మహా నటుడు….సీరియల్ రక్తి కడుతుందా?

వరసగా ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది. వివిధ వర్గాలకు సమకూరే ప్రయోజనాలను ఒకేసారి వెల్లడించవచ్చు. అందువల్ల దానికి లభించే ప్రచారం ఒక్కరోజుతోనే ఆగిపోతుంది. దశలవారీగా [more]

Update: 2020-05-16 16:30 GMT

వరసగా ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది. వివిధ వర్గాలకు సమకూరే ప్రయోజనాలను ఒకేసారి వెల్లడించవచ్చు. అందువల్ల దానికి లభించే ప్రచారం ఒక్కరోజుతోనే ఆగిపోతుంది. దశలవారీగా సీరియల్ తరహాలో కొనసాగించడం వల్ల విస్తృత స్థాయిలో ప్రభుత్వ చర్యలపై చర్చ సాగుతుంది. గరిష్ఠంగా మైలేజీ లభిస్తుంది. అందులోనూ ప్రభుత్వం చాలా తెలివిగా ప్రకటించే అంశాల్లో సైతం ఇప్పటివరకూ ఆయా వర్గాలకు తాము ఇంతవరకూ చేసిన సంక్షేమ కార్యక్రమాలనూ ఏకరవు పెడుతోంది. రోజుకు గంటకు పైగా సమయం తీసుకుని చాలా కూలంకషంగా వివరాలను వెల్లడిస్తున్నారు. ఎలా ప్రకటించినా ఫర్వాలేదు. ఆర్థిక సాయమెంత? అప్పుల రూపమెంత? అన్నదానిపై నిర్దిష్టమైన స్పష్టత రాకుండా చాలా తెలివిగానే దాచేస్తున్నారు. ప్యాకేజీ మొత్తం కేంద్ర సాయం కాదు, రుణసదుపాయం మాత్రమే. ఆ అంశాన్ని విడదీసి చూపడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించడం లేదు. ఇష్టపడటం లేదు. నగదు లభ్యతనే నగదు పంపిణీగా ప్రజలు భావించాలనే యోచన కనిపిస్తోంది. నిజానికి ఈ కష్ట కాలంలో అప్పు పుట్టినా చాలనుకునే ప్రజలకు కొదవ లేదు. విధి విధానాలను సాధ్యమైనంతవరకూ సరళీకరించి ప్రకటించిన ప్యాకేజీ అమలుకు నిశ్చితమైన గడువును నిర్దేశించాలి. అదే సమయంలో అమల్లో వెనకబడితే బ్యాంకులపై కొరడా ఝళిపిస్తామనే కచ్చితమైన హెచ్చరికలు సైతం జారీ కావాలి.

ముచ్చటగా మూడు…

మూడు రోజుల ప్యాకేజీ అంశాలను బేరీజు వేసుకుంటే ప్రణాళికాబద్దంగానే ప్రభుత్వం కసరత్తు చేసినట్లు స్పష్టమవుతోంది. వ్యవసాయం తర్వాత అధిక సంఖ్యలో ప్రజలకు ఉపాధిమార్గంగా ఉన్న సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలపైన మొదటిరోజు దృష్టి సారించారు. రెండోరోజు మానవ సంక్షోభంగా మారిన వలస కూలీల కోసం కొన్ని ప్రకటనలు చేశారు. అవన్నీ రానున్న రెండు నెలలు గోడౌన్లలో ఉన్న ఆహార పంపిణీకి ఉద్దేశించినవే. చౌక ధరకు వలస ప్రాంతాల్లో అద్దె ఇళ్ల కేటాయింపు వంటివి ఆచరణ సాధ్యం కాదని నిపుణులు తేల్చి చెప్పేస్తున్నారు. నగదు పంపిణీ, వారి జీవన ప్రమాణాల పెంపుదలకు సంబంధించిన చర్యలు కనిపించలేదు. జాతీయ రహదారులపై నడక సాగిస్తున్న లక్షలాది వలస కూలీలను ఇళ్లకు చేర్చే బాధ్యతను కర్తవ్యంగా చేపడతామనే హామీని, భరోసాను ఇవ్వలేదు. కనీసం అందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు కూడా కేంద్రం ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూలీల తరలింపు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులు నిలిపివేస్తామని కఠినమైన హెచ్చరికలు జారీ చేసి ఉండాల్సింది. రాష్ట్రాల వద్ద ప్రజారవాణా వ్యవస్థ సిద్ధంగా ఉంది. ఖాళీగా ఉంది. తరలింపు చేపడితే భద్రంగా సొంత గ్రామాలకు చేర్చడమే కాదు, అక్కడ క్వారంటైన్ చేయడం సులభమవుతుంది. నడక మార్గంలో కష్టాలకు ఓర్చి పల్లెలకు చేరుకునే వలస కూలీలపై నిఘా పెట్టడం కష్టమైతే మళ్లీ పరిస్థితులు మొదటికి వస్తాయి. ఇంతకాలం పెట్టిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ప్యాకేజీలో ఇటువంటి కనీస విషయాలను విస్మరించారు. ఆయా కుటుంబాలకు ఆహార ధాన్యాలతోపాటు ఆర్థిక సాయమూ అవసరమన్న సంగతిని పట్టించుకోలేదు.

ఆర్థికానుబంధం…

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు కార్ల్ మార్క్స్. తాజాగా ప్రభుత్వం, ప్రజల సంబంధాలు అంతకు మించి ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ప్రభుత్వాలు ప్రతి విషయాన్ని డబ్బు కోణంలోనే చూస్తున్నాయి. ప్రజలకు విద్య,వైద్యం అందించడం వారి కాళ్లపై నిలబడేందుకు దోహదం చేయడం వంటి పనులు మానేశాయి. విపరీతంగా ప్రభుత్వంపై ప్రజలు ఆధారపడేలా మార్చివేశాయి. అందుకే లాక్ డౌన్ వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఆసరా కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణ రోజుల్లో ఓట్ల రాజకీయంతో అవసరానికి మించి నగదు పంపిణీలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. కరోనా వంటి అసాధారణ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వాల వద్ద నిధులు ఉండటం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంక్షేమం పేరిట చేస్తున్న విచ్చలవిడి వ్యయానికి కళ్లెం లేదు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మధ్యతరగతి వర్గం కుదేలై పోయింది. చిన్నాచితక ఉద్యోగాలు చేసుకునేవారు, వ్యాపారాలు చేసుకునేవారు బాగా దెబ్బతిన్నారు. వారికి ప్రభుత్వాల నుంచి ఎటువంటి సాయం లేదు. ఆయావర్గాలు నిలదొక్కుకుంటేనే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆదాయం లభిస్తుంది. పేదలకు సంక్షేమం రూపంలో నిధులు సమకూరాలంటే మధ్యతరగతి వర్గాలలో కొనుగోలు శక్తి ఉండాలి. నిజానికి నూటికి 60 శాతం వరకూ ఉండే మధ్యతరగతి ప్రజలు స్వయం పోషకులు. ఎటువంటి ప్రభుత్వ ఆసరా లేకుండా జీవిస్తున్నారు. వారిని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన ఈ తరుణంలో సైతం మొండి చేయే కనిపిస్తోంది. ప్యాకేజీల్లో వారికి లభించేది నామమాత్రమే.

అయిదు రెట్లు…

ఆర్థిక ఉద్దీపనలో ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల్లో కేంద్రప్రభుత్వంపై నేరుగా పడే భారం నాలుగు లక్షల కోట్ల రూపాయల మాత్రమే ఉంటుందని అంచనా. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం గతంలో ఈ ఆర్థిక సంవత్సరం ఏడు లక్షల ఎనభైవేల కోట్ల రూపాయల మేరకు రుణం తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు రుణం పెంచుకునేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ప్యాకేజీలో భాగంగా ఈ మొత్తాన్ని అదనంగా ఖర్చు పెడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేతి నుంచి పడే సొమ్ముకు ప్యాకేజీ దాదాపు అయిదు రెట్లు పరిమాణంలో రూపకల్పన చేశారు. ఈ మొత్తం పథకాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ప్రయోజనదాయకమే. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం అన్నివర్గాల్లో అందరూ ప్రయోజనం పొందడం అసాధ్యం. అయినప్పటికీ సక్రమంగా అమలైతే పారిశ్రామిక, రైతాంగ సమస్యలను సగం మేరకు అయినా పరిష్కరించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News