మౌనమే మంచిది… లేకుంటే?

బాగా చదువుకొన్నాక కీకరకాయ అని వెనకటికి ఒకడు అన్నాడని చెబుతారు. అలా తెలివి అతి తెలివి అన్నీ కలసి ఏపీ రాజధానిని చిరిగి చేట చేస్తున్నాయా? అనిపించకమానదు. [more]

Update: 2021-09-02 00:30 GMT

బాగా చదువుకొన్నాక కీకరకాయ అని వెనకటికి ఒకడు అన్నాడని చెబుతారు. అలా తెలివి అతి తెలివి అన్నీ కలసి ఏపీ రాజధానిని చిరిగి చేట చేస్తున్నాయా? అనిపించకమానదు. అసలు ఏ రాష్ట్రానికి లేనన్ని వివాదాలు ఒక్క ఏపీకే ఉండడం శాపమైతే ఇక రాజధాని విషయంలో ఎవరికి తోచిన విధంగా వారు చెబుతున్న భాష్యాలు కూడా పరిస్థితిని మరింతగా గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇంతకీ ఏపీకి రాజధాని ఏదీ అంటే ఎవరూ చెప్పలేని స్థితి. ఆఖరుకి కేంద్రం సైతం ఒకసారి వైజాగ్ అని మరోసారి అమరావతి అంటూ తెగ తడుముకుంటోంది. దీనికంతటికీ కారణం రాజధాని పేరిట సాగుతున్న రాజకీయమే అని చెప్పాల్సిందే.

ఆలాగనా…?

ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటూ ఇటీవల వైసీపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పుకొచ్చారు. రాజధాని అంటూ రాజ్యాంగంలో ప్రత్యేకంగా నిర్వచించి లేదని కూడా ఆయన అంటున్నారు. అందువల్ల సీఎం పులివెందులలో ఉన్నా, విశాఖలో ఉన్నా, విజయవాడలో ఉన్నా అదే రాజధాని అంటూ మేకపాటి మూడు రాజధానుల గురించి సమర్ధిస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడే ఆయన నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. జగన్ విహారానికి సిమ్లా వెళ్లారు. అది కూడా మన రాజధాని అని రాసేసుకోవాలా మంత్రి గారూ అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ మొదలైపోయింది. ఇక సీఎం గారూ మా వూరికి రండి, మా గ్రామాన్ని కూడా రాజధాని చేసి పొండి అంటూ నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే దానికి కారణం ఇలాంటి ప్రకటనలే అనుకోవాలిగా.

మరీ కామెడీగా…

మూడు రాజధానుల మీద ముచ్చట ఉంటే ఉండొచ్చు. కానీ అది సీరియస్ మ్యాటర్. దేశం ఇంతకు ముందు వరకూ ఎరగని ప్రయోగం. దిగితే కానీ దాని లోతుపాతులు, సాధ్యాసాధ్యాలు ఎవరికీ తెలియవు. అలాంటి విషయంలో వైసీపీ పెద్దలు ఆచీ తూచీ మాట్లాడాలి. నిన్నటికి నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖే మన రాజధాని, అమరావతి రైతులతో చర్చలు జరపాల్సిన పని లేదు అంటారు. ఇపుడు గౌతం రెడ్డి అయితే ఏపీకి ఫలానా రాజధాని అని ఉండదని కామెడీ డైలాగులు చెబుతున్నారు. నిజానికి ఇంతటి సీరియస్ మ్యాటర్ ని ఎలా డీల్ చేయాలో తెలియకపోతే మంత్రులు మౌనం వహించడం మంచిది కానీ ఏదో చెప్పాలనుకుని మరింతగా జనాలలో నెగిటివిటీని తెచ్చుకోవడం ఎందుకు అన్నదే అందరి మాట.

అది సెంటిమెంట్ …

ఏపీకి రాజధాని సరైనది గత డెబ్బై ఏళ్ళుగా లేకపోవడం అన్నది బాధాకరం. ఒక విధంగా చూస్తే ప్రజలలో అది సెంటిమెంట్ గా కూడా ఉంది. అమరావతి రాజధాని అన్నాక రాయలసీమ, ఉత్తరాంధ్రా ప్రజానీకంలో ఆవేశం, బాధా కలిగాయి అన్నది వాస్తవం, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకటి కాదు మూడు అంటూ ఉన్న ఉన్న నాలికే లేకుండా చేయడం పట్ల మాత్రం వ్యతిరేకత మూట కట్టుకునే లాగే ఉంది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కోర్టు తీర్పు వచ్చేంతవరకూ సంయమనాన్ని పాటించాల్సిన వైసీపీ మంత్రులు పూటకో మాట మాట్లాడితే అంతిమంగా అది జగన్ సర్కార్ కే చేటు తెస్తుంది. చివరికి విసిగిన జనం జై అమరావతి అన్నా అంటారు. మొత్తానికి రాజధాని అన్నది సున్నితమైన అంశం, భావోద్వేగాలతో కూడుకున్న వ్యవహారం. దీన్ని లైట్ గా తీసుకుంటే మాత్రం ఏపీ జనాలే టైట్ చేసి పారేస్తారు అన్నదే వైసీపీ శ్రేయోభిలాషుల మాట.

Tags:    

Similar News