అమ‌రావ‌తి సెంటిమెంట్‌.. తిరుప‌తిపై ప‌నిచేస్తుందా…?

త్వర‌లోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇప్పటి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంటే.. [more]

Update: 2020-11-24 02:00 GMT

త్వర‌లోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇప్పటి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంటే.. మ‌రో మూడు మాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం కానుంది. గ‌త ఏడాది ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత స్థానిక ఎన్నిక‌లు ఈ ఏడాది ప్రారంభంలోనే ముగియాల్సి ఉన్నప్పటికీ.. క‌రోనాతో ఆగిపోయాయి. ఇక, ఇప్పుడు అన్ని పార్టీల‌కూ ప్రతిష్టాత్మకంగా మార‌నున్న తిరుప‌తి ఉప పోరుకు రంగం సిద్ధమ‌వుతోంది. అయితే రాజ‌ధాని విష‌యంలో పార్టీలు అనుస‌రిస్తున్న వైఖ‌రి ఇప్పుడు ఎన్నిక‌లో ప్రధాన అంశంగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఆ అంశమే ప్రధాన అజెండాగా…..

రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంబిస్తున్న వైఖ‌రిని అన్ని విధాలా త‌ప్పుబ‌డుతున్న ప్రతిప‌క్షం టీడీపీ, ఇత‌ర ప‌క్షాలైన క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్‌లు.. ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. అంటే రాజ‌ధాని అజెండానే ప్రధాన ప్రాతిప‌దిక‌గా తీసుకుంటార‌ని స్పష్టంగా సంకేతాలు వ‌స్తున్నాయి. ఇక‌, బీజేపీ రాజ‌ధాని విష‌యంలో స్పష్టమైన వైఖ‌రిని ప్రద‌ర్శించ‌లేక‌పోతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తిగా కొన‌సాగాలా ? వ‌ద్దా ? అనే విష‌యంలో ఆ పార్టీలో అనేక మ‌త‌ల‌బులు క‌నిపిస్తున్నాయి. కొంద‌రు వ‌ద్దంటున్నారు. మ‌రికొంద‌రు కావాలంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో బీజేపీలో వ్యూహాత్మక రాజ‌కీయ శూన్య‌త క‌నిపిస్తోంది. దీంతో ఉప పోరులో రాజ‌ధాని అంశాన్ని ప్రస్థావించే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు.

వైసీపీ పథకాలను మాత్రమే…..

ఇక‌, మ‌రోప‌క్షం జ‌న‌సేన‌. అన్ని పార్టీల‌క‌న్నా ఎక్కువ‌గా న‌లిగిపోతున్న పార్టీ ఏదైనా ఉంటే.. అది జ‌న‌సేన మాత్రమే. బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఆ పార్టీ రాజ‌ధానిపై ఎటూ మాట్లాడ‌లేక పోతోంది. దీంతో పోటీకి దూరంగా ఉండి.. బీజేపీకి మ‌ద్దతిచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక‌, ప్రధాన పార్టీ వైసీపీ. రాజ‌ధాని విష‌యాన్ని స్పృశిస్తుందా ? అంటే కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌ధాని విష‌యాన్ని ప‌క్కన పెట్టి.. గ్రేట‌ర్ తిరుప‌తి, రాయ‌ల‌సీమ‌ను కూడా అభివృద్ధి చేయ‌డం, ముఖ్యంగా తిరుప‌తిని అభివృద్ది చేస్తున్న అంశంతోపాటు జ‌గ‌న‌న్న ప‌థ‌కాల‌ను ఎంచుకోనుంది.

బలంగా తీసుకెళ్లేందుకు…..

అయితే వైసీపీ అసంతృప్త న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు మాత్రం తాను త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని.. తాను రాజ‌ధాని అమ‌రావ‌తి రిఫ‌రెండెంగా ఎన్నిక‌ల‌కు వెళ్లి సీఎం జ‌గ‌న్‌పై అయినా ల‌క్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాన‌ని స‌వాళ్లు రువ్వుతున్నారు. ఈ టైంలో తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో రాజ‌ధాని అంశం ఏ మేర‌కు ప్రభావం చూపుతుంద‌న్నది కూడా ఆస‌క్తిగానే మారింది. వైసీపీ మాత్రం రాజ‌ధాని అంశాన్ని ప్రస్తావించకుండా తెలివిగా వ్యవ‌హ‌రించే ఛాన్సులు ఉన్నాయి. ఇలా.. మొత్తంగా చూస్తే రాజ‌ధాని అంశాన్ని బ‌లంగా తీసుకువెళ్లేందుకు మ‌ళ్లీ టీడీపీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు మాత్రమే క‌నిపిస్తున్నాయి. ఇక‌, తిరుప‌తి ప్రజ‌ల మూడ్‌నుబ‌ట్టి రాజ‌ధాని వ్యూహం ఫ‌లించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News