మోడీకి ఇది మంట పుట్టిస్తుందా?

Update: 2018-05-28 11:58 GMT

దేశవ్యాప్తంగా ఎదురులేకుండా సాగుతున్న నరేంద్ర మోడీ-అమిత్ షాల జైత్రయాత్రకు కర్ణాటక ఒకరకంగా బ్రేక్ వేసింది. వాస్తవానికి కర్ణాటక కంటే ముందే ఉత్తరప్రదేశ్ లో, స్వయానా అక్కడి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ సొంత నియోజకవర్గం గోరక్ పూర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో మొదటి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోవడం, యూపీలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాన్ని కోల్పోవడంలో బీజేపీకి మింగుడు పడడం లేదు. అయితే, ఇది బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్న ప్రాంతీయ, ప్రతిపక్ష పార్టీల ఐక్యతతోనే సాధ్యమయ్యింది. అయితే, ఇప్పటికే నిరాశలో ఉన్న బీజేపీకి దేశ్యవాప్తంగా సోమవారం జరిగిన ఉప ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.

కైరానానే కీలకం...

దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉప ఎన్నికలు జరిగాయి. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని ఫాల్గర్, భండారా, గోండియా స్థానాలతోపాటు నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 31న వెలువడతాయి. అయితే, యూపీలోని కైరానా లోక్‌సభ ఉపఎన్నికపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటవుతున్న తరుణంలో మత ఘర్షణలతో కేంద్ర బిందువుగా ఉన్న ఉత్తరప్రదేశ్ కైరానాలో బైపోల్ జరుగుతోంది. బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఆయన కుమార్తె మ్రిగాంకాసింగ్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్సీ మద్దతుతో లోక్‌దళ్ అభ్యర్థి తబస్సుమ్ ఆమెతో తలపడుతున్నారు.

విపక్షాల ఐక్యతకు మరో అవకాశం....

ఇంతకుముందు యూపీలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు నువ్వానేనా అన్నట్లుగా ఉండే ఎస్పీ, బీఎస్పీలు చేతులుకలిపాయి. ఉమ్మడిగా పోటీ చేసి బీజేపీని ఓడించాయి. ఇక ఇటీవలి కర్ణాటక రాజకీయం అందరికీ తెలిసిందే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటై అధికారం చేపట్టాయి. ఇలా మోడీ, బీజేపీ పైన వ్యతిరేకతతో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఒక్కటవుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు మోడీ వ్యతిరేక కూటమికి, బీజేపీకి చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లోని కైరానాలో విపక్షాలన్నీ ఏకమై బీజేపీకి సవాల్ విసిరాయి. ఈ ఎన్నికల్లో ఒకవేళ విపక్షాల అభ్యర్థి విజయం సాధిస్తే దేశ్యవాప్తంగా విపక్షాల ఐక్యత బలపడుతుంది. అయితే, బీజేపీ గెలిస్తే మాత్రం కూటమి ఆలోచనలు చేసే వారి స్థైర్యం దెబ్బతింటుంది. దీంతో ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఎలా ఉన్నా మరో సంవత్సరంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేయనుంది.

Similar News