కోపంలో నిజాలు చెప్పేస్తున్నారే ?

నిజం నిప్పులాంటిది. రాజకీయాల్లో అది నివురు గప్పె ఉంటుందని తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యుల వ్యవహారంతో మరోసారి రుజువు అయ్యింది. బిజెపిలోకి నలుగురు ఎంపీలు ఒకేసారి దూకేయడంతో [more]

Update: 2019-06-21 12:30 GMT

నిజం నిప్పులాంటిది. రాజకీయాల్లో అది నివురు గప్పె ఉంటుందని తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యుల వ్యవహారంతో మరోసారి రుజువు అయ్యింది. బిజెపిలోకి నలుగురు ఎంపీలు ఒకేసారి దూకేయడంతో తెలుగు తమ్ముళ్ళు నోటినుంచి ఇప్పుడు నిజాలు వచ్చేస్తున్నాయి. పసుపు నేతలు చేస్తున్న హాట్ కామెంట్స్ తో పార్టీలో వున్న లోపాలు ప్రజలకు ఆ పార్టీ క్యాడర్ కి కళ్ళకు కట్టినట్లు కనిపించేస్తున్నాయి. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజార్చారో సాధారణ జనానికి అర్ధమైపోయేలా ప్రస్తుత ఎపిసోడ్ అద్దం పట్టేస్తుంది.

ఆయారాం … గయారాం లకే పెద్దపీట …

ఆర్ధికంగా పార్టీకి పెట్టుబడి పెట్టేవారు అయితే చాలు. లేదా పెద్ద పారిశ్రామిక వేత్త అయితే మరీ మంచిది ఉభయకుశలోపరి గా ఉంటుంది. ఇది చంద్రబాబు సాగించిన రాజకీయం. పార్టీ జండా మోసే కార్యకర్తలు ఎవ్వరు ? కష్టకాలంలో కూడా ఉంటుంది ఎవ్వరు ? ఇవన్నీ చంద్రబాబు నాయుడు కు తెలియనివి కాదు. కానీ 2004 తరువాత పదేళ్ళు విపక్షానికి పరిమితం అయిన చంద్రబాబు నాయుడు పార్టీని మోసేందుకు ఎన్టీఆర్ సిద్ధాంతాలు డస్ట్ బిన్ లో పడేశారు. బడాబాబులకు టిడిపిని అప్పగించారు. అలాంటివారే సుజనా చౌదరి, సిఎం రమేష్ , గరికపాటి వంటివారు. ఇక గాలివాటం రాజకీయాలు నడిపే టిజి వెంకటేష్, నారాయణ వంటివారికి పసుపు పార్టీలో కొదవే లేదు.

సీనియర్లు నెత్తి నోరు కొట్టుకున్నా …

టిడిపి లోకి గేట్లు ఎత్తివేసి వైసిపి ఎమ్యెల్యేలు, ఎంపీలకు రెడ్ కార్పెట్ పరిచేశారు చంద్రబాబు నాయుడు. ఇది పార్టీ పతనానికి దారితీస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్లు ధైర్యంగానే ముందే హెచ్చరించారు. అలాగే ఆయారాం గయారాం లతో పార్టీకి వచ్చే లాభం కన్నా వారు వ్యక్తిగతంగా లాభపడతారని వారు చెప్పినా చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు బాబు మార్క్ పాలిటిక్స్ నే ఇలా తమ స్వలాభాలకోసం వచ్చిన నేతలు ప్రయోగిస్తున్నారు.

పంచాయితీ సభ్యులు కూడా కాలేని వారిని …

ప్రజా క్షేత్రంలో ఏ మాత్రం పట్టులేని వారు డబ్బుంటే రాత్రికి రాత్రి ఎమ్యెల్సీలుగా, రాజ్యసభ్యులుగా అవతరిస్తున్నారు. జంప్ అయిన టిడిపి ఎంపీల వ్యవహారంపై కౌంటర్ ఇస్తున్న బుద్ధా వెంకన్న వంటివారు తమ విమర్శల్లో ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నారు. పంచాయితీ సభ్యులు కూడా కాలేని వారందరిని ఎంపీలు చేస్తే ఇదా మీ పని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో నిజాలు చెప్పేస్తున్నారు. అలా వారు కోపంలో చేస్తున్న వ్యాఖ్యలతో ఫార్టీ ఇయర్స్ పాలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు డొల్లతనం తేలిపోతుంది. జండా మోసే వారిని కాకుండా కార్పొరేట్ వ్యక్తులతో పార్టీ నడిస్తే ఇప్పుడే కాదు భవిష్యత్తు కూడా టిడిపికి అంధకారమే అన్నది ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. తగిలిన దెబ్బలతో ఇప్పటికైనా పసుపు పార్టీ తన పంథా మార్చుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News