అల్లరల్లరి అవుతుందిగా....!

Update: 2018-04-25 15:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో మీడియా కేరక్టర్ ఆర్టిస్టుగా రాజకీయ చిత్రం నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర ధారిగా నటిస్తుంటే, అనుబంధ పాత్రలు అల్లిబిల్లిగా మారుతున్నాయి. ఉత్కంఠ , ఆసక్తి కలగలసి వినోదాన్ని పంచుతున్నాయి. పవన్ రేకెత్తించిన చిచ్చుతో అసలీ డ్రామాను తాము ఎన్ క్యాష్ చేసుకోలేకపోతున్నామే అనే ఆవేదనతో మూడు ప్రధాన మీడియా గ్రూపులు అల్లాడిపోతున్నాయి. రోజుకో ట్వీట్ తో కొన్ని ప్రశ్నలను, ఆలోచనలను కలిగించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అవి సందర్భోచితమే అయినప్పటికీ మరీ మేధోపరం కావడంతో ప్రజలకు ఎంతవరకూ చేరతాయనే విషయంలో సందేహాలున్నాయి. అయితే ఆయన అభిమానులు మాత్రం కేరింతలు కొడుతూ ఆయన చేసే ట్వీట్లను ఎంజాయ్ చేస్తున్నారు. అర్థం సంగతి దేవుడెరుగు? అల్లరల్లరి చేసేందుకు మాత్రం ప్రకంపనల పరంపర కొనసాగుతోంది. మధ్యలో సినీ , రాజకీయ, ప్రసార రంగాలు కుదుపునకు గురవుతున్నాయి. ఇప్పటికే చరిత్రలో కనిష్ట స్థాయికి చేరిన మీడియా ప్రతిష్ట కొత్త లోతులవైపు తొంగి చూస్తోంది. ప్రసార, ప్రచురణ మాధ్యమాల తీరుతెన్నులను పరిశీలిస్తూ విసిగిపోయిన ప్రేక్షక,పాఠకులకు మాత్రం కక్ష తీర్చుకుంటున్నంత వినోదం కలుగుతోంది.

చివరికి మిగిలేది.....?

హిట్లర్ కాలం నాటి అప్రజాస్వామిక పోకడలను గుర్తు చేస్తూ పవన్ చేసిన ట్వీట్లు మీడియా నియంతృత్వ పోకడలను ఎండగట్టాయి. తనపై దాడి చేస్తున్న ప్రసార మాధ్యమాలపై ఉదాసీన వైఖరి కనబరిస్తే చివరికి మీరే బలవుతారంటూ ఆయన సినీ రంగాన్ని హెచ్చరించారు. కమ్యూనిస్టుల మీద, సోషలిస్టుల మీద, కార్మిక వర్గంపైన, యూదులపైన దాడి చేసినప్పుడు ప్రేక్షకపాత్ర వహిస్తే చివరికి హిట్లర్ సైన్యం తనపైకే దాడికి వచ్చిందంటూ ఒక కవి ఆవేదనను తాజాగా కొత్త తరానికి వెల్లడించారు. అప్పుడు అండగా నిలబడేవారు, ఆసరా నిచ్చేవారు ఎవరూ ఉండరంటూ సందేశాత్మకంగా చేసిన ట్వీటు టాలీవుడ్ లో సంచలనం రేకెత్తించిందనే చెప్పాలి. టాలీవుడ్ లో ఒక కదలిక తెచ్చింది. తన స్థాయి, పరిధి,పరిమితులను మరిచి ప్రధాన స్రవంతి లోని ప్రసారమాధ్యమాలు కొంతకాలంగా ఇష్టారాజ్యం చెలాయిస్తున్నాయి. వీటికి అడ్డుఅదుపు ఉండటం లేదు. స్వీయనియంత్రణ కరవైంది. ప్రభుత్వ పగ్గాలు లేవు. సర్కారీ వారి సేవ చేసిన తర్వాత మిగిలిన సమయమంతా రేటింగు ల యావలో సెక్సు, క్రైమ్ , సెలబ్రిటీ వార్తలకే కేటాయిస్తున్నారు. సమాజానికి ఉపకరించే అంశాలకు పదోవంతు సమయం కూడా కేటాయించడం లేదు. ఫలితంగా జుగుప్సాకరమైన చర్చలతో కాలం గడచిపోతోంది. మనిషి బలహీనతల మీద ఆధారపడి రేటింగు తెచ్చుకోవడమే ప్రధానలక్షణంగా మీడియా మారిపోయింది. శ్రీరెడ్డి ఉదంతంలో క్యాస్టింగ్ కౌచ్ కథతో వారంపైగా టెలివిజన్ రేటింగు పాయింట్లు పెంచుకున్నారు. పవన్ కల్యాణ్ తిరగబడిన తర్వాత ముఖం చెల్లక ఆ వార్తలకు చెల్లుచీటి పాడారు. పవన్ కూడా రేటింగు స్టారే. గతంలో కత్తి మహేశ్ ను అడ్డు పెట్టుకుని పవన్ పై విమర్శలతో మంచి ప్రేక్షకాదరణ సాధించారు. అయితే పవన్ పేర్లతో సహా కొన్ని చానళ్లతో యుద్ధమే ప్రకటించడంతో వారు ఆయనను చూపించలేకపోతున్నారు. మరోవైపు సినీరంగ ఉదాసీనతపై సంధించిన ప్రశ్నలతో కొంత ఒత్తిడి మొదలైంది. ప్రముఖులు సమావేశమై తాము మీడియాకు ముడిసరుకుగా మారకూడదని చర్చించారు. కట్టడికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సినిమా వార్తలు లేకపోతే న్యూస్ చానళ్లకు వచ్చేది జీరో రేటింగే. దీనిని ఏరకంగా నిరోధిస్తారనేది మీడియా ముందున్న ప్రశ్న.

పొలిటికల్ కౌచ్...

క్యాస్టింగ్ కౌచ్ తో మొదలై న వివాదం సినీ రంగాన్ని కుదిపేసింది. పవన్ ను ఈవివాదంలోకి లాగడంలో రాజకీయ పార్టీల పాత్ర చుట్టూ తిరిగి ఇప్పుడు పొలిటికల్ కౌచ్ అంటూ కొత్త టర్న్ తీసుకుంది. సీనియర్ కాంగ్రెసు నేత రేణుకాచౌదరి దీనిని బహిరంగపరచడంతో మీడియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. సినిమారంగం బలహీనమైనది కాబట్టి దానిని తీవ్రంగా చూపించిన మీడియా రాజకీయ కౌచ్ విషయాలను వదిలేస్తుందనే భావించాల్సి ఉంటుంది. టిక్కెట్లు తెచ్చుకోవడం దగ్గర్నుంచి తమ అధినాయకులను సంతృప్తి పరచడానికి కొందరు చోటామోటా నాయకులు పొలిటికల్ కౌచ్ కు పాల్పడుతున్నారనేది జగమెరిగిన సత్యం. అయితే సినిమారంగమంత బహిరంగంగా ఈ ప్రచారం సాగదు. అందులోనూ నాయకులకు సంఘంలో పరువు ప్రతిష్టలుంటాయని ఎవ్వరూ బహిరంగ పరచరు. సినిమా వాళ్లపై ఉండే చిన్నచూపుతో వారి జీవితాలను నడిరోడ్డుపై నిలబెడుతుంటారు. రేణుకా చౌదరి లేవనెత్తిన ప్రశ్నలోని ఆంతర్యమిదే. ప్రతిపనికీ తామున్నామంటూ హంగామా చేసే మాధ్యమాలు సమంజసమైన, సందర్భోచితమైన వ్యాఖ్యతో సంచలనాన్ని వెలికి తీసిన రేణుకను పట్టించుకోకుండా వదిలేయడాన్ని ప్రజాస్వామ్య హితైషులు జీర్ణించుకోలేరు. నిజానికి నైతిక విలువల విషయంలో రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు సమాజానికి దిశానిర్దేశం చేస్తారు. ఏమాత్రం వారి ఉదంతాలు చర్చనీయమైనా భవిష్యత్తులో సొసైటీకి మంచి జరుగుతుంది. సినిమా రంగం అవకాశాలు, అవసరాలతో వెలుగు జిలుగులు చిమ్మే తారాదీపం. అందులోని పాత్రలు ఎదగడానికి ఉన్న అన్ని అవకాశాలనుఅన్వేషించుకునే క్రమంలోనే అన్యాయానికి గురవుతున్నాయి. కానీ పాలిటిక్స్ అటువంటిది కాదు. సేవాభావం, ప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలి. ఈ రంగం దారి తప్పితే మొత్తంగా సమాజమే చెడు బాటన పడుతుంది. మీడియా, పవర్ ఫుల్ పవన్ వంటివారు దీనిపై దృష్టి సారించడం ఎంతైనా మంచిది. కొంచెం రిస్కీ అయినప్పటికీ దీనికీ మంచి రేటింగే ఉంటుందన్న విషయాన్ని ప్రసారమాధ్యమాలు గ్రహించాలి. ముందుగా తమ టీవీరంగంలోని కౌచ్ ల సంగతిని బయటపెడితే ఇంటినుంచే ప్రక్షాళన చేసుకున్నట్లవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News