ఏపీలో సీబీఐ అలజడి… కేసులన్నీ దాని చేతికే?

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఏడాదిలోనే మూడు సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రభుత్వం తనంతట తాను గా కోరిన కేసు ఒకటి కాగా, [more]

Update: 2020-05-27 11:00 GMT

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఏడాదిలోనే మూడు సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రభుత్వం తనంతట తాను గా కోరిన కేసు ఒకటి కాగా, మిగిలిన రెండు కేసులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినవే. గుంటూరు, కడప, విశాఖ జిల్లాల్లో మూడు సీబీఐ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా వీటి దర్యాప్తు నత్తనడక సాగుతున్నప్పటికీ రానున్న కాలంలో సీబీఐ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక కేసులను దర్యాప్తు చేయబోతోంది.

యరపతినేని శ్రీనివాసరావు కేసును…..

ముందుగా గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ చేత విచారణ చేయించింది. అయితే సీబీఐ చేత దర్యాప్తునకు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సీఐడీ నివేదికను పరిశీలించిన హైకోర్టు యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్ వివేకా హత్య కేసును….

కడప జిల్లాలో కీలక నేత, ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ కు దర్యాప్తు కోసం అప్పగించింది. అయితే కేసులో పురోగతి లేకపోవడంతో వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, టీడీపీ నేత బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ప్రభుత్వం అవసరం లేదని వాదించినా హైకోర్టు మాత్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రాయలసీమలో సంచలనం కల్గించిన వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీని సీబీఐ ఛేదించాల్సి ఉంది.

డాక్టర్ సుధాకర్ అరెస్ట్ కేసును…..

తాజాగా విశాఖపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ అరెస్ట్ అంశాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. తర్వాత ఆయన నడిరోడ్డుపై గలాటా చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ అమానుషంగా ఉందని భావించిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఎనిమిది నెలల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి గడువు కూడా హైకోర్టు విధించింది. మొత్తం మీద జగన్ ఏడాది పాలనలో మూడు ప్రాంతాల్లో మూడు కేసులు సీబీఐ పరిధిలోకి వెళ్లాయి.

Tags:    

Similar News