 1వ భాగంలో 324 నుంచి 329 అధికరణలు ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార, విధుల గురించి సవివరంగా ప్రస్తావించింది. స్వాతంత్ర్యం ఆవిర్భావం నుంచి ఎన్నికల సంఘం ఎన్నో మార్పులకు లోనైంది.

విధులు...అధికారాలు.....

జమిలీ ఎన్నికలపై చర్చ, తరచూ ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పాత్ర, ప్రాధాన్యం గురించి తెలుసుకోవడం అవసరం. ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘ: అధికారాలు, విధులు, పాత్ర గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, శాసనమండలి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు పర్యవేక్షిస్తాయి. ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓం ప్రకాశ్ రావత్. అశోక్ లావాసా, సునీల్ అరోరా మిగిలిన ఇద్దరు కమిషనర్లు. వీరంతా మాజీ ఐఏఎస్ అధికారులే. సాధారణంగా పదవీ విరమణ చేసిన అధికారులనే నియమిస్తారు.

ఎవరి జోక్యం ఉండకూడదు......

రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. దీని విధుల్లో ఎవరి జోక్యం ఉండదు. ఎన్నికల కమిషనర్ల నియామకం, అవసరమైన సిబ్బంది నియామకం వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. కమిషనర్ల నియామకం తర్వాత వాళ్లు స్వతంత్రంగా వ్యవహరించాలి. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంటుంది. జీతభత్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రాష్ట్రాల సీఈవో (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్)లకు హైకోర్టు న్యాయయూర్తుల హోదా ఉంటుంది. ఒకసారి ఏదైనా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల సంఘం వ్యవహారాల్లో ఎవరి పాత్ర, జోక్యం ఉండదు. కనీసం న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోకూడదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో స్పష్టం చేసింది. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఈసీ పరిధిలోకి వెళ్లిపోతుంది. అధికారుల ప్రవర్తన, వ్యవహారశైలిపై అనుమానాలుంటే బదిలీ చేసే అధికారం కూడా దానికి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 ఎన్నికల సమయంలో రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గా ఐవీ సుబ్బారావు ఉండేవారు. అప్పటి డీజీపీ ఎస్ఎస్ యాదవ్ ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉండేవారు. ఈ విషయాన్ని గమనించిన ఐవీ సుబ్బారావు ఆయన్ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో నిజాయితీపరుడు,సమర్ధుడైన అధికారిగా పేరున్న ఎ.కె. మొహంతిని డీజీపీగా నియమించారు. ఎన్నికల సంఘం తిరుగులేని అధికారాలకు ఇది నిదర్శనం. తర్వాత ఎన్నికలలో గెల్చిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఎస్ఎస్ యాదవ్ ను డీజీపీగా తీసుకొచ్చారు.

శేషన్ వచ్చిన తర్వాతే.....

టీఎన్ శేషన్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న సమయంలో కూడా తిరుగులేని అధికారాలను ప్రదర్శించారు. రాజకీయ నాయకులను గడగడ లాడించారు. మొత్తం అధికార యంత్రాంగం హడలిపోయింది. తొలిసారిగా ఎన్నికల ప్రక్రియ, ఈసీ అధికారాలపై అప్పట్లోనే ప్రజలకు అవగాహన కలిగింది. ఎన్నికల ప్రచారం, వ్యయ పరిమితులు, నిబంధనలు, ఆంక్షలను శేషన్ గట్టిగా అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. శేషన్ వరకూ ఎన్నికల సంఘం ఏకసభ్య కమిషన్ గా ఉండేది. శేషన్ కు ముకుతాడు వేయాలన్న ఉద్దేశంతో నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈసీని బహుళ సభ్య కమిషన్ గా మార్చి వేసింది. 1950 జనవరి 25న ఏర్పాటైన ఈసీ 1989 అక్టోబరు 15 వరకూ ఏకసభ్య కమిషన్ గానే ఉండేది. 1989 అక్టోబరు 16న త్రిసభ్య సంఘంగా ఏర్పడింది. 1990లో నాటి ప్రధాని వీపీ సింగ్ దాన్ని మళ్లీ ఏకసభ్య కమిషన్ గా మార్చారు. 1993లో మళ్లీ నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం త్రిసభ్య సంఘంగా మార్చింది. శేషన్ కు తోడు ఈసీలుగా ఎం.ఎస్.గిల్, జీవీజీ కృష్ణమూర్తిలను నియమించారు. సీఈసీ, ఈసీ ల అధికారాలు, జీతభత్యాల్లో పెద్దగా తేడాలేదు. నిర్ణయాలు కలసి తీసుకోవాలి. అభిప్రాయ బేధాలు వస్తే మెజారిటీ ప్రాతిపదికన వ్యవహరిస్తారు. సీఈసీని మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటు తొలగిస్తుంది. ఈసీలను సీఈసీ సిఫార్సు మేరకు తొలగిస్తారు. ఇప్పటి వరకూ ఇలాంటి పరిస్థితి రాలేదు.

సీఈసీలు వీరే......

ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలైన సందర్భంగా 2011 నుంచి ఏటా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినంగా పాటిస్తున్నారు. తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఎన్నికల వ్యవస్థకు రూపకల్పన చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన తొలి ఆంధ్రుడు ఆర్.వి.ఎస్. పేరిశాస్త్రి. తొలి మహిళ ఎన్నికల ప్రధాన కమిషనర్ గా తెలుగువారైన వి.ఎస్. రమాదేవి కొద్దిరోజులు పనిచేశారు. తర్వాత ఆమె కర్ణాటక గవర్నర్ గా కూడా వ్యవహరించారు. ఎక్కువ కాలం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల ప్రధాన కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి కె.వి.కె. సుందరం. తక్కువ కాలం సీఈసీ పనిచేసిన వ్యక్తి నాగేంద్ర సింగ్. ఓటర్ గుర్తింపు కార్డులను ప్రవేశ పెట్టిన సీఈసీ శేషన్. ఒటరు గుర్తింపు కార్డులను ఉపయోగించిన తొలి రాష్ట్రం హర్యానా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించిన తొలి రాష్ట్రం కేరళ. ఎన్నిలక సంఘానికి గుర్తింపు తెచ్చింది శేషన్ మాత్రమే. దాని పాత్ర, పరిధి గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించి ప్రజలకు మేలు చేశారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News