బుట్టాకు వన్ పర్సంటేనట

బుట్టా రేణుక తొలిసారి ఎంపీగా గెలిచి వెనువెంటనే రాజకీయంగా తప్పటుడుగులు వేశారు. ఒక్కసారి ఎంపీగానే ముద్రపడి పోయారు. అయితే తాజాగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తన [more]

Update: 2020-02-23 00:30 GMT

బుట్టా రేణుక తొలిసారి ఎంపీగా గెలిచి వెనువెంటనే రాజకీయంగా తప్పటుడుగులు వేశారు. ఒక్కసారి ఎంపీగానే ముద్రపడి పోయారు. అయితే తాజాగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తన పేరు ఖరారు చేయాలని బుట్టా రేణుక కోరుతున్నారట. ఆమె ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలను కలసి తన మనసులో మాటను చెప్పినట్లు తెలిసింది. అయితే జగన్ తో చెప్పి చూస్తామని, పూర్తి స్థాయి హామీ మాత్రం వారి నుంచి రాలేదట. దీంతో నేరుగా జగన్ తోనే మాట్లాడేందుకు బుట్టా రేణుక అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.

వైసీపీ నుంచే…..

బుట్టా రేణుక రాజకీయ అరంగేట్రం వైసీపీ నుంచే చేశారు. 2014 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టా రేణుక మంచి విజయాన్నే నమోదు చేశారు. బీసీ సామాజికవర్గం నేత కావడం, మహిళ అవ్వడంతో పార్టీలో కూడా బుట్టా రేణుకకు ప్రాధాన్యం దక్కింది. అయితే రాష్ట్రంలో అప్పుడు వైసీపీ అధికారంలోకి రాలేకపోవడంతో బుట్టా రేణుక భర్త నీలకంఠం ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీలో చేరిపోయారు. పారిశ్రామిక వేత్తలు కావడం, వివిధ వ్యాపారాలు ఉండటంతో అధికార పార్టీలో ఆయన చేరారని భావించారు.

చివరి నిమిషంలో చేరి….

ఇక బుట్టా రేణుక మాత్రం వైసీపీలోనే కొంతకాలం కొనసాగారు. అయితే జగన్ పాదయాత్ర ప్రారంభమయిన తర్వాత ఆమె పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకున్నారు. తనతోపాటా అనుచరులతో కలసి అమరావతికి వెళ్లి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి టీడీపీ టిక్కెట్ ఖారారు చేయడం, ఆదోని, ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వకపోవడంతో టీడీపీని వీడి ఎన్నికలకు ముందు వైసీపీలో బుట్టా రేణుక చేరారు. జగన్ కూడా సాదరంగా ఆహ్వానించారు.

వైసీపీ సీనియర్ నేతతో…..

అయితే ఇప్పుడు రాజ్యసభ స్థానాలు నాలుగు ఖాళీ అవుతుండటంతో బుట్టా రేణుక గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతతో ఇప్పటికే రేణుక మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు. పూర్తి స్థాయి హామీ లేకున్నా ఆలోచిస్తామని ఆయన నుంచి జవాబు రావడంతో బుట్టా రేణుక జగన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే వైసీపీలో అనేక మంది రాజ్యసభ ఎన్నికల రేసులో ఉన్నారు. వీరిలో కిల్లి కృపారాణి కూడా ఒకరు. మరి బుట్టా రేణుకకు రాజ్యసభ స్థానం దక్కేది వన్ పర్సంటేజీ అని తెలిసినా ఆమె మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News