లాక్ 4.0 నా? ఎగ్జిట్ 2.0 నా?

మరో వారం రోజుల్లో లాక్ తీస్తారా? కథ కంచికి చేరుతుందా? ఇంకా షరతులు, మినహాయింపులు, ఆంక్షలు, అంతరాయాలు, అడ్డుకట్టలు కొనసాగుతాయా? అన్న అంశమే అఖిలభారత ప్రజావనిని వేధిస్తోంది. [more]

Update: 2020-05-10 16:30 GMT

మరో వారం రోజుల్లో లాక్ తీస్తారా? కథ కంచికి చేరుతుందా? ఇంకా షరతులు, మినహాయింపులు, ఆంక్షలు, అంతరాయాలు, అడ్డుకట్టలు కొనసాగుతాయా? అన్న అంశమే అఖిలభారత ప్రజావనిని వేధిస్తోంది. ఆ మాటకొస్తే యంత్రాంగానికే కాదు, రాజకీయ పార్టీలకు సైతం అంతుచిక్కడం లేదు. ‘జాన్ భీ జహాన్ భీ ’ అంటూ ప్రధానమంత్రి ఎప్పుడో చెప్పేశారు. ఆరోగ్యంతోపాటు ఆర్థిక ప్రస్థానమూ కావాల్సిందేనన్నారు. కానీ యాక్టివిటి పెద్దగా లేదు. పల్లెలు కొంతమేరకు ఫర్వాలేదు. పట్టణాల్లో ఇప్పటికీ ఆంక్షలు అమలవుతున్నాయి. ఆంక్షల ప్రయోజనం సామాన్యులకు అంతుచిక్కడం లేదు. గతంలో విడివిడిగా వెళ్లి కొనుక్కొనేవారు, ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు. మద్యం దుకాణాలు మొదలు పచారీ సరుకుల వరకూ క్యూలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకునేలా ఆంక్షలు విధించి వ్యాపారాలకు సాధారణ సమయాలు అనుమతిస్తేనే ఉత్తమమనేది సర్వత్రా వినవస్తున్న అభిప్రాయం. అయితే సర్కారీ వారీ ఆలోచనలే వేరు. తాము ప్రజలకోసం ఏదో చేస్తున్నామనే భావన కలిగించడంలో భాగంగా పూర్తిగా లాకులు ఎత్తేసే ప్రసక్తే లేదనే ఇప్పటికీ సంకేతాలు పంపుతున్నారు. నిజానికి మద్యం విధానం, వలస కూలీల తరలింపులోని అవకతవకలతోనే సర్కారు చిత్తశుద్ధి తేటతెల్లమైపోయింది. తాజాగా మే 17 తర్వాత దేశంలో కొనసాగే నియంత్రణలను లాక్ డౌన్ 4.0 గా కాకుండా ఎగ్జిట్ 2.0 గా చూడాలనే వాదనను కేంద్రం ముందుకు తెస్తోంది. ప్రజల్లో నెలకొంటున్న అసహనంపై అంచనాతోనే ఈ రకమైన అభిప్రాయానికి తావిస్తోందనుకోవాలి. సామూహికంగా గుమికూడటం, తోపులాటలు, సరుకుల కోసం ఎగబడటం వంటివి అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్థితి నుంచి సాధారణ పరిస్థితులకు తేవాలంటే జాగ్రత్తలు తీసుకునే క్రమాన్ని కఠినం చేయాలి తప్పితే ప్రజల దైనందిన వ్యవహారాలపై ఉక్కుపాదం మోపడం అనవసరం.

లక్ష…తర్వాతనే…

లాక్ డౌన్ 3.0 ముగింపునకు వచ్చే సరికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య లక్షకు చేరుతుందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో టెస్టింగుల సంఖ్య ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. చాలా నామమాత్రంగానే సాగుతోంది. రోగాన్ని కట్టడి చేసి ఏయేప్రాంతాల్లో విస్తారంగా ఉందో తెలుసుకోవాలంటే ప్రతి పది లక్షలమందికి కనీసం 20 వేల టెస్టులు చేయాలనేది ఆరోగ్యనిపుణులు చేస్తున్న సూచన. కానీ ఇంకా మనం రెండువేలకు కూడా చేరుకోలేదు. అంటే ప్రమాదం తీవ్రంగా పొంచి ఉన్నదనే చెప్పుకోవాలి. రోజురోజుకీ వెలువడుతున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను ద్రుష్టిలో పెట్టుకుని చూస్తే నిర్ధారణ కాకపోయినప్పటికీ భారత్ లో కరోనా బారిన పడిన వారి సంఖ్య కనీసం 20 లక్షల వరకూ ఉండొచ్చనేది ప్రాథమిక అంచనా. అయితే అందులో 85శాతం వరకూ ఎటువంటి లక్షణాలు కనిపించని వారే ఉంటారని వైద్యరంగం అంగీకరిస్తోంది. టెస్టులు జరిపితే మాత్రమే వారిలోని ఇన్ ఫెక్షన్ బయటపడుతుంది. లేకపోతే సాధారణ జలుబు తరహాలో తగ్గిపోయే అవకాశాలున్నాయంటున్నారు. అందువల్ల రోగం ఏ విధంగా విజ్రుంభిస్తుందనే విషయంలో ఎవరికీ అంచనాలు లేవు. పైపెచ్చు లక్షణాలు కనిపించని వారి నుంచి కొత్తవారికి మళ్లీ వారి నుంచి ఇంకొందరికి ఇలా గొలుసు తరహాలో కొనసాగుతూనే ఉంటుంది.అందుకే సరైన టెస్టులు జరపకుండా ఎంతకాలం లాక్ డౌన్ కొనసాగించినా ప్రయోజనం శూన్యమనేది ఒక వాదన. పైపెచ్చు లక్ష కేసుల తర్వాత తీవ్రతను అంచనా వేయడమూ అసాధ్యమంటున్నారు.

ముందు …వెనక….

ఇప్పుడు లాక్ డౌన్ నిష్క్రమణకు సంబంధించి ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితిని రాష్ట్రాలు, కేంద్రం ఎదుర్కొంటున్నాయి. ఇంతవరకూ ఎంతో కట్టడి చేశామంటూ ప్రభుత్వాలు క్లెయిం చేస్తున్నాయి. నిజానికి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చాలావరకూ కొత్త కేసుల మూలాలు సైతం దొరకడం లేదు. అంటే సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్లే. అందువల్ల ప్రజలు తమంతతాము స్వీయజాగ్రత్తలు తీసుకుంటే తప్ప నిరోధించడం అసాధ్యం. ప్రభుత్వాలు ఇంకా పూర్తిగా సన్నద్ధం కాలేదు. అన్నివర్గాల ప్రజలు తీవ్రతను గమనించి దానికనుగుణంగా నడచుకోలిగితేనే కొన్ని నెలల్లో కోవిడ్ నుంచి బయటపడగలుగుతాం. లేకపోతే పేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు దీని బారిన ఎక్కువగా పడే ప్రమాదం ఉంది. సామూహికంగా వ్యాప్తి చెందే ప్రమాదమూ పెరుగుతుంది. దీనిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి. సగటున రోజుకు నూటయాభై నుంచి రెండువందల వరకూ మరణాలు సంభవిచ్చని అంచనా వేస్తున్నారు. భారతదేశ జనాభాతో పోల్చి చూస్తే ఇదేం పెద్ద సంఖ్య కాదు. ఇప్పటికీ టీబీ, గుండెపోటు, కిడ్నీ వ్యాధులతో రోజుకు వేల సంఖ్యలో చనిపోతున్నారు. కరోనా బలిగొనే వారి సంఖ్య కంటే వ్యాప్తి తీవ్రత అనేదే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వాలు దానిపై దృష్టి పెట్టాలి.

కుదురు పడితే…

ప్రజలను కూర్చోబెట్టి పోషించగల సామర్థ్యం దేశానికి లేదు. అందులోనూ ప్రభుత్వం ఆర్థికగణాంకాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కొత్తగా రిజర్వ్ బ్యాంకు నోట్లు ముద్రించి ప్రజలకు , ప్రభుత్వాలకు పంపిణీ చేసే హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ సంగతులను పక్కన పెడదాం. కనీసం రాష్ట్రాలు కోరుతున్నట్లు అప్పు పరిమితిని పెంచే ఎఫ్ఆర్ బీఎం మినహాయింపులను సైతం కేంద్రం ఇవ్వడం లేదు. దానిని బట్టి చూస్తే ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం ఉదారంగా ఉండదలచుకోలేదనే విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా భారతదేశం స్థిరపడాలంటే తక్షణం ప్రపంచంలో నెలకొన్న పరిణామాలతో కలిసివస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలకు ఊతమిచ్చేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా ఉన్నాయి. భారత్ లో ఉన్న మానవ వనరులు, సౌలభ్యత, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే వ్యయం తక్కువ. అందువల్ల పారిశ్రామికీకరణకు అపారంగా అవకాశాలున్నాయి. చైనాలో చౌకగా ఉత్పత్తి సాధ్యమైనప్పటికీ ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు దానిని అనుమానాస్పద ద్రుక్పథంతోనే చూస్తున్నాయి. ఆర్థికంగా, సైనిక పరంగా నంబర్ ఒన్ స్థానం సాధించడానికి చైనా ఎంతటి కుట్రకైనా పాల్పడుతుందని భావిస్తున్నాయి. దాంతో చైనాను కట్టడి చేయడమనే ఏకైక లక్ష్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ విశ్వసనీయ దేశంగా నమ్మకాన్ని చూరగొంటోంది. ప్రపంచ వాణిజ్య ద్రుక్పథంలో వస్తున్న పెనుమార్పు ఇది. దీనిని అందిపుచ్చుకోవాలంటే వెంటనే లాక్ డౌన్ ఎత్తివేయక తప్పదు. లేకపోతే ఇప్పటికే ఇతర దేశాలు చైనా నుంచి తరలివచ్చే కంపెనీలను తమ దేశాల్లో ఏర్పాటు చేయించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. యుద్దప్రాతిపదికన భారత్ రంగంలోకి దిగాలి. భవిష్యత్తులో అమెరికా, చైనాలకు దీటుగా భారత్ ఎదగాలంటే దీనిని మించిన తరుణం దొరకదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News