నిఘా.... మీద నిఘా... ఎందుకిలా....?

Update: 2018-10-29 16:30 GMT

గత వారం పది రోజులుగా పత్రికా వార్తల్లో ప్రముఖంగా వినపడుతున్న పేరు కేంద్ర నిఘా సంఘం (సీవీసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్). ఈ సంస్థ పాత్ర ఏంటి? దానికి గల అధికారాలు, విధులు ఏంటి? సీబీఐకి సీవీసీకి సంబంధం ఏమిటన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. లోతుగా తరచి చూస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరిపాలనలో జరుగుతున్న అవినీతిని పరిశీలించడానికి, కె.సంతానం కమిటీ సిఫార్సు మేరకు 1964లో సీవీసీని ఏర్పాటు చేశారు. '998లో దీనిని బహుళ సభ్య కమిషన్ గా మార్చారు. ప్రస్తుతం ఈ సంస్థకు తెలుగువారైన కొసరాజు వీరయ్య చౌదరి సారథ్యం వహిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన కొసరాజు గతంలో సీబీఐటీ (సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్షన్ టాక్సెస్) ఛైర్మన్ గా పనిచేశారు. పూర్వాశ్రమంలో ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) అధికారి. సీవీసీలో కొసరాజుతో పాటు ఇద్దరు సభ్యులున్నారు. వారు డాక్టర్ తేజేంద్ర మోహన్ భాసిన్, శరద్ కుమార్. భాసిన్ గతంలో ఇండియన్ బ్యాంకు సీఈవోగా పని చేశారు. చట్టరీత్యా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నియామకంలో సీవీసీ పాత్ర ఉంటుంది. సీబీఐ పై పర్యవేక్షణ అధకారాలు కూడా కలిగి ఉంటారు.

ఎవరీ వీరయ్య చౌదరి.......?

తాజాగా సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తొలగింపులో, తాత్కాలిక డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావు నియామకంలో సీవీసీ వీరయ్య చౌదరి క్రియాశీల పాత్ర పోషించారు. అలోక్, ఆస్థానాలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు బాధ్యతల్లో ప్రస్తుతం సీవీసీ తలమునకలయ్యారు. కాసేపు ఈ విషయాలను పక్కనపెడితే అసలు సీవీసీ వీరయ్య చౌదరే అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా సీవీసీ గా పదవీ విరమణ చేసిన అధికారులను నియమిస్తుంటారు. ఇప్పటి వరకూ చౌదరి కాకుండా పదిహేను మంది సీవీసీలుగా పనిచేశారు. వీరంతా పదవీ విరమణ చేసిన అఖిల భారత సర్వీస్ అధికారులే. చౌదరి నియామకంలోనే ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. 2015లో కేంద్ర మంత్రిగా ఉన్న ఏపీ నాయకుడు, ప్రస్తుతం రాజ్యసభ బాధ్యతలో ఉన్న నాయకుడి ప్రభావంతో సీవీసీ పదవి వీరయ్య చౌదరికి లభించినట్లు అప్పట్లో అధికార వర్గాలు చర్చించుకునే వారు. నాన్ ఐఏఎస్ అధికారి కాకుండా ఐఆర్ఎస్ అయిన చౌదరి నియామకంపై అప్పట్లో ఐఏఎస్ అధికారుల్లో నిరసన వ్యక్తమయింది. చౌదరి నియామకంపై అప్పట్లోనే ప్రముఖ న్యాయ న్యాయకోవిదులు రాంజెంఠ్మలానీ, ప్రశాంత్ భూషణ్ లు నిరసన వ్యక్తం చేస్తూ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖలు రాశారు. ఇది వ్యవస్థలను ధ్వంసం చేయడమేనని వారు ధ్వజమెత్తారు. ప్రశాంత్ భూషణ్ అయితే నేరుగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. మరో కమిషనర్ టీఎం భాసిన్ నియామకాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు.

పట్నాయక్ ను నియమించి......

చట్టరీత్యా సీబీఐ వ్యవహారాలపై పర్యవేక్షణ అధికారం సీవీసీకి ఉంటుంది. అయితే నియంత్రణ అధికారం ఉండదు. ప్రస్తుతం సీబీఐ వ్యవహారాలపై సీవీసీ దర్యాప్తు చేపట్టింది. అయితే దర్యాప్తు ప్రక్రియకు పర్యవేక్షణ అధికారిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎ.కె. పట్నాయక్ ను సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. సీవీసీపై విశ్వసనీయత కొరవడినందునే న్యాయమూర్తిని నియమించారన్న చర్చ ఢిల్లీ అధికార వర్గాల్లో నడుస్తోంది. ఇది పరోక్షంగా సీవీసీకి కళ్లెం వేయడమేనన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. సీవీసీ విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించడం విశేషం. విచారణకు సాగదీతలేకుండా ఉండేందుకే ఈ గడువు విధించదని చెబుతున్నారు. పట్నాయక్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశం పరోక్షంగా సీవీసీపైనా సర్వోన్నత న్యాయస్థానం నిఘా పెట్టిందని చెబుతున్నారు. పట్నాయక్ నియామకంపై సీవీసీ తరుపున విచారణకు హాజరైన సొలసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరాలను సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించడం గమనార్హం. ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల కారణంగానే పర్యవేక్షణ అధికారిని నియమించామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొనడం గమనార్హం. చట్టప్రకారం సీవీసీ స్వయం ప్రతిపత్తిగల సంస్థ. అందువల్ల ఆయన మాత్రమే కేసు విచారణ సాగించేలా అనుమతివ్వాలన్న తుషార్ మెహతా అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. " ఇది ప్రత్యేక కసు. అందువల్లే ఇలా చేశాం. అంతే తప్ప ఏ సంస్థ పనితీరు పైనా వ్యాఖ్యనించడంగా భావించరాదు. సీవీసీపై అనుమానం వ్యక్తం చేసినట్లు కాదు" అని సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా పేర్కొంది. అంతిమంగా సుప్రీంకోర్టు పరోక్షంగా తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది.

కాంగ్రెస్ అభ్యంతరాలివే.....

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా కేంద్రం, సీవీసీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతోంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తప్పించడానికి కేంద్రం, సీవీసీ ఉమ్మడిగా కుట్ర పన్నాయని ఆరోపిస్తోంది. రఫేల్ ఒప్పందం అక్రమాలపై కూపీలాగుతున్న వర్మను కట్టడి చేసేందుకు కేంద్రం, సీవీసీ కలసి పనిచేశాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి అశోక్ గెహ్లెట్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పేర్కొనడం విశేషం. ఈ కుట్రలు ప్రధాని మోదీకి సీవీసీ చౌదరి సహకరించారని విమర్శిస్తోంది. సీవీసీ సిఫార్సుల మేరకే అక్టోబరు 24న అలోక్ వర్మ , రాకేష్ ఆస్థానాలను సెలవుపై పంపారంటున్నారు. ముందస్తు కార్యక్రమం ప్రకారం చౌదరి అక్టోబరు 23సాయంత్రం డెన్మార్క్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ, సీబీఐ వ్యవహారాల నేపథ్యంలో తన ప్రయాణాన్ని అర్థాంతరంగా వాయిదా వేసుకున్నారని కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లెట్, సూర్జేవాలా ఆరోపించారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో సీబీఐ ప్రతిష్ట ఎంతగా దెబ్బతినిందో, సీవీసీ ప్రతిష్ట అదే స్థాయిలో దెబ్బతిన్న మాట చేదునిజం. వ్యవస్థల విశ్వసనీయత దెబ్బతింటున్న నేపథ్యంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ కూడా అదే తరహా పరిస్థితిని ఎదుర్కొనడం ఆందోళన కల్గించే పరిణామం. వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం. వాటి పరిరక్షణకు పాటు పడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News