అన్ని చేతులు కలుస్తున్నాయి…సీన్ అర్ధమవుతోందా.?

మనిషి పుట్టడానికి ఇద్దరు కావాలి. చనిపోతే మోయడానికి నలుగురు కావాలి అన్నది వేదాంతం మాట. ఇక మనిషి బతికి ఉన్నన్నాళ్ళూ సమాజం మొత్తం సాయం కావాలి. కానీ [more]

Update: 2020-08-21 14:30 GMT

మనిషి పుట్టడానికి ఇద్దరు కావాలి. చనిపోతే మోయడానికి నలుగురు కావాలి అన్నది వేదాంతం మాట. ఇక మనిషి బతికి ఉన్నన్నాళ్ళూ సమాజం మొత్తం సాయం కావాలి. కానీ ఆ సమాజాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా ఉపయోగించుకుని తాము ఒక్కరమే అందలం మీద అన్ని భోగాలతో ఉండాలి, మిగిలిన వారెపుడూ పాదాల కింద దాసులుగానే పడి ఉండాలి అనుకొవడంలోనే రాక్షసత్వం ఉంది. అదేంటో తెలియదు కానీ గత నాలుగు దశాబ్దాలుగా ఏపీలో కుల రాజకీయం పెచ్చుమీరింది. ఫలానా వాడు ఒక ఆటలో గెలిచాడు అంటే ముందు వాడిదే కులం అన్న ప్రశ్న మన మెదళ్ళలో వచ్చెంతలా ఈ కుల రక్కసి రక్తంతో ఇంజెక్షన్ చేసి పారేసింది. అదిపుడు ఎంతలా వికటాట్టహాసం చేస్తోందంటే ఒక ఘోర ప్రమాదం జరిగి పది మంది అమాయకులు విజయవాడ నడిబొడ్డున చనిపోతే అక్కడ కూడా తమ కులం వారుంటే వారిని రక్షించుకునే దారుణమైన, దౌర్భాగ్యమైన రాక్షస క్రీడకు తెగబడుతున్న దుస్థితి.

ఏం అన్యాయం …?

అమరావతి రాజధాని విషయానికి వద్దాం. అక్కడ ఏం అన్యాయం జరిగింది. భూములు ఇచ్చిన వారికి కౌలు కింద ఏపీలోని మిగిలిన ప్రజల పన్నుల నుంచి కట్టి ఇస్తున్నారు కదా. దాన్ని కూడా త్యాగంగా చెప్పుకుంటున్నారే. ఇక మరో వైపు చూస్తే అసలు రైతులేమో ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎపుడో సైడ్ అయిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుకు వచ్చారు. కాబట్టే అమరావతి కధ ఎంతకీ తెగడంలేదు. పైగా అక్కడ భూములు ఒకే ఒక సామాజివ‌ర్గం గుప్పిటన ఉన్నాయని కూడా ప్రచారం ఉంది. దీని మీద ఓ సామాజిక శాస్రవేత్త చేసిన అధ్యయనం చదివితే భయమేస్తుంది. ఏపీలోని మొత్తం సంపద అంతా ఒకేచోట గుమ్మరించి పెడితే కేవలం రెండు జిల్లాల వారే బాగుపడితే మిగిలిన 11 జిల్లాలు శతాబ్దాలకు పైగానే వారికి బానిసలుగా మారి ఊడిగం చేస్తే దారుణమైన రోజులు వస్తాయట. ఇది ఎంత ప్రమాకరమైనది.

సహించలేరా…?

రాజకీయం అన్నాక ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడుతారు. కేవలం అయిదేళ్ల కాలపరిమితికే ఈ తీర్పు. కానీ ఓడిన వారు ఎందుకు ఊరుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య స్పూర్తిని ఎందుకు దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్న వారు రేపో మాపో జైలుకు పోతారని, లేక ప్రభుత్వం కూలిపోతుందని మొదటి రోజు లగయితూ ఇప్పటిదాకా ఎందుకు చిలక జోస్యాలు చెప్పుకుంటూ అసహ్యకరమైన తీరులో వ్యవహరిస్తున్నారు. అధికారం అంటే ఎందుకంత మక్కువ. ప్రజలకు సేవ చేయాలన్న యావ కంటే కూడా తమ సామాజికవర్గం, దాని చుట్టూ అల్లుకున్న ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్న బాధ ఎక్కువైపోయిందా. లేకపోతే ఎందుకు ఇలా వివిధ రంగాలకు చెందిన ఒకే కులం వారు ఒకే గొంతుకగా మారి ఇలా విలవిలాడిపోతున్నారు. ఓటమిని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు.

బండబారిపోయారా…?

మళ్ళీ కత్తులు కటార్లు పట్టుకుని కుత్తుకలు కోసుకునే రాజుల కాలానికి, ఇంకా అటునుంచి రాతి యుగానికి వెళ్ళిపోతున్నారా. ఒక పార్టీ అధికారం కోల్పోతే ఇంతలా ఒంటి మీద బట్టలు కూడా చించుకుని రోడ్ల మీదకు వస్తున్న ఒకే ఒక సామాజికవర్గం గురించి చరిత్ర ఇంతవరకూ విన్నదీ కన్నదీ లేదు. కాంగ్రెస్ ఇప్పటికి రెండు సార్లు దేశంలో ఓడింది. కానీ అక్కడ హుందాతనం కనిపిస్తోంది. పొరుగున డీఎంకే పార్టీ కూడా రెండు సార్లు ఓడినా కూడా ఇంతలా వీరంగమేదీ వేయడంలేదు. కర్నాటక చూసుకున్నా అదే కధ. ఇక తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బ తిన్నా ఇలా ఒక వర్గం పెత్తనం ఆ పార్టీలో లేదు. మరి ఏపీలోనో ఎందుకు. ఆఖరుకు ఇంటి పేరు కూడా చెప్పుకోలేని వారు కూడా ఇపుడు ఇంతలా కులగజ్జిలో పడి కొట్టుకుపోవడానికి కారకులు ఎవరు. ఈ కుల సమరానికి ఇంతమంది డైరెక్టుగా ఇండైరెక్టుగా ఎందుకు వచ్చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాల హిట్లు ఉన్న కుర్ర హీరోలు కూడా తమ కులం, బంధుత్వం అంటూ కెరీర్ని కూడా బలిపెట్టి రాజకీయ రొచ్చులోకి ఎందుకు దిగిపోతున్నారు. ఏపీకి ఏదో జరుగుతోంది. ఇప్పటికైనా మారకపోతే కుల పిచ్చిలో ఉన్న పార్టీలనే జనం ఆరడుల లోతుల్లో పెట్టి పాతాళంలోకి తొక్కేసైనా ఏపీలో పొలిటికల్ సీన్ మార్చేస్తారు. అపుడు అసలు ఉనికే ఉండదేమో. తస్మాత్ జాగ్రత్త.

Tags:    

Similar News