ష్…గప్ చుప్…ఆ ఒక్కటీ అడక్కు

ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు హస్తినకు బాగా తెలుసు. ఇక్కడ ఉన్న పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే ప్రత్యర్థిపై పైచేయి సాధించడమే ప్రధానమన్న సంగతి [more]

Update: 2020-08-08 16:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు హస్తినకు బాగా తెలుసు. ఇక్కడ ఉన్న పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే ప్రత్యర్థిపై పైచేయి సాధించడమే ప్రధానమన్న సంగతి ఢిల్లీ పెద్దలు చక్కగా గ్రహించారు. అందుకే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష టీడీపీని పరోక్షంగా నియంత్రించగలుగుతున్నారు. పునర్విభజన చట్టానికి శఠగోపం పెడుతున్నా ఆ విషయమే పెద్దగా చర్చకు రావడం లేదు. రాష్ట్ర పరిస్థితులను రాజకీయ శత్రుత్వాలను కేంద్రం తనకు అనుకూలంగా మలచుకోగలుగుతోంది. వ్యూహాత్మకంగా చక్రం తిప్పుతోంది. తాజాగా మూడు రాజధానులు – అమరావతి విషయంలో హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ఇందుకో నిదర్శనం. అందులో కేసుకు సంబంధించిన ప్రమాణం కంటే రాజధానుల అంశమే హైలైట్ అయ్యింది. కేంద్రం కోరుకున్నది అదే. పునర్విభజన చట్టం, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన విద్యాసంస్థలు, పోలవరం ప్రాజెక్టు వంటి అనేక అంశాలకు సంబంధించి కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉంది. అవేమీ చర్చకు రాకుండా చాలా వ్యూహాత్మకంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర హామీలు, బాధ్యతలు మరుగునపడుతున్న సంగతిని ఈ అఫిడవిట్ చెప్పకనే చాటి చెప్పింది.

వైసీపీ సంబరం…

నిజానికి 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి కొంతమేరకు రాజకీయ ప్రయోజనం కలిగించే రీతిలో కోర్టులో ఒక కేసు దాఖలైంది. పునర్విభజన చట్టం ఆధారంగా కేంద్రాన్ని దోషిగా చూపించాలనే ఎత్తుగడతో హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టం హామీలపై భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని కేంద్రాన్ని నిలదీయం కేసు ప్రధాన లక్ష్యం. అప్పటి కేసుకు సంబంధించి తాజాగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో రాష్ట్ర రాజధానుల అంశం తమ పరిధిలోనిది కాదని చెప్పింది. నిజానికి న్యాయస్థానంలో నలుగుతున్న కేసుకు ఈ విషయానికి పెద్దగా సంబంధం లేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఇప్పుడు మూడు రాజధానులే ప్రధాన వివాదంగా నడుస్తుండటంతో కేంద్రం దానిని అనువుగా తీసుకుంది. ఈ అంశాన్నే హైలైట్ చేసింది. ప్రత్యర్థి పార్టీలు, మీడియా నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న వైసీపీ కేంద్రం అఫిడవిట్ తో ఊపిరి పీల్చుకుంది. కానీ అఫిడవిట్ లోని ఇతర అంశాలు దీర్ఘకాలంలో రాష్ట్రానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. దానిని తక్షణం గుర్తించకపోవడం, తమకేమి కావాలో అంతవరకే రాజకీయ పార్టీలు తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ కు పెను నష్టం వాటిల్లబోతోందనే చెప్పాలి.

టీడీపీ అయోమయం…

తెలుగుదేశం పార్టీ పూర్తిగా అయోమయంలో పడిపోయింది. అమరావతి టీడీపి ప్రభుత్వానికి ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం. చంద్రబాబు నాయుడికి పెట్ ప్రాజెక్టు. దానికి వైసీపీ సర్కార్ దాదాపు మంగళం పాడేస్తోంది. వాస్తవం కళ్లెదుట కనిపిస్తోంది. అయినా కేంద్రం జోక్యం చేసుకుంటుంది. పునర్విభజన చట్టం రాజధానికి రక్షణ కల్పిస్తుందంటూ తెలుగుదేశం నమ్మబలుకుతోంది. ఇది మా పరిధిలోని అంశం కాదంటూ న్యాయస్థానానికే కేంద్రం ప్రమాణపత్రం అందచేస్తూ కుండబద్దలు కొట్టేసింది. టీడీపీ గాలి తీసేసింది. తెలుగుదేశం నాయకులను ఆత్మరక్షణలో పడేసింది. ఇక తెలుగుదేశం కేంద్రాన్ని పట్టుకుని వేలాడుతూ తన రాజకీయ వాదనను ముందుకు తీసుకు వెళ్లడం సాధ్యం కాదు. ఆమేరకు స్పష్టత వచ్చేసినట్లే. న్యాయస్థానాల్లో సైతం కేంద్రం, రాష్ట్రం ఒకే వాదన వినిపించబోతున్నట్లు స్పష్టమైపోయింది. తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద దెబ్బ.

కమలం లోగుట్టు…

రాష్ట్రంలోని పార్టీల రాజకీయ అవసరాలతో కేంద్రం చదరంగం ఆడుతోందనే చెప్పాలి. ప్రత్యేక హోదా విషయంలో ఏ పార్టీ కూడా గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నాయి. దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో దాదాపు 20 వేల కోట్ల రూపాయల వరకూ రావాల్సి ఉన్నప్పటికీ దానిని సైతం రాష్ట్రం తీసుకోలేకపోతోంది. ఇంకో నాలుగు సంవత్సరాలలో పునర్విభజన చట్టం అమలు గడువు తీరిపోబోతోంది. విశాఖలో రైల్వే జోన్ ప్రకటించారే తప్ప ఆచరణలోకి రాలేదు. కడప స్టీల్ ప్లాంటు, ఓడరేవులు ప్రాజెక్టులు పట్టాలకే ఎక్కలేదు. విద్యాసంస్థలు నామమాత్రంగానే ఏర్పాటయ్యాయి. మౌలిక వసతులు లేవు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ పూర్తి కాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. దీనికి వేల కోట్ల రూపాయలు అవసరం. తాజా అఫిడవిట్ లో దీనికి కూడా కేంద్రం మెలిక పెట్టినట్లు కనిపిస్తోంది. ఇరిగేషన్ కాంపొనెంట్ మొత్తాన్ని తామే భరిస్తామని చెప్పుకొచ్చింది.

పోలవరంలో ఇబ్బందే….

ఇందుకుగాను ఇప్పటికే ఎనిమిదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పింది. కానీ ప్రాజెక్టులో ఇరిగేషన్ కాంపొనెంట్ గా నిర్మాణ వ్యయం 25 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఇందులో ఇప్పటికే దాదాపు 15వేల కోట్ల మేరకు ఖర్చు పెట్టారు. భూసేకరణ , సహాయ, పునరావాస కార్యక్రమాలకే 33 వేల కోట్ల రూపాయలు అవసరం. అది తమ బాధ్యత కాదన్నట్లుగా కేంద్రం ప్రవర్తిస్తోంది. న్యాయస్థానాల్లో ఎక్కడా కమిట్ కావడం లేదు. ఇది పోలవరం నిర్మాణాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది. రాష్ట్రం అంతపెద్ద మొత్తంలో నిధులు భరించలేదు. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈ విషయంలో అప్రమత్తం కావాల్సి ఉంది. లేకపోతే రాష్ట్రానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. స్థానికంగా అమరావతి- రాజధానుల వివాదం, ఎన్నికల కమిషనర్ వంటి తాత్కాలిక అంశాల కంటే కేంద్ర ప్రాజెక్టులు , పోలవరం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యేక ప్యాకేజీ రాబట్టుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో రాష్ట్ర రాజకీయ పార్టీలకు ప్రాప్తకాలజ్ణత కలగాలని కోరుకోవడం మినహా ప్రజలు మాత్రం ఏం చేయగలరు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News