మళ్లీ ఏకపక్షమయతే…జగన్..?

విభజన నుండి నేటివరకూ ప్రాధాన్యత లేని విషయాలే పాలకులు మన నెత్తిపై మోపుతున్నారు. ప్రజలు గెలిపించారు అనే ఒక్క కారణంతో ప్రాధాన్యత లేని అంశాలతో పాలకులు (రాజకీయ [more]

Update: 2019-12-26 08:00 GMT

విభజన నుండి నేటివరకూ ప్రాధాన్యత లేని విషయాలే పాలకులు మన నెత్తిపై మోపుతున్నారు. ప్రజలు గెలిపించారు అనే ఒక్క కారణంతో ప్రాధాన్యత లేని అంశాలతో పాలకులు (రాజకీయ నాయకులు) ఆంధ్ర రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై కరాళ నృత్యం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన ఆఘమేఘాల మీద, ఆంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ జరిగిపోయింది. చట్టాలు, చట్టసభలు, ప్రజల అభిప్రాయాలూ పక్కన పెట్టి “వార్ రూమ్”లో నిర్ణయం తీసుకుని, అత్యయిక పరిస్థితి ప్రకటించి ఏకపక్షంగా రాజకీయమే లక్ష్యంగా విభజన జరిగిపోయింది. ఇది చరిత్ర. తిరిగి సరిదిద్దుకోలేని అంశం. దీనిపై రాద్ధాంతం చేయకుండా ప్రజలు కూడా రాజీ పడిపోతున్నారు. లోటు బడ్జెటు. రెవిన్యూ ఆదాయం లేదు. రాజధాని లేదు. చెప్పుకోదగ్గ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు లేవు (విశాఖపట్నంలో ఒకటి రెండు మినహా). నీటి పారుదల ప్రాజెక్టులు లేవు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం కొంత ఊరట కలిగించే విషయం.

ఉమ్మడి రాజధానిగా ఉన్నా….

విభజన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అక్కడే ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి కావలసిన భవనాల కేటాయింపు జరిగిపోయింది. లోటు బడ్జెట్టు విషయం మర్చిపోయి రాష్ట్ర అధికారులు మనకు కేటాయించిన భవనాలకు కొన్ని కోట్లరూపాయలు ఖర్చు పెట్టి మెరుగులు దిద్దారు. విభజన తర్వాత ఏర్పాటైన ప్రభుత్వం లోటు బడ్జెట్టు విషయం స్పృహలో లేకుండా మరికొన్ని కోట్లరూపాయలు ఖర్చుపెట్టి ఆ భవనాలకు మార్పులు చేసుకున్నారు. లోటు బడ్జెటుతో, ఆదాయవనరులు లేని రాష్ట్రానికి ఈ ఖర్చులు అదనపు భారం. ఆ భవనాలకు సొబగులు ప్రాధాన్యత అంశం కాదు. అయినా నూతన రాజధాని నిర్మించుకునే వరకు అంటే పదేళ్ళపాటు హైదరాబాదే రాజధాని కాబట్టి ఈ వృధా ఖర్చులను కూడా దిగమింగుకున్నాం. సమర్ధించుకున్నాం.

కోట్లు ఖర్చు చేసి వదిలేసుకుని….

తర్వాత రాజకీయ కారణాల దృష్ట్యా ఉమ్మడి రాజధాని వదిలి, అక్కడి భవనాలు వదిలి విజయవాడ వచ్చేశాం. ఏకపక్షంగా రాష్ట్ర విభజన ఎలా జరిగిందో రాజధాని తరలింపు కూడా అంతే ఏకపక్షంగా జరిగింది. ఆదాయం లేని రాష్ట్రానికి, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి, ఆర్ధిక లోటు ఉన్న రాష్ట్రానికి, అదనంగా ఉమ్మడిరాజధానిలో భవనాలపై చేసిన వ్యయాన్ని హుస్సేన్ సాగర్లో కలిపేస్తూ విజయవాడ వచ్చేశాం. హైదరాబాద్ భవనాలు వదిలేసి ఇక్కడ అద్దె భవనాలు, కొన్ని సొంత భవనాలు సమకూర్చుకున్నాం. అద్దెలు అసాధారణ రీతిలో పెరిగి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారం అయినా సరే మన ప్రభుత్వం మన దగ్గరే ఉంటుంది కదా అని సరిపెట్టుకున్నాం. లోటు బడ్జెటు, పెరుగుతున్న అప్పులు, ఎటు చూసినా కనిపించని ఆదాయ వనరులు… ఇదీ మన పరిస్థితి. ఉమ్మడి రాజధానిలో భవనాల సొబగులకోసం చేసిన ఖర్చులు, విజయవాడలో జరుగుతున్నా ఖర్చులు…. ఇవన్నీ ఈ రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన చర్యలు కావు.

మరింత భారం మోపి…..

ఇక రాజధాని ప్రణాళిక కూడా మన రాష్ట్ర ఆర్ధిక స్తొమత దృష్టిలో పెట్టుకొని జరగ లేదు. నిర్మాణ వ్యయం తక్కువలో ఉండాలనే స్పృహ కనిపించలేదు.పరిశ్రమలు లేని, పారిశ్రామిక ఆదాయం లేని వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పంట భూములకు సాధ్యమైనంత మేర నష్టం జరగ కుండా, వ్యవసాయ కూలీల జీవనం డిస్ట్రబ్ కాకుండా రాజధాని ప్లాన్ చేసి ఉండాల్సింది. కానీ, పాలకులు తమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా రాష్ట్రానికి మరింత ఆర్ధిక నష్టం కలిగేలా, పేద ప్రజల జీవితాలు ఛిద్రం అయ్యేలా పంట పొలాలను రాజధానికి ఎంపిక చేసి, ఎక్కడా లేని అత్యధిక వ్యయంతో భవనాల, రోడ్ల నిర్మాణానికి నిర్ణయాలు తీసుకొని కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశీ సంస్థలతో ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్రంపై మరింత భారం మోపారు. ఇవన్నీ ఆదాయ వనరులు లేని, ఆర్ధిక లోటు ఉన్న రాష్ట్రానికి ప్రాధాన్యతాంశాలు కావు.

హెచ్చరికగా కనపడటం లేదా?

ఇప్పుడు ప్రభుత్వం మారింది. గతం నుండి గుణపాఠాలు నేర్చుకొని ఉండాల్సిన అవసరం ఉంది. విభజనలో చేసిన అన్యాయానికి ప్రజలు అప్పటి అధికార పార్టీని భూస్థాపితం చేశారు. విభజన తర్వాత మన ఆర్ధిక స్థితిగతులతో సంబంధం లేకుండా విలాసవంతమైన ప్రణాళికలతో పాలన చేసిన అధికార పార్టీని కూడా అదే స్థాయిలో ప్రజలు ఓడించారు . ఇవి రెండూ ఇప్పటి అధికార పార్టీకి ఒక హెచ్చరికగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నాలు చేయాలి. ఆదాయ వనరులు పెంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రజల స్థితిగతులను పెంచే చర్యలు చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ ప్రాధాన్యతాంశాలు. అంతే కానీ రాజధాని ఇప్పుడు మన ప్రాధాన్యతాంశం కాదు. పరిపాలన ప్రస్తుతం ఉన్న తాత్కాలిక భవనాల్లో సాగిపోతుంది. అదనపు భవనాలు కావాలి అంటే నిర్మాణ వ్యయం తక్కువగా ఉండే గట్టినేలలు ఉన్న మంగళగిరి ప్రాంతానికి, జాతీయ రహదారికి రెండువైపులా స్థలాలు ఎంపిక చేసుకోవచ్చు .(విశాఖపట్నానికి వ్యతిరేకం కాదు. కానీ సచివాలయం, శాసన సభ ఒకేచోట ఉండాలనేది మాత్రమే నా వాదన) విజయవాడలో అసాధారణ అద్దెభవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించుకోవచ్చు. ఈ పనులు కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టవలసినవి మాత్రం కావు.

ఇది ప్రాధాన్యమా?

ఇప్పుడు రాజధాని విశాఖపట్నం తరలించి అక్కడ మరోసారి భవనాల నిర్మాణానికి వ్యయం చేయాల్సిన పని మన ప్రాధాన్యతాంశం కాదు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మూడు రాజధానులు (హై కోర్టు మినహాయిస్తే) రాష్ట్రంపై మరింత ఆర్ధిక భారం పడబోతోంది. సచివాలయం ఒకచోట, శాసన సభ మరోచోట ఉంటే ప్రతి సమావేశానికీ అధికార యంత్రంగా తరలి రావడం ఈ రాష్ట్ర ఆర్ధిక స్థితి దృష్ట్యా ఆరోగ్యకరమైన నిర్ణయం కాదు.

క్యూలో నిలబడి మరీ….

కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా ఇవ్వని ఈ ప్రజలు, తెలుగుదేశం పార్టీని ఓడించడానికి తెల్లవారుఝామున 4గంటల వరకూ లైన్లో నిలబడి ఓట్లేసిన ఈ ప్రజలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాడని మరో రెండు గంటలు అదనంగా లైన్లో నిలబడతారు. ఇది వాస్తవం.
ఈ రాష్ట్రానికి ప్రాధాన్యతాంశాలు ఏవో వాటిపై దృష్టి పెట్టండి. ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపట్టండి. రాజధాని ఇప్పుడు ఈ రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. ఆ పని ఆర్ధిక ఆరోగ్యం మెరుగుపడ్డాక చేసుకోవచ్చు.

ఏకపక్ష నిర్ణయాలతో…..

అమరావతి విషయంలో అఖిలపక్ష సంప్రదింపులు లేకుండా జరిగిన ఏకపక్ష నిర్ణయాలకు ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కూడా అఖిలపక్షాలను, ప్రజాసంఘాలను సంప్రదించకుండా నిర్ణయాలు జరిగితే ప్రజలు ఏకపక్షంగా తీర్పులు ఇస్తారు. అశాస్త్రీయ విభజనకు ఒక పార్టీ, అశాస్త్రీయ పాలనకు మరొక పార్టీ ప్రజాగ్రహానికి బలయ్యాయి. పట్టుదలకు పోకుండా ప్రజలకు, ఈ రాష్ట్రానికి ప్రాధాన్యతాక్రమంలో ఇప్పుడు ఏది ముఖ్యమో అది చేస్తే 2019లో ప్రజల తీర్పును అర్ధం చేసుకున్న నేతలు అవుతారు. లేకపోతే ప్రజలు మళ్ళీ 2024లో పోలింగు కేంద్రాలకు వస్తారని మర్చిపోవద్దు.

– దారా గోపి, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News