అయిననూ రావలె విశాఖకు ?

విశాఖ రాజధానికి ఓ వైపు న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి. హైకోర్టులో గుట్టలుగా పిటిషన్లు పడ్డాయి. దాని మీద‌ విచారణ జరుగుతోంది. తీర్పు ఎపుడు వస్తుందో చూడాలి. ఆ [more]

Update: 2020-12-08 02:00 GMT

విశాఖ రాజధానికి ఓ వైపు న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి. హైకోర్టులో గుట్టలుగా పిటిషన్లు పడ్డాయి. దాని మీద‌ విచారణ జరుగుతోంది. తీర్పు ఎపుడు వస్తుందో చూడాలి. ఆ మీదట సుప్రీం కోర్టు ఎటూ ఉంది. ఇలా ఉండగా విశాఖ రాజధాని మోజు మాత్రం జగన్ కి వీడినట్లుగా లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి విశాఖలో హడావుడి చేస్తోంది. విశాఖలో రాజధాని తరలిస్తే భవనాలకు కొరత లేకుండా చూడాలని అధికారులకు అదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం విశాఖకు వస్తున్న అధికారులు బీచ్ రోడ్డులోని రుషికొండ వైపుగా కార్లను జోరుగా మళ్ళిస్తున్నారు.

అక్కడేనా ..?

విశాఖలోని కాపులుప్పాడ ఐటీ టవర్స్ లో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఉంటుందని ఇప్పటిదాకా అనుకున్నారు. అయితే అక్కడ సీఎం రాకపోకలు సాగిస్తే ఐటీ సంస్థలకు ఇబ్బంది వస్తుందని ప్రచారం జరిగింది. విపక్షాలు కూడా ఐటీని విశాఖ నుంచి తరిమేస్తున్నారని ఆరోపించాయి. దాంతో ప్రభుత్వం మనసు మార్చుకుని ఇపుడు రుషికొండ మీద ఉన్న వేరే భవనాలను తీసుకోవాలనుకుంటోందిట. ఇక్కడ టూరిజం శాఖ భవనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ గా వాడతారు అని ప్రచారం అయితే సాగుతోంది.

తరలింపు ఖాయం…..

ఇక డీజీపీ ఆఫీస్ కూడా రుషికొండ మీదనే ఏర్పాటు చేయాలనుకుంటున్నారుట. ఇందుకోసం ఇక్కడ టూరిజం శాఖ నిర్మించిన భవనాలతో పాటు ప్రైవేట్ బిల్డింగ్స్ ని కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అదే విధంగా హరితా కాటేజెస్ టూరిజం శాఖ వద్ద ఖాళీగాఉన్నాయి. వాటిని కూడా మొత్తంగా తీసుకుంటే అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించవచ్చునని ప్రభుత్వం భావిస్తోందిట. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికల్లా రాజధాని తరలింపు ఉంటుందని అంటున్నారు.

రహస్య పరిశీలన……

ఇక విశాఖకు రాజధాని తరలింపు అంటే అది పెద్ద రచ్చగా మారుతోంది. అదే సమయంలో కోర్టులో కేసు ఉన్న నేపధ్యంలో అధికారులు రహస్యంగానే ఈ ప్రాంతానికి వచ్చి అవసరమైన‌ భవనాలను పరిశీలిస్తున్నారు. అధికారులు రాత్రి వేళల్లో రావడం విశేషం. దీని మీద అధికారులు కొందరు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్న మాట ఏంటి అంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికి విశాఖకు సచివాలయం సహా అన్ని షిఫ్ట్ అవుతాయని. మరి అప్పటికి కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది అంటున్నారు. మరో వైపు స్టేట్ గెస్ట్ హౌస్ కూడా కాపులుప్పాడలో ప్రభుత్వం నిర్మాణం చేయాలని తలపెట్టడం వెనక కూడా రాజధాని జోరు ఉందన్నది తెలిసిందే.

Tags:    

Similar News