విజయ్ కాంత్ నిర్ణయం అటువైపేనా?

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విజయ్ కాంత్ దారెటు అన్న చర్చ సర్వత్రా [more]

Update: 2021-02-09 18:29 GMT

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విజయ్ కాంత్ దారెటు అన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. విజయకాంత్ ఒంటరిగానే పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఒంటరిగా పోటీ చేసి తన సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. మొత్తం 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుపుతున్నారు.

ఒంటరిగా పోటీ చేసినప్పుడు…..

విజయ్ కాంత్ కెప్టెన్ గా తమిళనాడులో సుపరిచితులు. ఆయనకు తమిళనాడులో లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. దీంతో సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి విజయ్ కాంత్ వచ్చారు. 2006లో డీఎండీకే పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకున్నా విజయ్ కాంత్ నిరాశపడలేదు. అప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేశారు. అయితే ఆ తర్వాత 2011లో విజయ్ కాంత్ పార్టీ పది శాతం ఓటింగ్ ను సాధించుకుంది. 18 స్థానాలను గెలుచుకుంది.

గత ఎన్నికల్లో…..

దీంతో విజయ్ కాంత్ 2016లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలిపారు. అప్పటి పార్టీ అధినేత్రి జయలలిత విజయకాంత్ ను ఆహ్వానించారు. అయినా పెద్దగా ఫలితాలు సాధించలేదు. దీనికితోడు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా లేవు. దీంతో గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి మాత్రం హాజరయ్యారు.

అవమానిస్తున్నారని…..

ఇక రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే తమను పట్టించుకోవడం లేదన్న భావనలో కెప్టెన్ విజయ్ కాంత్ ఉన్నారు. తమకు కనీస స్థానాలను ఇచ్చేందుకు కూడా అన్నాడీఎంకే ఇష్టపడక పోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ అన్నాడీఎంకే నాయకత్వం మాత్రం విజయ్ కాంత్ పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు ఇచ్చే అవకాశం లేదు. దీంతో కెప్టెన్ తనను అవమానిస్తున్నారని భావించి పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కెప్టెన్ విజయ్ కాంత్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News