గెలుపోటములపైనే… ఫ్యూచర్

మధ్యప్రదేశ్ లో ప్రచారం హోరా హోరీ గా సాగుతుంది. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాన్ని శాసిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల [more]

Update: 2020-10-19 18:29 GMT

మధ్యప్రదేశ్ లో ప్రచారం హోరా హోరీ గా సాగుతుంది. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాన్ని శాసిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానంగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తే మరోసారి ప్రభుత్వం మారక తప్పదు. అందుకే బీజేపీ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకుంది.

28 స్థానాలకు….

మధ్యప్రదేశ్ లో నవంబరు 3వ తేదీన 28 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో కమల్ నాధ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మొత్తం 22 మంది ఎమ్మెల్యేలతో జ్యోతిరాదిత్య సింధియా జంప్ చేయడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే…..

మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలున్నాయి. కాంగ్రెస్ కు ఇతర పార్టీలతో కలుపుకుంటే వంద మంది మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 116గా ఉంది. ప్రస్తుతం జరిగే 28 స్థానాల్లో ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుంటుంది. ఉప ఎన్నికలు జరిగేవన్నీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే కావడంతో గెలుచుకోవడం సులువేనని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే ఇక్కడ కమల్ నాధ్ కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు.

బీజేపీ కి ప్రతిష్టాత్మకం….

ఇక బీజేపీకి కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలవకపోతే అధికారం నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మండలాల వారీగా బీజేపీ బాధ్యులను నియమించింది. నియోజకవర్గానికి ఒక మంత్రిని నియమించింది. ప్రతి ఓటు కీలకం కావడంతో బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలను మొదలు పెట్టింది. మొత్తం మీద మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయనే చెప్పాలి. ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో ఉప ఎన్నికలు జరగలేదు. ఇదే ప్రధమం కావడం, గెలుపోటములు నేతల ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుండటంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Tags:    

Similar News