ఆ వైసీపీ ఎమ్మెల్యే అడ్రస్ ఎక్కడ‌… అంతా ర‌చ్చగానే ఉందే?

ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గెలుపు గుర్రం ఎక్కారంటే.. దాని వెనుక కేవ‌లం ఆయ‌న సొంత బ‌లం ఒక్కటే ఉంటుంద‌ని అనుకుంటే పొర‌పాటు. కార్యక‌ర్తల నుంచి నాయ‌కుల నుంచి [more]

Update: 2020-12-03 14:30 GMT

ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గెలుపు గుర్రం ఎక్కారంటే.. దాని వెనుక కేవ‌లం ఆయ‌న సొంత బ‌లం ఒక్కటే ఉంటుంద‌ని అనుకుంటే పొర‌పాటు. కార్యక‌ర్తల నుంచి నాయ‌కుల నుంచి జెండా మోసేవారు.. జెండా క‌ట్టేవారు.. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు నిస్వార్థంగా.. ప్రజ‌ల మ‌ధ్య ఉండి త‌మ నాయ‌కుడి గెలుపు కోసం ప‌రిశ్రమించేవారు.. ఇలా అనేక రూపాల్లో అనేక మంది చేసిన ప్రయ‌త్నమే ఒక నాయ‌కుడిని ప్రజ‌ల్లో గెలిపించి చ‌ట్టస‌భ‌ల‌కు వ‌చ్చేలా చేస్తుంది. ఇక పార్టీ అధినేత వేవ్‌, స్థానికంగా ఇత‌ర పార్టీ నేత‌ల మీద ఉన్న వ్యతిరేక‌త ఇవ‌న్నీ కూడా దానికి ప్లస్ అవుతాయి. అయితే.. ఇంత శ్రమ‌ను గుర్తించే నాయ‌కులు త‌గ్గిపోయారు. ఏదో డ‌బ్బులు వెద‌జ‌ల్లుతున్నాం.. గెలుస్తున్నాం.. అనే నాయ‌కులు పెరుగుతున్నారు. దీంతో స‌ద‌రు నాయ‌కుల‌పై తీవ్ర విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టిక్కెట్ ఇవ్వవద్దంటూ….

ఇలాంటి వారిలో ప్రకాశం జిల్లా క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లోల క‌నిగిరి నుంచి ఆయ‌న 35 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో ఓడియ‌న బుర్రా మ‌ధుసూద‌న్ కు గ‌త ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వొద్దని స్థానిక వైసీపీ శ్రేణులు ఎంత మొత్తుకున్నా జ‌గ‌న్ మాత్రం ప్రకాశం జిల్లాలో బీసీల్లో బ‌లంగా ఉన్న యాదవ సామాజిక వ‌ర్గానికి ప్రాతినిధ్యం ఉండాల‌ని మ‌ధుకు మ‌రోసారి టిక్కెట్‌ ఇచ్చారు. క‌నిగిరిలో రెడ్డి వ‌ర్గం రాజ‌కీయంగా దూకుడుగా ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీల‌తో సంబంధం లేకుండా వీరంతా జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ని బుర్రా మ‌ధుసూద‌న్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు చాలా క‌ష్టప‌డ్డారు.

టీడీపీ నుంచి వచ్చిన వారికి….

ఎన్నికల్లో గెలిచే వ‌ర‌కు రెడ్లతో పాటు వైసీపీ కార్యక‌ర్తల‌కు ఎంతో ప్రయార్టీ ఇచ్చిన ఆయ‌న ఆ త‌ర్వాత వారిని ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదంటున్నారు. పైగా పార్టీలో ఉన్న కాంట్రాక్టర్లను, చిన్నపాటి ప‌నులు చేసే వారిని కూడా ఆయ‌న విస్మరిస్తున్నారు. ఎవ‌రికీ ఏడాదిన్నర‌లో ఒక్క రూపాయి ప‌ని కూడా అప్పగించ‌లేద‌ని ఇక్కడి వారు వాపోతున్నారు. పార్టీలో ఉన్న రెడ్డి నేత‌ల‌కు ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ కు రోజురోజుకు గ్యాప్ పెరిగిపోతోంది. పైగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న నేత‌ల‌ను తీసుకుని వారికి ప్రాధాన్యత ఇస్తుండ‌డంతో ఆయ‌న విజ‌య కోసం క‌ష్టప‌డ్డ అస‌లు సిస‌లు వైసీపీ నాయ‌కుల‌కు మంట పెట్టేస్తోంది. అయితే కొన్ని వ‌ర్గాలు, కొంద‌రు నేత‌లు ఎమ్మెల్యేపై పెత్తనం చేయాల‌ని చూస్తున్నార‌ని.. నియోజ‌క‌వ‌ర్గం మొత్తాన్ని వారి కంట్రోల్లోనే ఉంచేలా చేస్తున్నార‌ని.. అది న‌చ్చకే కొంద‌రిని ఆయ‌న దూరం పెడుతున్నార‌ని ఎమ్మెల్యే అనుకూల వ‌ర్గం ఆరోపిస్తోంది.

బెంగుళూరుకే పరిమితం….

వాస్తవానికి బుర్రా మ‌ధుసూద‌న్ వ్యక్తిగ‌తంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. కాంట్రాక్టరు కూడా. ఇదే ఇప్పుడు ఆయ‌న‌కు పార్టీలోని మిగిలిన నాయ‌కుల‌కు మ‌ధ్య గ్యాప్‌ను పెంచుతోంది. త‌నే వ్యాపారి కాబ‌ట్టి.. త‌నే ప‌నులు చేసుకుంటున్నారు. చివ‌ర‌కు చిన్నా చిత‌కా ప‌నుల నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో ట్యాంక‌ర్లతో తాగునీటి పంపిణీ కూడా ఆయ‌న క‌నుస‌న్నల్లోనే న‌డుస్తుండ‌డంతో పార్టీ కోసం క‌ష్టప‌డ్డ మాకు ఫ‌లితం ఏంట‌ని వారు ర‌గులుతున్నారు. పైగా నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ‌ప్రధాన వ్యాపారాల‌న్నీ కూడా బెంగ‌ళూరులో ఉండ‌డంతో ఆయ‌న అక్కడే ఎక్కువ‌గా ఉంటున్నార‌నే వాద‌న కూడా నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తోంది. దీంతో.. బుర్రా మ‌ధుసూద‌న్ పై ఇటు పార్టీలోను.. అటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ వ్యతిరేక‌త పెరుగుతోంది. దీనిపై ఇప్పటికే కొంద‌రు సీనియ‌ర్లకు కూడా ఫిర్యాదులు వెళ్లాయ‌ని తెలుస్తోంది. మంత్రి బాలినేని ఇక్కడ పంచాయితీ చేసేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నా అవి కొలిక్కి వ‌చ్చేలా లేవు.

Tags:    

Similar News