“కుల” కాలక్షేపంతోనే కాలం గడిచిపోతుందిగా?

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత. దీంతో పాటు కులం ముద్ర కూడా ఎక్కువగానే ఉంటుంది. కులాల పద్ధతిపై రాజకీయం నడపటం ఒక్క ఏపీలోనే [more]

Update: 2020-04-11 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత. దీంతో పాటు కులం ముద్ర కూడా ఎక్కువగానే ఉంటుంది. కులాల పద్ధతిపై రాజకీయం నడపటం ఒక్క ఏపీలోనే చూస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రం విడిపోయినా తర్వాత ఈ జాడ్యం మరింత ఎక్కువయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, వైసీపీ పవర్ లో ఉన్నా కులాల ముద్ర నుంచి బయటపడలేని పరిస్థితికి చేరుకున్నాయి. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇది మరింత ముదిరింది. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఇంత కులాల గోల లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాతనే కుల రాజకీయాలు ఏపీలో ఎక్కువగా కన్పిస్తున్నాయి.

బాబు అధికారంలో ఉన్నప్పుడు….

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక సామాజికవర్గానికే పెద్ద పీట వేశారన్న విమర్శలు విన్పించాయి. అంతెందుకు రాజధాని అమరావతి ఒక సామాజికవర్గం కోసమే ఎంపిక చేశారన్న ఆరోపణలూ మూడేళ్ల క్రితమే విన్పించాయి. అక్కడ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు లబ్ది పొందేందుకే రాజధానిని ఎంపిక చేశారని వైసీపీ తీవ్ర విమర్శలు చేసేది. ఇక చంద్రబాబు హయాంలో ఒకవర్గానికి చెందిన అధికారులనే ఆయన ఉన్నతపదవుల్లో ఉంచారన్నది సుస్పష్టం.

ఆ సామాజికవర్గం అధికారులను…

పోలీసు శాఖలో ఒక ఉన్నతస్థాయి అధికారి పదవీ విరమణ చేసినా చట్టంలో సవరణలు చేసి మరీ చంద్రబాబు ఆయనను పదవిలో కొనసాగించడంపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు కూడా ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టిన కారణంగా ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే ఆయన చేసిన తప్పు. అప్పట్లో వైసీపీ కూడా దీనిపై రాద్ధాంతం చేసింది. అనేకమంది జగన్ సామాజిక వర్గానికి చెందిన అధికారులు బాబు హయాంలో లూప్ లైన్ లోనే ఉన్నారన్నది కాదనలేని వాస్తవం.

క్యాస్ట్ ఫార్ములాతో…..

వైసీపీ అధికారంలోకి రాగానే అదే క్యాస్ట్ ఫార్ములాను అమలు చేస్తోంది. చంద్రబాబు సామాజిక వర్గం అప్పటికే ఉన్నత పదవుల్లో ఉండటటంంతో వారిని తొలగించే కార్యక్రమం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించింది. ఎన్నికల కమిషనర్ పై నిర్భయంగా కుల ముద్ర వేయగలిగింది. వైసీపీ కూడా తక్కువేమీ తినలేదు. పాలన మొత్తం ఒక సామాజికవర్గం వారు చెప్పినట్లే నడుస్తుంది. వ్యతిరేకిస్తే వేటు తప్పదని మౌనం వహిస్తున్నారు. అప్పుడు చంద్రబాబు అయినా, ఇప్పుడు జగన్ అయినా కులంతోనే కాలక్షేపం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద బయటకు అలివిమాలిన ప్రేమ చూపించే ఈ ఇద్దరూ అంతర్గతంగా మాత్రం కులం కోరలతో కూర్చుని పాలన చేశారన్నది అందరూ అంగీకరించే సత్యం. ఏ రాష్ట్రంలో లేని కులజాఢ్యం ఏపీలోనే అలుముకోవడం ఆందోళన కల్గించే అంశమే. మరి ఏపీ ఎప్పటికి బాగుపడునో?

Tags:    

Similar News