పైచేయి ఎవరిదనేనా…?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 14వ రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో వాడి వేడి చర్చలు జరిగాయి. దాదాపు 20 కీలక బిల్లులకు ఈ [more]

Update: 2019-07-31 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 14వ రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో వాడి వేడి చర్చలు జరిగాయి. దాదాపు 20 కీలక బిల్లులకు ఈ సమావేశాలు ఆమోదం తెలిపాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఏపీ మొత్తం వైసీపీ వైపు ఆసక్తికరంగా చూసింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ జరిగింది. బడ్జెట్ లో వైసీపీ ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయింపులు చూసి సంతృప్తి వ్యక్తమయింది. ప్రధానంగా రైతులకు వివిధ రూపాల్లో ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకాలు అన్నదాతలకు ఊరటనిచ్చాయనే చెప్పాలి.

సత్తా చాటేందుకు…..

ఇక రెండు ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంలు తమ సత్తాను చాటేందుకు శాసనసభను వేదికగా చేసుకున్నాయని చెప్పాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను, అవకతవకలను అధికార వైసీపీ బయటకు తీసుకువస్తుంటే, మీరేం చేస్తున్నారంటూ టీడీపీ ఎదురు దాడికి దిగింది. ఇలా బడ్జెట్ సమావేశాలు రోజూ వాడివేడిగా సాగాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిటీకి ఈ సభలో ఆదేశించడం విశేషం.

రోజూ వ్యూహరచన…..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ సమావేశానికి ముందు ప్రతిరోజూ వ్యూహకమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో టీడీపీ లేవనెత్తిన ప్రశ్నలు, చెప్పాల్సిన సమాధానాలు, టీడీపీ ఇరుకున పెట్టేందుకు ఉన్న అవకాశాలపై వైసీపీ వ్యూహరచన కమిటీ సమావేశంలో చర్చించే వారు. ప్రతిరోజు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాల్సిందేనని, ఇందుకు అటిండెన్స్ ను కూడా తీసుకోవాలని జగన్ ఆదేశించడం విశేషం. వైసీపీ ఇలా మొత్తం సభలో పైచేయి సాధించేందుకు గట్టిగా కృషి చేసిందనే చెప్పాలి.

సస్పెన్షన్లతో సానుభూతి…

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఈ సభ ద్వారా సానుభూతిని పొందేందుకు ప్రయత్నించిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పై వైసీపీ నేతలు ఫైర్ అవ్వడం తమకు కలసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. ఇక ముగ్గురు శాసనసభ ఉప పక్ష నాయకులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు,బుచ్చయ్య చౌదరిలు సమావేశాలు మొత్తాన్ని సస్పెండ్ చేయడం తమకు కలసి వస్తుందని భావిస్తున్నారు. తొలిసారి సస్పెన్షన్లకు గురి కావడం ఈ సభ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గానే ముగిసినా ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునేందుకే కాలహరణం చేశారన్న విమర్శ లేకపోలేదు.

Tags:    

Similar News