మంత్రి అవ్వలేకపోయినా ఆ కోరిక…?

జగన్ ని నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందని ఎపుడూ అంటారు. ఆయన సైతం పార్టీ కోసం పనిచేసే వారిని ఏరి కోరి మరీ దగ్గరకు తీస్తారు. వారికే [more]

Update: 2019-08-11 00:30 GMT

జగన్ ని నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందని ఎపుడూ అంటారు. ఆయన సైతం పార్టీ కోసం పనిచేసే వారిని ఏరి కోరి మరీ దగ్గరకు తీస్తారు. వారికే ప్రాధాన్యత ఇస్తూ ముందు వరసలోకి తీసుకువస్తారు. విశాఖ జిల్లాకు చెందిన మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు వైసీపీలో కీలకమైన నేత. ఆయన జగన్ తోనే ఉంటూ ఆయన బాటలో నడుస్తూ పార్టీకి అంకితం అయిపోయారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి తనను ఎమ్మెల్యే చేశారన్న అభిమానం ఎపుడూ బూడికి జగన్ మీద ఉంది. 2014 ఎన్నికలో ఆయన మాడుగుల నుంచి గెలిచారు. జిల్లాలో ముగ్గురు వైసీపీ నేతలు గెలిస్తే వారిలో బూడి తప్ప మిగిలిన ఇద్దరూ పార్టీ గేట్ దాటేశారు. ఏకంగా టీడీపీ ఆయన్ని సైకిలెక్కించేందుకు కోట్లలో రాయబేరాలు నడిపిందని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. అయినా ఫ్యాన్ నీడ నుంచి పోలేదు. అదే జగన్ కి బాగా నచ్చింది.

మంత్రి అవుతాడనుకుంటే….

ఇదిలా ఉండగా బూడి రెండవమారు కూడా మాడుగుల నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. ఇక తనకు మంత్రి పదవి ఖాయమని కూడా ఆయన సంబరాలు చేసుకున్నారు. అయితే సామాజికవర్గ సమీకరణల మూలంగా జగన్ ఆయనికి ఇవ్వలేకపోయారు. అయితే దానికి బదులుగా ఆయన్ని ప్రభుత్వ విప్ గా నియమించారు. అంతటితో వూరుకోకుండా తాజాగా సహాయ మంత్రి హోదాను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో బూడికి మంత్రి కావాలన్న సరదా ఆ విధంగా తీరిందని అంటున్నారు. ప్రోటోకాల్ ఉంటుంది. సహాయ మంత్రి హోదాలో అధికార మర్యాదలు ఉంటాయి. ఇపుడు బూడి వర్గంలో కొత్త సంతోషం కనిపిస్తోంది.

అపుడేనా అవుతుందా…?

ఇక రెండున్నరేళ్ళ తరువాత మంత్రి వర్గ విస్తరణలో బూడికి చాన్స్ లభిస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. విశాఖ రూరల్ జిల్లాలో బూడి కంటే సీనియర్లు అనేకమంది ఉన్నారు. మూడుసార్లు గెలిచిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు, అదే మూడు సార్లు గెలిచిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. మరో వైపు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కూడా కాచుకుని కూర్చున్నారు. ఇదిలా ఉండగా బూడికి ఎవరూ పోటీ కాదని ఒక్క చోడవరం ఎమ్మెల్యే కరణంతోనే ఇబ్బంది అని ఆయన వర్గం అంటోంది. మొదటి విడతలోనే పదవి రాకపోవడానికి ధర్మశ్రీ కారణమని బూడి వర్గం అనుమానిస్తోందట. అందువల్ల రేపటి రోజునైనా మంత్రి పదవి దక్కుతుందా అన్న చింత మాత్రం అలాగే ఉండగా ఇపుడు మాత్రం సహయమంత్రి హోదా రావడం ఆనందమేనని బూడి అంటున్నారు. జగన్ కి అన్నీ తెలుసని, భవిష్యత్తులో తనకు తప్పక అవకాశం ఉంటుందని కూడా నమ్ముతున్నారు.

Tags:    

Similar News